'ఇంద్రాణి నా తల్లి కాదు.. సోదరి కాదు'
ముంబై: 'ఇంద్రాణి నా తల్లి కాదు.. సోదరి కూడా కాదు. కొన్ని సంవత్సరాల కిందట మన జీవితాల్లోకి వచ్చిన ఓ మంచి వ్యక్తి ఆమె'- షీనాబోరా ఈమెయిలో ఐడీ నుంచి 2013 మార్చ్ నెలలో వచ్చిన ఒక ఈమెయిల్ సారాంశమిది. షీనాబోరా ఐడీ నుంచి ఇంద్రాణి ముఖర్జీ భర్త, మీడియా అధిపతి పీటర్ ముఖర్జీయాకు ఈ మెయిల్ అందింది. అంటే షీనాబోరా హత్యకు గురైన ఏడాది తర్వాత కూడా ఆమె పేరిట ఉన్న ఈమెయిల్ ఐడీని ఉపయోగించినట్టు దీనిని బట్టి తెలుస్తున్నది. షీనా బోరా హత్యకేసు దర్యాప్తులో ఇది కీలక ఆధారంగా ఉపయోగపడుతుందని సీబీఐ భావిస్తున్నది.
సీబీఐ దర్యాప్తు జరుపుతున్న ఈ కేసులో షీనాబోరాను తల్లి ఇంద్రాణియే హత్యచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. షీనా బోరా తన కూతురు అయినప్పటికీ ఆ విషయాన్ని దాచి సోదరిగా ఇంద్రాణి ప్రపంచానికి పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో షీరా బోరా హత్యకు గురయిన ఏడాది తర్వాత ఆమె ఈమెయిల్ ఐడీ నుంచి ఇంద్రాణి భర్తకు వచ్చిన మెసెజ్ లో చిత్రమైన విషయాలు పేర్కొని ఉన్నాయి. 1991లో షీనా బోరా తాత, నాయనమ్మల సహకారంతో ఒక నిగూఢ మహిళ ఇంద్రాణి అవతారంలోకి మారిందని, అసలు ఇంద్రాణి షీనా రెండేళ్ల వయస్సు ఉన్నప్పుడే షీనాను, మైఖేల్ ను వదిలి ఇంటి నుంచి వెళ్లిపోయిందని ఈ మెయిల్ పేర్కొంది. అయితే.. షీనా, ఇంద్రాణి మధ్య బంధం ఏమిటన్నది షీనా హత్యకు ముందు పీటర్ కు తెలియదని ఈ మెయిల్ ద్వారా తెలుస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ మెయిల్ లోని విషయాలను ఓ జాతీయ మీడియా వెలుగులోకి తెచ్చింది. గొంతు నులుమడం వల్ల ఊపిరి ఆడకపోవడంతో షీనాబోరా చనిపోయిందని ఎయిమ్స్ పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నట్టు తెలిసింది.
షీనాబోరా వజ్రాల వ్యాపారిని పెళ్లాడింది!
2012 ఏప్రిల్ నుంచి కనిపించకుండా పోయిన షీనాబోరా గురించి అడిగితే తన తల్లి ఇంద్రాణి కోప్పడేదని, అయితే ఓసారి మాత్రం షీనాబోరా అమెరికాలోని వజ్రాల వ్యాపారిని పెళ్లాడిందని చెప్పిందని విధి సీబీఐకి తెలిపింది. షీనాబోరా హత్యకేసులో భాగంగా ఇంద్రాణి, పీటర్ ముఖర్జీయా కూతురు అయిన విధి సీబీఐకి వాంగ్మూలం ఇచ్చింది.