ఆశ్రయం కోరితే అత్యాచారం.. | girl raped in warangal district | Sakshi
Sakshi News home page

ఆశ్రయం కోరితే అత్యాచారం..

Published Thu, Jan 14 2016 12:28 AM | Last Updated on Sat, Jul 28 2018 8:53 PM

ఆశ్రయం కోరితే అత్యాచారం.. - Sakshi

ఆశ్రయం కోరితే అత్యాచారం..

శాయంపేట: ఆశ్రయం కోరి వచ్చిన విద్యార్థినిపై అత్యాచారం చేసిన కామాంధుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటనకు సంబంధించి వరంగల్ జిల్లా పరకాల డీఎస్పీ సంజీవరావు తెలిపిన కథనం ప్రకారం.. గత ఏడాది డిసెంబర్ 30న ఓ యువకుడు(ఫిర్యాదుదారుడు), అతని స్నేహితురాలు కలిసి హైదరాబాద్‌కు ఒక ఉద్యోగం ఇంటర్వ్యూ కోసం వెళ్లారు. తిరిగి వస్తుండగా హన్మకొండ చేరుకున్నాక ఆ యువకుడు తన స్వగ్రామమైన శాయంపేటకు రమ్మని స్నేహితురాలిని ఆహ్వానించాడు. హన్మకొండలో బస్సు ఎక్కి మాందారిపేట వద్ద దిగి, అక్కడి నుంచి ఆటోలో రాత్రి 9.30 గంటలకు శాయంపేట చేరుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న శాయంపేటకు చెందిన బాసని వినయ్ (20), బాసని అఖిల్ (21), మోరె సందీప్ (21) వీరిద్దరినీ చూసి అసభ్యకరంగా మాట్లాడుతూ.. ఆ అమ్మాయిని తమ వద్దకు పంపించమంటూ ఇబ్బంది పెట్టారు. అమె తన స్నేహితురాలని ఆ యువకుడు చెప్పినా వినిపించుకోకుండా వారిని బెదిరించారు. దీంతో యువకుడు తన తండ్రికి ఫోన్ చేస్తే కలవకపోవడంతో తనకు తెలిసిన శాయంపేటకు చెందిన కూతాటి రీనాకర్ (28)కు (ఇతడే నిందితుడు) సమాచారం అందించాడు. దీంతో రీనాకర్ స్నేహితులిద్దరినీ తన ఇంటికి ఆహ్వానించాడు. చౌరస్తాలో జరిగిన విషయమంతా వారు రీనాకర్‌కు వివరించగా, వారి ముగ్గురికి సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించాడు.


మిత్రుడిని నమ్మించి మోసం చేసిన రీనాకర్..
తన మిత్రుడి స్నేహితురాలిని లొంగదీసుకోవాలని రీనాకర్ కుట్ర పన్నాడు. వెంటనే వారితో 'మీ కోసం పోలీసులు వెతుకుతున్నారు.. దొరికితే పట్టుకెళతారు.. విలేకరులు పేపర్లో రాస్తారు.. మీ పరువు పోతుంది' అని వారిని భయభ్రాంతులకు గురి చేశాడు. ఒకసారి బైక్ ఇస్తే తన స్నేహితురాలిని బస్సు ఎక్కించి వస్తానని ఆ యువకుడు రీనాకర్‌తో చెప్పగా.. 'నీవు వెళ్తే పోలీసులు పట్టుకుంటారు..నేను వెళ్లి బస్సు ఎక్కిస్తా' అంటూ రాత్రి 10 గంటలకు ఆ అమ్మాయిని బైక్‌పై ఎక్కించుకుని తీసుకెళ్లాడు. మాందారిపేటకు చేరుకున్నాక పోలీసులు ఉన్నారని చెప్పి, వివిధ దారులు తిప్పుతూ చివరకు మైలారం మీదుగా హుస్సేన్‌పల్లి వెళ్లే దారికి చేరుకున్నాడు. అక్కడ ఆమెను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె వారించడంతో అత్యాచారం చేశాడు. ఈ విషయం ఎవరికైనా చెపితే చంపేస్తానని బెదిరించాడు.

తిరిగి బైక్‌పై ఎక్కించుకుని ఇంటికి చేరుకున్నాడు. అప్పటికే వెళ్లిపోయిన ఆ యువకుడికి మళ్లీ ఫోన్ చేసి ఇంటికి రప్పించుకుని తెల్లవారుజామున 2 గంటలకు అతడి స్నేహితురాలిని అప్పగించాడు. బస్సు ఎందుకు ఎక్కించలేదని ప్రశ్నించగా పోలీసులు వెదుకుతున్నారు.. ఈ రాత్రి ఇక్కడే ఉండి తెల్లవారిన తర్వాత తన బైక్‌పై హన్మకొండ వెళ్లమని చెప్పాడు. దీంతో ఆ యువకుడు తెల్లవారుజామున 5 గంటలకు తన స్నేహితరాలిని తీసుకుని మాందారిపేటకు రాగానే బైక్ పంక్చర్ అయింది. వాహనాన్ని అక్కడే వదిలేసి బస్సులో హన్మకొండకు వెళ్తుండగా జరిగిన విషయాన్ని ఆమె తన స్నేహితుడితో చెప్పింది. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే తాను బతకనని స్నేహితురాలు రోదించడంతో ఎవరికీ చెప్పకుండా ఉన్నాడు.

డిసెంబర్ 31న రీనాకర్ ఆ యువకుడికి ఫోన్ చేసి 'మీరు వచ్చిన విషయం పోలీసులకు, విలేకరులకు తెలిసింది. వారిని మేనేజ్ చేసేందుకు రూ.30 వేలు ఖర్చయ్యాయి.. ఆ మొత్తం ఇవ్వాలి' అని డిమాండ్ చేశాడు. అలాగే మీ పెళ్లి కూడా చేయిస్తా.. అందుకు రూ. లక్ష ఖర్చు అవుతుందని చెప్పడంతో ఆ యువకుడు మొత్తం రూ.60 వేలు ఇస్తానని చెప్పాడు. ఆ మాట ప్రకారం ఈ నెల 2న కోచింగ్‌కు వెళ్లాలంటూ తన బావ వద్ద రూ. 30 వేలు తీసుకొచ్చి రీనాకర్‌కు ఇచ్చాడు. కాగా, మరో రూ.30 వేల కోసం రీనాకర్ వేధిస్తుండడంతో భరించలేక మొత్తం విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. వారి సహాయంతో ఈ నెల 11న స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రీనాకర్, మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ నెల 12న బాధితురాలి స్టేట్‌మెంట్‌ను ఉమెన్ పోలీస్ అధికారి చేత రికార్డు చేయించారు. ఇలా పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రీనాకర్‌తో పాటో మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. రీనాకర్‌పై 366, 376, 506, 384, 385, 354ఏ, సబ్‌సెక్షన్ 2, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 4, నిర్భయ యాక్ట్ -2013 కేసులను నమోదు చేశామని, మరో ముగ్గురిపై 354ఏ, సబ్‌సెక్షన్ 2, క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 4, నిర్భయ యాక్ట్ 2013 కేసులను నమోదు చేశామని తెలిపారు. రీనాకర్ నుంచి బైక్, రూ.30 వేలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరంతా తమ నేరాలను అంగీకరించారని చెప్పారు. వీరిని బుధవారం రాత్రి కోర్టులో హాజరుపర్చినట్లు డీఎస్పీ తెలిపారు. ఆయన వెంట పరకాల సీఐ మల్లయ్య, శాయంపేట ఎస్సై ప్రవీణ్‌కుమార్ ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement