shayampet
-
పరువు తీశారని మాజీ సర్పంచ్ ఆత్మహత్య
సాక్షి, వరంగల్(శాయంపేట): తీసుకున్న అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయడంతోపాటు పరువుతీశారని మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఓ మాజీ సర్పంచ్ చికిత్స పొందుతూ గురువారం రాత్రి చనిపోయాడు. అతని మృతికి పీఏసీఎస్ చైర్మన్ దంపతులే కారణమని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన శుక్రవారం హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం..హుస్సేన్‌పల్లి గ్రామానికి చెందిన భూతాల సురేష్ (40) పత్తి, మక్కలు, వరిధాన్యం కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. వ్యాపార అవసరాల నిమిత్తం శాయంపేట గ్రామానికి చెందిన పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్ వద్ద 5నెలల క్రితం రూ.20లక్షలు అప్పుగా తీసుకున్నాడు. వ్యాపారంలో నష్టాలు రావడంతో శాయంపేటలోని తన రెండు అంతస్తుల భవనాన్ని బ్యాంక్‌లో పెట్టి లోన్ తీసుకోవడానికి డాక్యుమెంట్స్ తయారు చేసుకున్నాడు. 20 రోజులనుంచి తన అప్పు చెల్లించాలని శరత్.. తరచూ సురేష్ ఇంటికి వెళ్లి దూషిస్తున్నాడు. ఈ క్రమంలో ఇటీవల శరత్.. సురేష్‌ను బలవంతంగా తన ఇంటికి తీసుకెళ్లి ఇంటి పత్రాలు ఇవ్వాలని మూడు గంటలపాటు నిర్బంధించాడు. విషయాన్ని సురేష్ ఫోన్లో తన మిత్రులకు తెలియజేయడంతో వారు వచ్చి ఇంటి డాక్యుమెంట్స్ అప్పగించి అతన్ని తీసుకెళ్లారు. ఈ నెల 16న సురేష్ శాయంపేటలోని తన ఇంటికి అమ్మకానికి బోర్డు పెట్టాడు. విషయం తెలుసుకున్న శరత్ అతని భార్య రమాదేవి ఈ నెల 19న సురేష్ ఇంటికి వెళ్లి చుట్టుపక్కల వారి ముందు అప్పు విషయంలో దుర్భాషలాడుతూ సురేష్‌పై దాడి చేశారు. అవమానాన్ని భరించలేక సురేష్ అదేరోజు సాయంత్రం కొత్తగట్టుసింగారం శివారు వద్దకు వెళ్లి పురుగుల మందు తాగాడు. చైర్మన్ దంపతుల వేధింపుల వల్లే తాను మానసికంగా కుంగిపోయి పురుగుల మందు తాగినట్లు కుటుంబ సభ్యులకు, స్నేహితులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని సురేష్‌ను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. అప్పుగా తీసుకున్న రూ. 20లక్షలు చెల్లించాలని వేధింపులకు గురిచేయడం, ఇంటి ఒరిజినల్ దస్తావేజులు ఇవ్వాలని నిర్బంధించడం, కాలనీవాసుల ముందే పీఏసీఎస్ చైర్మన్ కుసుమ శరత్ దంపతులు దుర్భాషలాడుతూ కొట్టడంతో మనస్తాపం చెంది తన భర్త సురేష్ ఆత్మహత్య చేసుకున్నాడని భార్య రాణి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కుసుమ శరత్, భార్య రమాదేవిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. రోడ్డుపై ధర్నా .. పీఏసీఎస్ చైర్మన్, అతని భార్యపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు సాయంత్రం నాలుగు గంటల నుంచి పత్తిపాక–శాయంపేట ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. పరకాల ఏసీపీ శివరామయ్య ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణ రావు అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులకు మద్దతు ప్రకటించారు. బాధితులకు న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో ధర్నా విరమించారు. కాగా, సురేష్ మృతిపై బంధువులు చేసిన ఆరోపణలపై పీఏసీఎస్ చైర్మన్ శరత్‌ను వివరణ కోరేందుకు ఎంతసేపు ప్రయత్నించినా స్పందించలేదు. -
Devadula: భూములు తిరిగి ఇవ్వకుంటే మూకుమ్మడి ఆత్మహత్యలు
శాయంపేట: సొరంగం పనుల కోసం రైతుల నుంచి భూములను లీజుకు తీసుకుని, పనులైన వెంటనే తిరిగి ఇస్తామని చెప్పి.. తీరా ఇప్పుడు మినీ క్రషర్ ఏర్పాటు చేస్తున్నారని, వెంటనే భూములను మాకు అప్పగించాలంటూ రైతులు పురుగు మందు డబ్బాలతో ఆందోళన చేపట్టారు. భూములు అప్పగించకపోతే 18 కుటుంబాల రైతులందరమూ మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం మైలారం గ్రామ శివారులో దేవాదుల మూడో విడత సొరంగం పనుల కోసం 18మంది రైతులనుంచి 27.30 ఎకరాల భూమిని కోస్టల్ మెగా కంపెనీ లీజుకు తీసుకుంది. ఆ స్థలంలో ఆడిట్ పాయింట్ ఏర్పాటు చేసి పనులు పూర్తి చేసింది. సొరంగం పనుల్లో వచ్చిన పెద్దపెద్ద బండరాళ్లు, మెటీరియల్స్‌ను ఆ ప్రాంతంలోనే నిల్వ చేశారు. పనులు పూర్తయినప్పటికీ తిరిగి రైతులకు భూములు అప్పగించలేదు. ఇటీవల కాలంలో రైతులు తమ భూములు అప్పగించాలని అడుగుతూ వస్తున్నారు. అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో 18.27 ఎకరాల పట్టా భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దీంతోపాటు 5 ఎకరాల అసైన్డ్ భూమిని కూడా స్వాధీనం చేసుకుంది. ఆ స్థలంలో నిల్వ చేసిన బండరాళ్లను, మెటీరియల్‌ను తొలగించడానికి హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ కాంట్రాక్టర్‌కు పనులను అప్పగించింది. దీంతో కాంట్రాక్టర్ ఆ ప్రాంతంలో మినీ క్రషర్ ఏర్పాటుచేయడానికి బుధవారం రాత్రికి రాత్రే మెటీరియల్ దింపాడు. విషయం తెలుసుకున్న రైతులు గురువారం ఉదయం అక్కడికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించి తిరిగి వెళ్తున్న ఇరిగేషన్ అధికారుల వాహనాన్ని రెండు గంటలపాటు అడ్డుకున్నారు. సమస్య పరిష్కరించేంత వరకు వెళ్లనివ్వమని పురుగు మందు డబ్బాలు పట్టుకుని ఆందోళన చేపట్టారు. తమ స్థలంలో ఎలాంటి పనులూ చేపట్టవద్దని, కాదని చేపడితే 18 కుటుంబాల రైతులం ఆత్మహత్య చేసుకుంటా మని హెచ్చరించారు. దీంతో ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని, వారి ఆదేశాలను పాటిస్తామని డీఈ రవీందర్ తెలిపారు. రైతుల ఆందోళన మేరకు పదిరోజుల పాటు ఆడిట్ స్థలంలో ఎలాంటి పనులూ చేపట్టమని హామీ ఇచ్చారు. -
చెట్టు ఒకటే.. పువ్వు ఒకటే.. కానీ మూడు రంగులు..
