sheena murder case
-
'మైఖెల్ చంపాడు.. నేను అండగా ఉన్నాను'
ముంబయి: తన కుమార్తె షీనాబోరాను తన మాజీ భర్త మైఖెల్ హత్య చేశాడని, ఆ సమయంలో తాను సహాయం మాత్రమే చేశానని ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా భర్త పీటర్ ముఖర్జియాకు తెలిపినట్లు తెలిసింది. దేశంలో సంచలనం సృష్టించిన షీనాబోరా హత్య కేసులో ఇంద్రాణిని 2015 ఆగస్టులో పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఆమె నేరాన్ని అంగీకరించలేదు. జైలుకు తీసుకెళ్లిన తర్వాత పీటర్ ఓసారి ఆమెను జైలులో కలిశారు. ఆ సమయంలో తాను ఆ హత్య చేయలేదని, మైఖెలే చేశాడని, మృతేదేహాన్ని కనిపించకుండా చేసేందుకే సహాయపడినట్లు ఆయనతో చెప్పారని పీటర్ సోదరుడు గౌతమ్ ముఖర్జియా తెలిపారు. అనవసరంగా తన సోదరుడు పీటర్‌ను ఈ కేసులో ఇరికించారని, 250 ఆధారాలు ఉన్నా అందులో ఏ ఒక్కటీ పీటర్ పాత్ర ఉందని రుజువు చేయలేకపోతున్నాయని అన్నారు. -
మోహన్‌నాథ్ గోస్వామికి అశోకచక్ర
శ్రీనగర్: ఉగ్రవాదులపై పోరులో అసువులుబాసిన అమర జవాను, భారత ఆర్మీ ప్రత్యేక దళాల కమాండో లాన్స్ నాయక్ మోహన్‌నాథ్ గోస్వామికి కేంద్రం అత్యున్నత శౌర్య పురస్కారం అశోకచక్రను ప్రకటించింది. గత ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో తోటి జవాన్లను కాపాడే క్రమంలో గోస్వామి నేలకొరిగారు. దేశం గర్వించేలా చేసిన గోస్వామి మరణంలోనూ జీవించే ఉన్నాడని, అతని ఆత్మత్యాగం.. పరాక్రమానికి గుర్తింపుగా రిపబ్లిక్ డేను పురస్కరించుకుని అశోక చక్రను ప్రకటించినట్లు రక్షణ శాఖ ప్రతినిధి తెలిపారు. ఎన్కౌంటర్లో గోస్వామి ఉగ్రవాదుల బుల్లెట్లు శరీరాన్ని చీల్చుకుపోయినా వెరవకుండా.. ఎదురు కాల్పులు జరిపి ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టడమే కాకుండా తన సహచరులను రక్షించాడు. మిగతా ముఖ్యమైన శౌర్యపతకాల విజేతలు కీర్తి చక్ర: సుబేదార్ మహేంద్ర సింగ్ (9 పారా స్పెషల్ ఫోర్స్), సిపాయి జగదీశ్‌చంద్(546 డీఎస్సీ ప్లాటూన్-మరణానంతరం), శౌర్య చక్ర: (కల్నల్ సంతోశ్ (మరణానంతరం), మేజర్ అనురాగ్ కుమార్, నాయక్ సతీశ్ కుమార్ (మరణానంతరం), సిపాయి ధర్మరామ్ (మరణానంతరం), మరో నలుగురికి. 26 మంది సీబీఐ అధికారులకు రాష్ట్రపతి మెడల్స్ శారద చిట్‌ఫండ్ స్కాం, షీనా బోరా హత్య కేసులను విచారించిన అధికారులు సహా 26 మంది సీబీఐ అధికారులకు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పురస్కారం, పోలీసు ప్రతిభా పురస్కారాలు దక్కాయి. శారదా స్కామ్‌పై సిట్ బృంద సారథి రాజీవ్‌సింగ్‌ను విశిష్ట సేవా పతకం వరించింది. షీనా హత్య కేసును దర్యాప్తు చేసిన లతా మనోజ్‌కుమార్‌కు ప్రతిభా పురస్కారం దక్కింది. -
పీటర్ ముఖర్జీపై హత్యానేరం
షీనా హత్యలో కీలకంగా వ్యవహరించాడన్న సీబీఐ ముంబై: షీనా బోరా హత్యకేసులో పీటర్ ముఖర్జీపై సీబీఐ హత్యానేరం మోపింది. ఇంద్రాణితో కలిసి షీనా బోరాను హత్యచేయటంలో కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. పీటర్‌ను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్టిన సీబీఐ హత్యకు ముందు, హత్య జరుగుతున్నప్పుడు, ఆ తర్వాత కూడా ఇంద్రాణితో పీటర్ మాట్లాడుతూ ఉన్నట్లు తెలిపింది. షీనా, ఇంద్రాణీ మధ్య గొడవలకు పీటర్ మధ్యవర్తిత్వం వహించాడని సీబీఐ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ అనిల్ ికోర్టుకు తెలిపారు. షీనా విషయంలో కొడుకు రాహుల్‌కు వాస్తవాలు చెప్పకుండా తప్పుదోవ పట్టించాడన్నారు. -
'బాధగా ఉంది.. కానీ రాజీనామా చేయడం లేదు'
ముంబయి: తన బదిలీ చాలా బాధగా అనిపించిందని అయితే రాజీనామా చేసే ఆలోచనేది లేదని షీనా బోరా హత్య కేసును విచారించిన మాజీ ముంబయి పోలీస్ కమిషనర్, సీనియర్ ఐపీఎస్ అధికారి రాకేశ్ మారియా అన్నారు. తన బదిలీ విషయంలో తాను రాజీనామా చేస్తున్నానని వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేశారు. షీనా హత్య కేసును విచారిస్తున్న ఆయనను మహారాష్ట్ర ప్రభుత్వం ఉన్నపళంగా బదిలీ చేసి, డీజీపీ(హోంగార్డ్స్)గా పదోన్నతి కల్పించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలోకి డీజీపీ ర్యాంక్ అధికారి అహ్మద్ జావెద్ ముంబై నూతన పోలీసు కమిషనర్‌గా నియమించారు. అయితే, ఈ నియామకం వెనుక రాజకీయ ప్రమేయం ఉందని తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. పరోక్షంగా ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు కూడా ఆయన నచ్చలేదని అందుకే ఆయనను వేరే శాఖకు బదిలీచేశారని కూడా విమర్శలు వినిపించాయి. ఆ నిర్ణయం హత్యకేసు దర్యాప్తును పక్కదారి పట్టించేందుకేననే విమర్శలు వెల్లువెత్తడంతో దిద్దుబాటుకు దిగి బదిలీతో సంబంధం లేకుండా ఈ కేసు దర్యాప్తును మారియానే పర్యవేక్షిస్తారని ప్రకటించింది. కానీ, బదిలీపై తీవ్ర ఆందోళనతో ఉన్న మారియా రాజీనామా చేసే ఆలోచన చేస్తున్నారని మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన బుధవారం ఈ వివరణ ఇచ్చారు.