చదువుకోవాలని ఉంది సారూ..
గొర్రెలకు కాపలాగా వెళుతున్న బాలికల ఆవేదన
మెదక్ రూరల్: తమకు ఇతర పిల్లల మాదిరిగా చదువుకోవాలని ఉందని గొర్రెలకు కాపలాగా వెళుతున్న మెదక్ మండలం రాజ్‌పల్లి పంచాయతీ పరిధిలోని తిమ్మక్కపల్లి గిరిజన తండాకు చెందిన ఇరువురు గిరిజన బాలికలు అనిత, సంగీత వాపోతున్నారు. తమను పెద్దలు గతకొన్నిరోజులుగా చదువు మాన్పించి గొర్రెలకు కాపలాగా పంపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.శనివారం రాజ్‌పల్లి పంటపొలాల్లో జీవాలను మేపుతున్న ఆ బాలికలు సాక్షి ప్రతినిధి కంటపడ్డారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమకు ఇతర పిల్లల మాదిరిగా చదువుకోవాలనే ఉందన్నారు.
తండాకు చెందిన లంబాడి హమ్యా లక్ష్మి దంపతులకు సంగీత ఒక్కతే కుమార్తె. ఆమె ప్రస్తుతం రాజ్‌పల్లి ఉన్నతపాఠశాలలో 7వ తరగతి చదువుతోంది.సంగీత తండ్రి హమ్య ఇటీవల పాముకాటుతో మృత్యువాత పడ్డాడు. దీంతో కుటుంబం గడవటం కష్టంగా మారిందని, చేసేదిలేక తల్లి లక్ష్మి తన కూతురు చదువు మాన్పించి గొర్రెలకు కాపలాగా పంపిస్తోంది. అయితే చదువంటే తనకు ప్రాణమని, ఆర్థిక ఇబ్బందువల్ల తన తల్లి చదువు మాన్పించిందన్నారు. ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆదుకుంటే చదువుకుంటానని చెబుతోంది.
అలాగే ఇదేతండాకు చెందిన మంగ్యా, బీబ్లీ దంపతులకు నలుగురు సంతానం. వీరిలో ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. ఆఖరు సంతానం అనిత ప్రస్తుతం మెదక్‌లోని బాలికల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఉన్నట్టుండి తనను చదువు మాన్పించి గొర్రెలకు కాపలాగా పంపుతున్నారని అనిత పేర్కొంది. తమకు బాగా చదువుకోవాలని ఉందని వారు వాపోయారు. ఈ విషయమై అధికారులు స్పందించి సంగీత, అనిత తల్లి దండ్రులకు అవగాహన కల్పించి వారిని మళ్లీ బడికి పంపేలా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.