శాయంపేట: చెట్టు ఒకటే.. పువ్వు ఒకటే.. కానీ.. సమయాన్నిబట్టి రంగులు మారుతోంది. అదే మందార ముటాబిలిసి పువ్వు ప్రత్యేకత. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం పెద్దకోడెపాక గ్రామానికి చెందిన వన ప్రేమికుడు కోమనేని రఘు తన ఇంటి ఆవరణలో దక్షిణ చైనా, తైవాన్ దేశాలకు చెందిన మందార ముటాబిలిసి అనే మొక్కను నాటాడు. దీనిని కాన్ఫెడరేట్ గులాబీ, డిక్సీ రోజ్‌మల్లో, కాటన్ రోజ్ లేదా కాటన్ రోజ్‌మల్లో అని కూడా పిలుస్తారని ఆయన తెలిపారు. ఆదివారం ఈ మొక్కకు అరుదైన పుష్పం వికసించింది. ఉదయం తెలుపు, మధ్యాహ్నం గులాబీ, సాయంత్రం ఎరుపు రంగులోకి మారడం ఈ పువ్వు ప్రత్యేకత. ఒకేరోజు మూడు రంగుల్లో వికసించడంతో స్థానికులు చూసేందుకు ఆసక్తి కనబరిచారు. చదవండి: టాప్‌గేర్‌లో ఎంసెట్... రివర్స్‌లో జేఈఈ -
Software Engineer Rakesh: భార్య వేధింపులు.. సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
సాక్షి, హన్మకొండ: భార్య, అత్తింటివారి వేధింపులు తాళలేక సూసైడ్ నోట్ రాసి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజపల్లి గ్రామంలో గురువారం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఎస్సై వీరభద్రరావు కథనం ప్రకారం.. రాజపల్లికి చెందిన కొండా రాకేశ్(28) హెచ్‌సీఎల్ కంపెనీలో సాప్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఫిబ్రవరి 2న ఎలుకుర్తి హవేలికి చెందిన దేవుళ్లపల్లి శంకర్ కుమార్తె నిహారికతో వివాహం జరిగింది. కొన్ని రోజులు వీరి సంసారం సాఫీగానే సాగింది. రాకేశ్ ప్రస్తుతం వర్క్ ఫ్రం హోం చేస్తుండడంతో రాజపల్లిలోనే ఉంటున్నారు. పల్లెటూరులో ఉండడం ఇష్టంలేని నిహారిక హైదరాబాద్ వెళ్దామని రాకేశ్‌తో తరుచూ గొడవ పడేది. వర్క్ ఫ్రం హోం పూర్తికాగానే వెళ్దామని సర్ధి చెప్పినా వినకుండా గొడవపడేది. ఈ విషయమై పలుమార్లు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. అయినా వినని నిహారిక రాకేశ్‌తో సంసారం చేయడం ఇష్టంలేదని, పుట్టింటికి వెళ్లి అబార్షన్ చేయించుకుంటానని భర్త, అత్తమామలతో గొడవపడి చీపురుతో కొట్టి వెళ్లిపోయింది. చదవండి: (ప్రేమ వివాహం.. ఆపై కులం తక్కువని..) ఈ క్రమంలో వీడియోకాల్ చేసి రాకేశ్‌ను దుర్భాషలాడుతూ నువ్వు చస్తే నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని అబార్షన్ చేయించుకుంటానని నిహారిక వేధించింది. ఇదే విషయమై ఆమె తల్లిదండ్రులు సైతం మానసికంగా వేధించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రాకేశ్ సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ములుగు ఫ్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి వెంకటరాజ్యం ఫిర్యాదు మేరకు రాకేశ్ భార్య నిహారిక, అత్తమామలు దేవుళ్లపల్లి శంకర్, అరుణపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. చదవండి: (Doctor Death Mystery: ‘అశ్లీల చిత్రాలతో బెదిరించి చంపేశాడు’) -
Photo Feature: తొలి పువ్వు పదహారేళ్లకు..
శాయంపేట: హనుమకొండ జిల్లా శాయంపేట మండల కేంద్రంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన వనప్రేమికుడు కోమనేని రఘు ఇంటి ఆవరణలో పదహారేళ్ల క్రితం సీయర్స్ జామకారు మొక్కను నాటారు. మండకారు అని కూడా పిలిచే క్యాక్టస్ జాతికి చెందిన ఈ మొక్క ఇదిగో ఇప్పుడు తొలి పువ్వును పూసింది. తెల్లటి రేఖలతో వికసించిన ఈ పువ్వును చూసేందుకు గ్రామస్తులు తరలివస్తున్నారు. చదవండి: చీమ.. బలానికి చిరునామా.. -
వరంగల్‌లో ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి
దేశంలోని ప్రతి జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం.. వరంగల్‌లో ఈఎస్ఐ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. సంపర్క్ అభియాన్, జనజాగరణ కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన సోమవారం ఇక్కడికి వచ్చారు. సాక్షి, న్యూశాయంపేట: దేశంలోని ప్రతి జిల్లాలో ఈఎస్ఐ ఆస్పత్రి ఏర్పాటు చేస్తున్నాం.. వరంగల్‌లో ఈఎస్ఐ సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటుకు తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. బీజేపీ దేశవ్యాప్తంగా చేపట్టిన సంపర్క్ అభియాన్, జనజాగరణ కార్యక్రమాల్లో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన సోమవారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా హన్మకొండ రాంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సంపర్క్ అభియాన్, జనజాగరణ సభలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణం తమ దృష్టికి వచ్చిందని పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్య తీసుకుంటామని తెలిపారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలో వచ్చిన వందరోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ప్రజామోదం లభించిందని చెప్పారు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని ఇందులో వేరే దేశం జోక్యాన్ని సహించేది లేదన్నారు. కశ్మీర్‌తో పాటు, దేశవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పరిష్కారానికి మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ రాబోయే రోజుల్లో అధికారంలో వస్తుందని, రాష్ట్రంలో నాలుగు ఎంపీ సీట్లు గెలచుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు కృషిచేయాలని, కలిసికట్టుగా పనిచేసి టీఆర్ఎస్ పాలనకు చరమగీతం పాడాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు ఈఎస్ఐ మందుల కొనుగోలు కుంభకోణంపై సీబీఐ చేత దర్యాప్తు చేయాలని కోరుతూ పార్టీ రాష్ట్ర ప్రతినిధి బృందం కేంద్రమంత్రికి మెమోరండం సమర్పించింది. సంపర్క్ అభియాన్ భాగంగా కాకతీయ మాజీ వైస్‌చాన్సలర్ ప్రొఫెసర్ వంగాల గోపాల్‌రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి, ప్రముఖ కవి రచయిత ప్రొఫెసర్ రామాచంద్రమౌళిలను కలుసుకున్నారు. సభలో రాష్ట్ర నాయకులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, మార్తినేని ధర్మారావు, మాజీ ఎంపీ జంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కొండేటి శ్రీధర్, వన్నాల శ్రీరాములు, మాజీ మేయర్ టి.రాజేశ్వర్‌రావు, పార్టీ అర్బన్, రూరల్‌జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, ఎడ్ల అశోక్‌రెడ్డి, నాయకులు డాక్టర్ విజయలక్ష్మి, రావుల కిషన్, మల్లాది తిరుపతిరెడ్డి, బన్న ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. భారీ పరిశ్రమను ఏర్పాటు చేయాలి చారిత్రాత్మకమైన వరంగల్ జిల్లాలో ఉన్న నిరుద్యోగుల కోసం భారీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఉపాధి అవకాశాలను కల్పించాలని చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు దిడ్డి కుమారస్వామి కేంద్ర మంత్రిని కోరారు. గతంలో ఉన్న ఆజంజాహి మిల్లు మూత పడడంతో వేలాది మందికి ఉపాధి లేకుండా పోయిందన్నారు. ఆసియాలోనే పెద్ద మార్కెట్ ఉన్న వరంగల్‌లో స్పైసెస్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని, ఉన్న స్పైసెస్ బోర్డును తరలించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కేంద్ర మంత్రికి వినతి పత్రాన్ని సమర్పించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు సాధుల దామోదర్, తోట నర్సింహరావు, కొత్త కిషోర్‌కుమార్, సారయ్య, గౌరిశెట్టి శ్రీనివాస్, రాజు, దేశబత్తుల రమేష్, పోతుకుమారస్వామి, బిజెపీ నాయకులు రావు పద్మారెడ్డి, ఎడ్ల అశోక్‌రెడ్డి, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ధర్మారావు, వన్నాల శ్రీరాములు, వంగాల సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మోదీ పాలనకు మద్దతుగా నిలవాలి వరంగల్: దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ప్రధాని మోదీ పాలనకు ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి సంతోష్‌కుమార్ గంగ్వార్ అన్నారు. వరంగల్‌లోని చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయంలో సోమవారం వ్యాపారులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ భద్రత కోసం ప్రధాని మోదీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని అర్టికల్ 371ను రద్దు చేసి కాశ్మీర్ ప్రజలకు నిర్బంధం నుంచి విముక్తి కల్పించారని పేర్కొన్నారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాలపై ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సంపర్క్ అభియాన్, జనజాగరణ్ కార్యక్రమాలు నిర్విహిస్తున్నట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా వరంగల్ పట్టణంలో మేధావులను, కవులను, వ్యాపార, వాణిజ్య వర్గాలను కలుసుకున్నామని చెప్పారు. -
ప్రగతి సింగారానికి వచ్చిన సీఎం కేసీఆర్
సాక్షి, వరంగల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారానికి వచ్చారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 4న మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం దశ దినకర్మ జరగగా సీఎం కేసీఆర్ వచ్చారు. ఈ మేరకు మల్లారెడ్డి చిత్రపటం వద్ద పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు ధర్మారెడ్డి, ఆయన కుటుంబీకులను ఓదార్చారు. ఆ తర్వాత మల్లారెడ్డి అనారోగ్యంపై ఆరా తీశారు. అనంతరం ధర్మారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి సీఎం కేసీఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి భోజనం చేశారు. గంట పాటు ప్రజాప్రతినిధులతో భేటీ చల్లా ధర్మారెడ్డి ఇంట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. భోజనం చేసిన అనంతరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను లోపలకు పిలిచారు. ఈ సందర్భంగా జిల్లాలో అభివృద్ధి పనులపై సుమారు గంట పాటు చర్చించారని సమాచారం. కాళేశ్వరం ద్వారా త్వరలో సాగు నీరు వస్తుందని.. దీంతో వరంగల్ దశ మారుతుందని సీఎం ప్రజా ప్రతినిధులకరు చెప్పినట్లు తెలిసింది. కాళేశ్వరం, దేవాదుల ద్వారా సాగు విస్తీర్ణం పెరిగి రైతులు ఆనందం వ్యక్తం చేస్తారని అన్నారు. కాళేశ్వరం ద్వారా ఒక్కో నియోజకవర్గంలో ఎంత సాగు అవుతుందని వివరించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు గుడిమల్ల రవికుమార్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, టీఆర్ఎస్ నాయకురాలు హరి రమాదేవిని సైతం లోపలకు పిలిపించి కేసీఆర్ మాట్లాడారు. భారీ భద్రత ప్రగతి సింగారంలో మల్లారెడ్డి దశ దినకర్మను చల్లా ధర్మారెడ్డి, రఘుపతిరెడ్డి, కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఆ తర్వాత ఆవరణను సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అదుపులోకి తీసుకుంది. వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవీందర్ ఆధ్వర్యాన డీసీపీ కే.ఆర్.నాగరాజు, ఏసీపీ సునీతామోహన్తో పాటు 450 మంది సిబ్బంది, 15 మంది సీఐలు, 10 మంది ఏసీపీలతో ముడంచెల భద్రత ఏర్పాటు చేశారు. బంధువులందరినీ ఒక పక్కకు పంపించి రోప్‌ను కట్టారు. తొలుత మీడియా వారిని సైతం బయటకు పంపించారు. ఈ విషయమై జర్నలిస్టులు కలెక్టర్, కమిషనర్‌తో చర్చించడంతో ప్రత్యేక రోప్‌ను ఏర్పాటు చేసి బంధువుల పక్కన ఉండి కవరేజీ చేసుకునేలా అవకాశం కల్పించారు. 