ఎస్బీహెచ్ ‘ప్లాటినమ్’ డిపాజిట్ పథకం
♦ 75 వారాలకు 7.95% వడ్డీ
♦ ఈ ఏడాది ప్లాటినమ్ జూబ్లీ ఉత్సవాలు
♦ ఎస్బీహెచ్ ఎండీ శాంతను ముఖర్జీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్(ఎస్బీహెచ్) ఏర్పడి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఖాతాదారులకు ప్రత్యేక డిపాజిట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ‘ఎస్బీహెచ్ ప్లాటినమ్ డిపాజిట్’ పేరుతో ప్రవేశపెట్టిన ఈ డిపాజిట్ పథకంపై అధిక వడ్డీని అందిస్తున్నట్లు ఎస్బీహెచ్ ఎండీ శాంతను ముఖర్జీ తెలిపారు. 75 వారాల (525 రోజులు) కాలపరిమితి గల ఈ డిపాజిట్‌పై 7.95% వడ్డీని.. అదే సీనియర్ సిటజన్లకయితే 8.45% వడ్డీని అందిస్తున్నట్లు తెలిపారు. ప్లాటినమ్ జూబ్లీ ఉత్సవాలను ఈ ఏడాది పొడవునా ఘనంగా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
సుదీర్ఘకాలంగా బ్యాం కుతో అనుబంధం ఉన్న ఖాతాదారులను, పూర్వ ఉద్యోగులను ఏప్రిల్3న ఘనంగా సన్మానించనున్నామని, అలాగే ఏప్రిల్ 5న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్లాటినమ్ జూబ్లీ ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ముఖర్జీ తెలిపారు. 1941లో ప్రారంభమైన ఎస్బీహెచ్ ప్రస్థానం ఇప్పుడు రూ. 2.55 లక్షల కోట్ల వ్యాపారం చేసే స్థాయికి చేరుకుందన్నారు. వచ్చే ఆర్థిక ఏడాది 20 శాతం వృద్ధిరేటును అంచనా వేస్తున్నట్లు తెలిపారు.