దుమ్మురేపిన ఐఫోన్ విక్రయాలు
ఐఫోన్ విక్రయాలు దుమ్మురేపాయి. ఈ బలమైన విక్రయాలతో ఆపిల్ మూడో క్వార్టర్ ఫలితాలు అంచనాల కంటే మెరుగ్గా ఉంటాయని ప్రకటించింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ఆపిల్ షేర్లు ఆల్‌టైమ్ గరిష్టాలను నమోదుచేశాయి. కంపెనీ అదరగొట్టిన ఐఫోన్ విక్రయాలను ప్రకటించిన వెంటనే ఇంట్రాడేలో ఆపిల్ స్టాక్ రికార్డు గరిష్టంలో 159.10 డాలర్ల స్థాయిని తాకింది. జూలై1 తో ముగిసిన క్వార్టర్లో ఐఫోన్ అమ్మకాలు 41.03 మిలియన్లగా నమోదైనట్టు కంపెనీ తెలిపింది. దీంతో 1.2 బిలియన్ ఐఫోన్ విక్రయాల మైలురాయిని తాకినట్టు ఆపిల్ ప్రకటించింది.
ఐప్యాడ్ ప్రొడక్ట్‌లో కూడా అనూహ్యమైన వృద్ధిని నమోదుచేసినట్టు కంపెనీ పేర్కొంది. ఆపిల్ వాచ్ విక్రయాలు 50 శాతం పెరిగినట్టు తెలిపింది. దీంతో ఆపిల్ ఫలితాల అంచనాల్లోనూ దూసుకుపోయింది. అయితే తాజాగా శాంసంగ్ గెలాక్సీ ఎస్8, ఎస్8 ప్లస్ స్మార్ట్ఫోన్లకు పోటీగా తీసుకురాబోతున్న తర్వాతి ఐఫోన్‌ను సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టబోతున్నట్టు తెలుస్తోంది.
జూలై1 తో ముగిసిన క్వార్టర్లో ఐఫోన్ అమ్మకాలు 1.6 శాతం వృద్ధి చెంది, మూడో క్వార్టర్లో 41.03 మిలియన్లగా నమోదైనట్టు ఆపిల్ తెలిపింది. ఇవి విశ్లేషకులు అంచనావేసిన 40.7 మిలియన్ యూనిట్ల కంటే ఎక్కువ. గతేడాది ఆపిల్ 40.4 మిలియన్ యూనిట్లనే విక్రయించింది. ఐఫోన్ విక్రయ ధరను వాల్‌స్ట్రీట్ అంచనాల కంటే తక్కువగా ఉంచడంతో ఐఫోన్ రెవెన్యూలు పెరిగినట్టు ఆపిల్ తెలిపింది. కంపెనీ నికర ఆదాయం కూడా 8.72 బిలియన్ డాలర్లు లేదా ఒక్కో షేరుకు 1.67 డాలర్లకు పెరిగినట్టు కంపెనీ చెప్పింది.
చైనాతో కలిపి ఎమర్జింగ్ మార్కెట్లలో ఆపిల్ రెవెన్యూలు 18 శాతం పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది. రెవెన్యూలు 45.4 బిలియన్ డాలర్లుగా ఆపిల్ ప్రకటించింది. రాయిటర్స్ అంచనాల ప్రకారం ఇవి 44.89 బిలియన్ డాలర్లుగా మాత్రమే ఉంటాయని తెలిసింది. ఐఫోన్ సరుకు రవాణా కూడా 41 మిలియన్లకు పెరిగింది. కంపెనీ మొత్తం రెవెన్యూలు ప్రస్తుత నాలుగో క్వార్టర్లో 49 బిలియన్ నుంచి 52 బిలియన్ డాలర్ల మధ్యలో ఉంటాయని కంపెనీ అంచనావేస్తోంది. అంతేకాక విశ్లేషకులు కూడా 49.21 బిలియన్ డాలర్లుగా ఉంటాయని భావిస్తున్నారు.