1.52 గంటల పాటు ప్రగతి సింగారంలో గంట యాభై రెండు నిముషాల పాటు ప్రగతి సింగారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఉన్నారు. మధ్యాహ్నం 1.50గంటలకు ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో ప్రగతి సింగారానికి ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో మధ్యాహ్నం 2.02 గంటలకు చల్లా ధర్మారెడ్డి ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం 3.29గంటలకు చల్లా ధర్మారెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ 3.38గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకున్నాడు. అక్కడ 3.42గంటలకు హెలీకాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు. -
బైక్‌లు ఢీకొని ఇద్దరి మృతి
శాయంపేట(భూపాలపల్లి): రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందిన సంఘటన మండలంలోని మైలారం గ్రామ శివారులో బుధవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని పెద్దకోడెపాక గ్రామానికి చెందిన ముల్కనూరి శ్రీనివాస్(35), రేణుకుంట్ల సాంబయ్య మండల కేంద్రంలో మేస్త్రీ పనులు చూసుకుని ఒకే ద్విచక్ర వాహనంపై మైలారం మీదుగా పెద్దకోడెపాక గ్రామానికి వెళ్తున్నారు. అదే సమయంలో రేగొండ మండలం కానిపర్తి గ్రామానికి చెందిన శ్రీపతి నరేశ్(25), పాలకుర్తికి చెందిన నల్ల సురేష్ మరో ద్విచక్ర వాహనంపై పెద్దకోడెపాక మీదుగా మైలారం గ్రామానికి వివాహానికి హాజరయ్యేందుకు వస్తున్నారు. ఈ క్రమంలో మైలారం శివారులో మూలమలుపు వద్ద ఎదురెదురుగా రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. దీంతో ముల్కనూరి శ్రీనివాస్, శ్రీపతి నరేశ్, రేణుకుంట్ల సాంబయ్యకు తీవ్రగాయాలయ్యాయి. వారిని 108లో పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ముల్కనూరి శ్రీనివాస్ మృతిచెందాడు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శ్రీపతి నరేశ్ మృతిచెందాడు. సాంబయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. స్వల్పగాయాలైన సురేశ్ హన్మకొండలోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
ఈతకెళ్లి ముగ్గురు యువకుల మృతి
వరంగల్ రూరల్ జిల్లా : శాయంపేట మండలం మందారిపేటలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో ఈతకెళ్లి ముగ్గురు యువకులు మృత్యువాత పడ్డారు. వివరాలు.. మందారిపేట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ నిమ్మల రమేష్ కూతురి వివాహానికి హాజరయ్యేందుకు వరంగల్ నగరం నుంచి కొంత మంది బంధువులు వచ్చారు. భోజనాలు అయ్యాక ఊరి చివరన ఉన్న గోగుకుంట చెరువు వద్దకు వెళ్లారు. సరదాగా ఈతకొట్టేందుకు ఓ యువకుడు చెరువులోకి దిగగా..లోతు అంచనా వేయడంతో తప్పు జరగడంతో మునిగిపోయాడు. స్నేహితుడిని కాపాడబోయి మరో ఇద్దరు యువకులు కూడా మునిగి చనిపోయారు. విషయం తెలిసి గ్రామస్తులు సంఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. మృతులు వరంగల్ నగరం కొత్తవాడకు చెందిన దేవులపల్లి వంశీకృష్ణ(20), రంగు సాయికృష్ణ(20), ఆలేటి సునీల్(20)గా గుర్తించారు. ఈ ఘటనతో పెళ్లింట విషాదం నెలకొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆశ్రయం కోరితే అత్యాచారం..
