కారులో కణతపై కాల్చుకొని... | Young Businessman Suicide At ORR With Gun | Sakshi
Sakshi News home page

కారులో కణతపై కాల్చుకొని...

Published Fri, Jul 5 2019 2:31 AM | Last Updated on Fri, Jul 5 2019 5:03 AM

Young Businessman Suicide At ORR With Gun - Sakshi

హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై కాల్పుల కలకలం చెలరేగింది. ఓఆర్‌ఆర్‌పై గురువారం ఓ యువ వ్యాపారి కణతపై తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు యత్నించాడు. కొనఊపిరితో కొట్టు మిట్టాడుతుండగా పోలీసులు ‘108’అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. కోమాలోకి చేరుకున్నాడని, అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నగర పోలీసు కమిషనరేట్‌లో ఉన్న తూర్పు మండల పరిధిలోని మలక్‌పేట ప్రెస్‌రోడ్‌కు చెందిన ఫైజన్‌ అహ్మద్‌ కొన్నేళ్ల క్రితం జ్యోతిషిని ప్రేమవివాహం చేసుకున్నాడు. తర్వాత తన మకాంను లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని జలవాయు విహార్‌ అపార్ట్‌మెంట్‌లోకి మార్చాడు. అందులోని మొదటిబ్లాక్‌లో సఫిల్‌గూడకు చెందిన పీవీ సుబ్రమణియంకు చెందిన ఫ్లాట్‌ నంబర్‌ 206ను 2013 అక్టోబర్‌లో అద్దెకు తీసుకున్నాడు. భార్యతో కలసి అక్కడే ఉంటున్నాడు. ఫైజన్‌ కుటుంబం చుట్టుపక్కలవారికి దూరంగా ఉండేది. విదేశాలకు వెళ్లేవారికి వీసా ప్రాసెసింగ్‌ చేసేందుకు పంజగుట్టలో ఓ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్నాడు. అందులో తీవ్ర నష్టాలు రావడంతో ఆర్థిక సమస్యలు తలెత్తాయి. ఆరు నెలలుగా ఫ్లాట్‌ అద్దె, మూడు నెలలుగా అపార్ట్‌మెంట్‌ నిర్వహణ రుసుములు కూడా చెల్లించట్లేదు. ఈయన గత ఏడాది అక్టోబర్‌లో డ్రివెన్‌ బై యు మొబిలిటీ సంస్థ నుంచి బెంజ్‌ కారు(టీఎస్‌ 09 యూబీ 6040) అద్దెకు తీసుకున్నారు. పదిహేను రోజులకోసారి అద్దె చెల్లించేలా సంస్థ నిర్వాహకుడు ఎస్‌ఎం జైన్‌తో ఒప్పందం చేసుకున్నారు. జలవాయు విహార్‌ అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌కు ఫైజన్‌ ఇచ్చిన పత్రాల్లో తమకు బైక్‌తోపాటు కారు ఉన్నట్లు పేర్కొన్నారు. అయినా అద్దె వాహనంలో ఎందుకు తిరుగుతున్నారో తేలాల్సి ఉంది.

అద్దెకు తీసుకున్న బెంజ్‌ కారులో వెళ్లి...
అద్దెకు తీసుకున్న బెంజ్‌ కారులో గురువారం శంషాబాద్‌ నుంచి గచ్చిబౌలి వైపు ఓఆర్‌ఆర్‌ మీదుగా ఫైజన్‌ బయలుదేరారు. నార్సింగి పోలీసుస్టేషన్‌ పరిధిలోని మంచిరేవుల సమీపంలో ఓఆర్‌ఆర్‌ పక్కనే కారును ఆపి అప్పటికే సిద్ధంగా ఉంచుకున్న నాటు పిస్టల్‌తో కుడి కణతపై కాల్చుకున్నారు. తలలోకి దూసుకుపోయిన తూటా బయటకు రాకుండా లోపలే ఉండిపోయింది. ఓఆర్‌ఆర్‌పై విధులు నిర్వహిస్తున్న గచ్చిబౌలి ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ వాహనాన్ని గమనించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆగి ఉన్న కారు వద్దకు వెళ్లి పరిశీలించారు. స్టీరింగ్‌ సీట్‌లో కూర్చొని ఉన్న ఫైజన్‌ రక్తపు ముద్దకావడం, చేతిలో తుపాకీ కనిపించడంతో వెంటనే అప్రమత్తమై ట్రాఫిక్‌ కంట్రోల్‌ రూమ్‌కు, ‘108’కు సమాచారం అందించారు. కొన ఊపిరితో ఉన్న ఫైజన్‌ను అంబులెన్స్‌లో గచ్చిబౌలిలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కారులో ఉన్న సెల్‌ఫోన్‌తోపాటు నాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్‌ ప్రాంతంలోని ఓఆర్‌ఆర్‌ వద్ద ఉన్న సీసీ పుటేజీని నార్సింగి పోలీసులు పరిశీలించారు. వాహనంలో ఫైజన్‌ ఒక్కడే ఉన్నట్లు, ఆ సమయంలో సిగరెట్‌ తాగుతూ డ్రైవ్‌ చేస్తున్నట్లు గుర్తించారు. 

ఆర్థిక సమస్యలు చెప్పేవాడు 
నా ఫ్లాట్‌ను 2013లో నెలకు రూ.12 వేల చొప్పున ఫైజన్‌కు అద్దెకు ఇచ్చాను. ఏనాడూ సకాలంలో అద్దె చెల్లించేవాడు కాదు. 9 నెలలకు, ఆరు నెలలకు, అతడి వద్ద డబ్బులు ఉన్నప్పుడు చెల్లించేవాడు. ఉద్యోగ రీత్యా మేము కూడా ఇతర రాష్ట్రాల్లో ఉండడంతో ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. 6 నెలల అద్దె బకాయి ఉంది. ఎప్పుడు అడిగినా ఆర్థిక సమస్యలు చెబుతుండేవాడు.  – సుబ్రమణియమ్, ఫ్లాట్‌ యజమాని

అక్రమ ఆయుధంగా నిర్ధారణ...
ఆత్మహత్యకు ఫైజన్‌ వినియోగించిన నాటు తుపాకీని పోలీసులు అక్రమ ఆయుధంగా నిర్ధారించారు. దీంతో ఆయుధచట్టం కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఇతడి వద్దకు ఈ ఆయుధం ఎలా వచ్చింది? ఎక్కడ నుంచి వచ్చింది? తదితర అంశాలు ఆరా తీస్తున్నారు. ఫైజన్‌ కోలుకున్న తర్వాత అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఫైజన్‌ అద్దెకు ఉంటున్న జలవాయు టవర్స్‌ సున్నిత ప్రాంతం కిందికి వస్తుంది. ఇందులో అనేకమంది మాజీ, ప్రస్తుత త్రివిధ దళాలకు చెందిన అధికారులు, డిఫెన్స్‌ సంస్థ ఉన్నతోద్యోగులు నివసిస్తుంటారు. అలాంటి నివాస సముదాయంలోకి ఫైజన్‌ ఓ నాటుతుపాకీతో వెళ్లి వచ్చాడనే అంశాన్ని పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఇది అపార్ట్‌మెంట్‌తోపాటు అందులో నివసిస్తున్నవారికీ ముప్పని, తీవ్రమైన భద్రతా లోపమని వ్యాఖ్యానిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement