shar director
-
29న షార్ నుంచి వందో ప్రయోగం
సూళ్లూరుపేట: జీఎస్ఎల్వీ– ఎఫ్ 15తో ఎన్వీఎస్–02 ఉపగ్రహాన్ని అనుసంధానించడం పూర్తయిందని ఆదివారం షార్ డైరెక్టర్ రాజరాజన్ చెప్పారు. దేశీయంగా రూపుదిద్దుకున్న క్రయోజనిక్ జీఎస్ఎల్వీ–ఎఫ్15 రాకెట్ ఎన్వీఎస్–02ను తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని వివరించారు. శ్రీహరి కోటలోని షార్ నుంచి ఇది 100వ మిషన్ కానుందన్నారు. రెండో లాంచ్‌ప్యాడ్ నుంచి చేపట్టే ప్రయోగంలో ఎన్వీఎస్–02ను జియో సిక్రనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు ఆదివారం ఆయన మీడియాకు వివరించారు. జీఎస్ల్వీఎల్ ఎప్15 రాకెట్ ప్రయోగానికి 27 గంటల ముందు అంటే 28వ తేదీ తెల్లవారు జామున 3.23 గంటలకు కౌంట్‌డౌన్ మొదలయ్యే అవకాశం ఉందన్నారు. 29న ఉదయం 6.23 గంటలకు ప్రయోగం ఉంటుందని చెప్పారు. అయితే, కౌంట్‌డౌన్ సమయాన్ని సోమవారం అధికారికంగా ఫ్రకటిస్తామని చెప్పారు. మూడో లాంచ్‌ప్యాడ్‌కు నెలలో శంకుస్థాపన సతీష్ ధవన్ స్పేస్‌సెంటర్ (షార్)లో మరో ప్రయోగ వేదిక నిర్మాణానికి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రూ.3,984 కోట్లు మంజూరు చేసిన విషయాన్ని రాజరాజన్ గుర్తు చేశారు. ఇందుకు అవసరమైన స్థలం ఎంపిక పూర్తయిందని, నెల రోజుల్లోనే భూమిపూజ ఉంటుందని వివరించారు. దీనికి అనుసంధానంగానే న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్‌ను రూపొందించనున్నామన్నారు. భవిష్యత్తులో దీనిద్వారానే వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపించి తిరిగి తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టనున్నామని తెలిపారు. కొత్త తరం లాంచింగ్ వెహికల్తో 20 నుంచి 25 టన్నుల ఉపగ్రహాలను సైతం కక్ష్యలోకి పంపించొచ్చని చెప్పారు. తమిళనాడులోని కులశేఖర్‌పట్నంలో నిర్మిస్తున్న రాకెట్ ఫ్రయోగ వేదిక డిసెంబర్ 31 నాటికి పూర్తవుతుందన్నారు. -
మానవ సహిత గగన్‌యాన్.. ఎల్వీఎం–3 ద్వారా రోదసిలోకి మనుషులు
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి 2024 ఆఖరు నాటికి గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహించనున్నట్లు షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ వెల్లడించారు. శ్రీహరికోట రాకెట్ కేంద్రంలోని స్పేస్ సెంట్రల్ స్కూల్ మైదానంలో గురువారం గణతంత్ర వేడుకల అనంతరం భాస్కర్ అతిథి భవనంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గగన్‌యాన్‌కు సంబంధించి ఇప్పటికే పలు రకాలుగా భూస్థిర పరీక్షలు నిర్వహించామని చెప్పారు. దీనికి సంబంధించి 2022లో తొమ్మిది రకాల సాలిడ్ మోటార్ స్టాటిక్ టెస్ట్‌లు నిర్వహించామన్నారు. మరో 30 రకాల భూస్థిర పరీక్షలు నిర్వహించిన అనంతరం ఈ ఏడాది ఆఖరు నాటికి క్రూ మాడ్యూల్తో ప్రయోగాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ముందు రెండుసార్లుగా మానవ రహిత ప్రయోగాలను నిర్వహించాక 2024 ఆఖరు నాటికి ఎల్వీఎం–3 భారీ రాకెట్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహిస్తామని ఆయన చెప్పారు. ఇందుకు ఇస్రోలో అన్ని సెంటర్లు దీనిపై దృష్టిసారించి పనిచేస్తున్నాయన్నారు. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపడమే లక్ష్యంగా పెట్టుకుని దీనికోసం ఇస్రోలో ప్రతిఒక్కరు కృషిచేస్తున్నారని రాజరాజన్ చెప్పారు. అన్నీ సవ్యంగా జరిగితే 2024లో గగన్‌యాన్ ప్రయోగంలో మానవ సహిత ప్రయోగాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 2023లో 11 ప్రయోగాలు లక్ష్యం ఇక ఈ ఏడాది 11 ప్రయోగాలు లక్ష్యంగా ఇప్పటినుంచే పనిచేస్తున్నామని రాజరాజన్ తెలిపారు. ఇందులో ఈ ఏడాది పీఎస్ఎల్వీ సిరీస్‌లో ఐదు రాకెట్లు, ఎల్వీఎం–3లో రెండు, జీఎస్ఎల్వీ సిరీస్‌లో రెండు, ఎస్ఎస్ఎల్వీ సిరీస్‌లో రెండు ప్రయోగాలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆయన తెలియజేశారు. ఇందులో ఫిబ్రవరి మూడో వారంలో ఎస్ఎస్ఎల్వీ (స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికిల్) డీ2 ప్రయోగాన్ని నిర్వహించిన అనంతరం ఐదు పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలతో పాటు సూర్యుడిపై పరిశోధనకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించనున్నామన్నారు. ఎల్వీఎం–3 రాకెట్ల ద్వారా వన్‌వెబ్ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను, చంద్రయాన్–3 ప్రయోగాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని రాజరాజన్ చెప్పారు. అలాగే, జీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా నావిగేషన్, కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ప్రయోగించనున్నామని కూడా తెలిపారు. మరోవైపు.. షార్ కేంద్రంలోని మొదటి ప్రయోగ వేదికకు అనుసంధానంగా పీఎస్ఎల్వీ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీ (పీఐఎఫ్) భవనం నిర్మాణం పూర్తిచేసి విజయవంతంగా ట్రయల్ రన్‌ను నిర్వహించామని.. రెండో ప్రయోగ వేదికకు సంబంధించి సెకండ్ వెహికల్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను కూడా అందుబాటులోకి తెస్తున్నామని ఆయన తెలిపారు. పీఎస్ఎల్వీ సీ55 ఇంటిగ్రేషన్‌తో సెకండ్ అసెంబ్లింగ్ బిల్డింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు. మొత్తం మీద షార్‌లోని అన్ని సదుపాయాలను ఉపయోగించి ఈ ఏడాది 11 ప్రయోగాలను చేసేందుకు సిద్ధమవుతున్నామన్నారు. తద్వారా ఈ ఏడాది కూడా స్పేస్ రీఫార్మ్ ఇయర్‌గా చెప్పుకోవచ్చునని ఆయన తెలిపారు. చివరగా.. ప్రైవేట్ ప్రయోగాల విషయంలో ఎవరైనా స్టార్టప్ కంపెనీలతో వస్తే ప్రయోగాలు చేయడానికి సిద్ధంగానే ఉన్నామని తెలిపారు. -
స్పేస్ పిలుస్తోంది.. మీరు సిద్ధమేనా?
సూళ్లూరుపేట: ఈనాటి విద్యార్థులే రేపటి శాస్త్రవేత్తలుగా రావాలని, భారతదేశాన్ని శాస్త్రీయ భారత్‌గా బలోపేతం చేయాలని స్పేస్ సైన్స్ పిలుస్తోందని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ చెప్పారు. ఆ పిలుపునకు మీరు సిద్ధంగా ఉన్నారా.. అని ప్రశ్నించారు. దేశంలోని 28 రాష్ట్రాల నుంచి యువిక యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాం–2022కు ఎంపికైన 153 మంది విద్యార్థులు శుక్రవారం షార్‌లోని లాంచింగ్ ఫెసిలిటీస్, రాకెట్ లాంచింగ్ పాడ్స్, మిషన్ కంట్రోల్ రూమ్‌లను సందర్శించారు. నేటితరం విద్యార్థులను స్పేస్ సైన్స్ వైపు ఆకర్షించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు నిర్వహిస్తున్న యువిక–2022 కార్యక్రమాన్ని ఈనెల 16న ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వర్చువల్‌గా ప్రారంభించారు. నేటి (శనివారం) వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎంపికైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు గురువారం సాయంత్రం షార్ కేంద్రానికి చేరుకున్నారు. విద్యార్థులు స్పేస్ సెంటర్‌ను సందర్శించిన అనంతరం బ్రహ్మప్రకాష్ హాలులో జరిగిన సమావేశంలో రాజరాజన్ మాట్లాడారు. విద్యార్థులకు ఎంతసేపైనా శ్రమించగలిగే అత్యంత శక్తిసామర్థ్యాలుంటాయని చెప్పారు. మన విద్యార్థులు ఈ రోజున తేలికపాటి ఉపగ్రహాలు తయారుచేసే స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు. ఇస్రో సెంటర్లపై అవగాహన కల్పిస్తే ఈ 153 మందిలో కనీసం ఓ పదిమందైనా ఇస్రో శాస్త్రవేత్తలు అవుతారనే ఆశతోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సాయంత్రం 5.30 గంటలకు షార్‌లోని సౌండింగ్ రాకెట్ ప్రయోగవేదిక నుంచి రోహిణి సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించి విద్యార్థులకు చూపించారు. ఈ కార్యక్రమం ముగింపు సందర్భంగా శనివారం ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. అనంతరం విద్యార్థులకు పార్టిసిపేషన్ సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. -
ఎమ్ఓటీ రాడార్ ను ప్రారంభించిన షార్ డైరెక్టర్
నెల్లూరు: నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం షార్ నుంచి ఎమ్ఓటీ రాడార్ వ్యవస్థను ఆ సంస్థ డైరెక్టర్ డా.ఎమ్వైఎస్ ప్రసాద్ ప్రారంభించారు. శుక్రవారం రాడార్ వ్యవస్థను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ.. రాకెట్ల ప్రయోగ ప్రక్రియను పరిశీలించేందుకు ఈ రాడార్ ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రపంచంలో కొన్ని దేశాలకే పరిమితమైన టెక్నాలజీని మన దేశంలో ఏర్పాటుచేయడం ఎంతో గర్వంగా ఉందని డెరెక్టర్ ప్రసాద్ అన్నారు.