శాయంపేట: ఆశ్రయం కోరి వచ్చిన విద్యార్థినిపై అత్యాచారం చేసిన కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వరంగల్ జిల్లా పరకాల డీఎస్పీ సంజీవరావు తెలిపిన కథనం ప్రకారం.. గత ఏడాది డిసెంబర్ 30న ఓ యువకుడు(ఫిర్యాదుదారుడు), అతని స్నేహితురాలు కలిసి హైదరాబాద్‌కు ఒక ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం వెళ్లారు. తిరిగి వస్తుండగా హన్మకొండ చేరుకున్నాక ఆ యువకుడు తన స్వగ్రామమైన శాయంపేటకు రమ్మని స్నేహితురాలిని ఆహ్వానించాడు. హన్మకొండలో బస్సు ఎక్కి మాందారిపేట వద్ద దిగి, అక్కడి నుంచి ఆటోలో రాత్రి 9.30 గంటలకు శాయంపేట చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న శాయంపేటకు చెందిన బాసని వినయ్ (20), బాసని అఖిల్ (21), మోరె సందీప్ (21) వీరిద్దరినీ చూసి అసభ్యకరంగా మాట్లాడుతూ.. ఆ అమ్మాయిని తమ వద్దకు పంపించమంటూ ఇబ్బంది పెట్టారు. అమె తన స్నేహితురాలని ఆ యువకుడు చెప్పినా వినిపించుకోకుండా వారిని బెదిరించారు. దీంతో యువకుడు తన తండ్రికి ఫోన్ చేస్తే కలవకపోవడంతో తనకు తెలిసిన శాయంపేటకు చెందిన కూతాటి రీనాకర్ (28)కు (ఇతడే నిందితుడు) సమాచారం అందించాడు. దీంతో రీనాకర్ స్నేహితులిద్దరినీ తన ఇంటికి ఆహ్వానించాడు. చౌరస్తాలో జరిగిన విషయమంతా వారు రీనాకర్‌కు వివరించగా, వారి ముగ్గురికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించాడు. మిత్రుడిని నమ్మించి మోసం చేసిన రీనాకర్.. తన మిత్రుడి స్నేహితురాలిని లొంగదీసుకోవాలని రీనాకర్ కుట్ర పన్నాడు. వెంటనే వారితో 'మీ కోసం పోలీసులు వెతుకుతున్నారు.. దొరికితే పట్టుకెళతారు.. విలేకరులు పేపర్లో రాస్తారు.. మీ పరువు పోతుంది' అని వారిని భయభ్రాంతులకు గురి చేశాడు. ఒకసారి బైక్ ఇస్తే తన స్నేహితురాలిని బస్సు ఎక్కించి వస్తానని ఆ యువకుడు రీనాకర్‌తో చెప్పగా.. 'నీవు వెళ్తే పోలీసులు పట్టుకుంటారు..నేను వెళ్లి బస్సు ఎక్కిస్తా' అంటూ రాత్రి 10 గంటలకు ఆ అమ్మాయిని బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. మాందారిపేటకు చేరుకున్నాక పోలీసులు ఉన్నారని చెప్పి, వివిధ దారులు తిప్పుతూ చివరకు మైలారం మీదుగా హుస్సేన్‌పల్లి వెళ్లే దారికి చేరుకున్నాడు. అక్కడ ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె వారించడంతో అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించాడు. తిరిగి బైక్‌పై ఎక్కించుకుని ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే వెళ్లిపోయిన ఆ యువకుడికి మళ్లీ ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుని తెల్లవారుజామున 2 గంటలకు అతడి స్నేహితురాలిని అప్పగించాడు. బస్సు ఎందుకు ఎక్కించలేదని ప్రశ్నించగా పోలీసులు వెదుకుతున్నారు.. ఈ రాత్రి ఇక్కడే ఉండి తెల్లవారిన తర్వాత తన బైక్‌పై హన్మకొండ వెళ్లమని చెప్పాడు. దీంతో ఆ యువకుడు తెల్లవారుజామున 5 గంటలకు తన స్నేహితరాలిని తీసుకుని మాందారిపేటకు రాగానే బైక్ పంక్చర్ అయింది. వాహనాన్ని అక్కడే వదిలేసి బస్సులో హన్మకొండకు వెళ్తుండగా జరిగిన విషయాన్ని ఆమె తన స్నేహితుడితో చెప్పింది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే తాను బతకనని స్నేహితురాలు రోదించడంతో ఎవరికీ చెప్పకుండా ఉన్నాడు. డిసెంబర్ 31న రీనాకర్ ఆ యువకుడికి ఫోన్ చేసి 'మీరు వచ్చిన విషయం పోలీసులకు, విలేకరులకు తెలిసింది. వారిని మేనేజ్ చేసేందుకు రూ.30 వేలు ఖర్చయ్యాయి.. ఆ మొత్తం ఇవ్వాలి' అని డిమాండ్ చేశాడు. అలాగే మీ పెళ్లి కూడా చేయిస్తా.. అందుకు రూ. లక్ష ఖర్చు అవుతుందని చెప్పడంతో ఆ యువకుడు మొత్తం రూ.60 వేలు ఇస్తానని చెప్పాడు. ఆ మాట ప్రకారం ఈ నెల 2న కోచింగ్‌కు వెళ్లాలంటూ తన బావ వద్ద రూ. 30 వేలు తీసుకొచ్చి రీనాకర్‌కు ఇచ్చాడు. కాగా, మరో రూ.30 వేల కోసం రీనాకర్ వేధిస్తుండడంతో భరించలేక మొత్తం విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. వారి సహాయంతో ఈ నెల 11న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రీనాకర్, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 12న బాధితురాలి స్టేట్మెంట్ను ఉమెన్ పోలీస్ అధికారి చేత రికార్డు చేయించారు. ఇలా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రీనాకర్‌తో పాటో మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. రీనాకర్పై 366, 376, 506, 384, 385, 354ఏ, సబ్‌సెక్షన్ 2, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 4, నిర్భయ యాక్ట్ -2013 కేసులను నమోదు చేశామని, మరో ముగ్గురిపై 354ఏ, సబ్‌సెక్షన్ 2, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 4, నిర్భయ యాక్ట్ 2013 కేసులను నమోదు చేశామని తెలిపారు. రీనాకర్ నుంచి బైక్, రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరంతా తమ నేరాలను అంగీకరించారని చెప్పారు. వీరిని బుధవారం రాత్రి కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట పరకాల సీఐ మల్లయ్య, శాయంపేట ఎస్సై ప్రవీణ్‌కుమార్ ఉన్నారు. -
‘ఆటో’ ఆయిలింజిన్
శాయంపేట, న్యూస్‌లైన్ : రైతుల కష్టాన్ని కళ్లారా చూసిన ఓ ఆటో మెకానిక్ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టాడు. ఆటో ఇంజిన్‌తో ఆయిల్ ఇంజిన్‌ను తయారు చేసి అబ్బురపరుస్తున్నాడు. లీటర్ డీజిల్‌తో ఇంజిన్ రెండు గంటలపాటు నడిచేలా తీర్చిదిద్దాడు. రూ.22వేలు ఖర్చయ్యే మోటర్ ఆర్డర్ ఇస్తే తయారు చేస్తానని చెబుతున్నాడు రామ శివప్రసాద్. మండల కేంద్రానికి చెందిన రామ శివప్రసాద్ ఏడో తరగతి వరకు చదివాడు. ఆర్థిక ఇబ్బందులతో చదువు మానేశాడు. అక్కడే రైస్ మిల్లులో డ్రైవర్‌గా చేరాడు. పదిహేనేళ్లపాటు పనిచేశాక కొత్తగా ఆటో మెకానిక్ పని నేర్చుకున్నాడు. పూర్తిగా తర్ఫీదు పొందాక చెట్టు కింద ఆటో బాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అంతేకాక రైతులకు సంబంధించి పెట్రోల్ పంపులు, చైనా మోటర్లను సైతం బాగు చేసేవాడు. ఇలా రైతులు ప్రతిసారి రిపేరుకు తెచ్చే చైనా మోటర్లను చూసి బాధపడేవాడు. విద్యుత్ కోతలు, రైతుల ఇబ్బందులను గమనించిన శివప్రసాద్ ఒక నిర్ణయానికొచ్చాడు. గత వేసవి నుంచి ఆటో ఇంజిన్‌తో కొత్తగా మోటరు తయారు చేయాలని ఆలోచనలో మునిగిపోయాడు. ప్రతీ నెల మోటరు తయారు చేయడం.. అందులోని లోపాలను సరిదిద్దుకోవడం ఇలా ఆరు నెలల సమయం పట్టింది. చివరకు అతడి చేతిలో రూపుదిద్దుకున్న మోటరు లీటరు డీజిల్‌తో రెండు గంటలపాటు 7.5 హెచ్‌పీ కంటే అధికంగా నీరు పోస్తోంది. మోటర్‌కు సెల్ఫ్‌స్టార్ట్, 12 ఓల్టేజి బ్యాటరీ, ఆటో ఇంజిన్‌ను ఏర్పాటు చేసి విజయం సాధించాడు. ఇప్పటికే సుమారు పది మంది రైతులు దీనిని వినియోగించారు. మోటర్ తయారీకి ఇప్పటికీ రూ.22వేలు ఖర్చయినట్లు తెలిపాడు. బాధలు చూడలేకే.. రైతులు పడే బాధను చూడలేక కొత్తగా ఆయిల్ ఇంజిన్ తయారు చేశా. ఆటోలో 5 నుంచి పది మంది వరకు ఎక్కించుకున్నా ఇంజిన్ లాగుతుంది. ఇదే ఇంజిన్ బావిలోనుంచి నీటిని లాగలేదా అనే అంశాన్నే ప్రయోగం చేసి విజయం సాధించా. ఇప్పటికే చింతల రవిపాల్తోపాటు మరి కొందరు రైతులు దీనిని వాడి చూసి బాగుందన్నారు. రైతులు కావాలంటే ఇలాంటి మోటర్లను ఇంకా తయారు చేస్తా. - రామ శివప్రసాద్, మెకానిక్ ఖర్చు తగ్గుతాంది చైనా మోటర్లకంటే ఖర్చు చాలా తగ్గుతాంది. గంటకు అర లీటర్ డీజిల్‌తో ఏకంగా 120 పైపుల గుండా నీళ్లను తోడుతాంది. మామూలు మోటరు కంటే ఎక్కువగా నీళ్లు పోస్తాంది. 24 గంటలు నడిచిన ఇంజిన్ వేడెక్కుతలేదు. ఇలా ఉంటే రైతులు ఉంటే సిరులు పండించొ చ్చు. - కోల మచ్చయ్య, రైతు