‘షెలాడియా’కి రాజధాని రోడ్ల నిర్మాణం!
కనకదుర్గ వారధి నుంచి భవానీపురం వరకు రోడ్డు నిర్మాణానికి కేంద్రం ఓకే!
సాక్షి, హైదరాబాద్: ఏపీ నూతన రాజధాని ప్రాంతంలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి సాధ్యాసాధ్యాలు(ఫీజిబులిటీ), డీపీఆర్‌ల తయారీ బాధ్యతలను కన్సల్టెన్సీకి అప్పగించనున్నారు. తొలుత కేంద్ర నిధులతో రాష్ట్రం చేపట్టే రోడ్ల నిర్మాణాన్ని కన్సల్టెన్సీకి అప్పగిస్తారు. విశ్వసనీయ సమాచారం మేరకు షెలాడియా కన్సల్టెన్సీకి ఈ పనులు అప్పగించనున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఈ కన్సల్టెన్సీ రాజధాని ప్రాంతంలోని కనకదుర్గ వారధి నుంచి భవానీపురం వరకు ఎన్‌హెచ్-5, ఎన్‌హెచ్-9లను కలిపే 5 కిలోమీటర్ల జాతీయ రహదారికి 3 ఆప్షన్లతో ఫీజిబిలిటీ రిపోర్టు ఇచ్చింది. ఈ నివేదిక ప్రకారం కేంద్రం జాతీయ రహదారి నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి అప్పగించింది. కనకదుర్గ వారధి నుంచి భవానీపురం వరకు 4 లేన్ల రహదారి విస్తరణతో పాటు దుర్గగుడి నుంచి భవానీపురం వరకు ఫ్లైవర్ నిర్మాణాన్ని సూచిస్తూ ఇచ్చిన ఆప్షన్-2కు కూడా కేంద్రం ఆమోదముద్ర వేసింది.
ఈ రోడ్డు నిర్మాణాన్ని కోరుతూ విపక్షంలో ఉన్న సమయంలో చంద్రబాబు ధర్నాలు చేయడం గమనార్హం. కాగా దీనికి సంబంధించి డీపీఆర్‌ను వెంటనే పంపాలని కూడా కేంద్రం సూచించింది. ఇదిలావుంటే, ఫీజిబిలిటీ రిపోర్టు ఇచ్చేందుకు ప్రభుత్వం షెలాడియా కన్సల్టెన్సీకి రూ.35 లక్షలను ఇప్పటికే చెల్లించింది. అయితే, ఈ రిపోర్టు సమర్పణకు ఆర్నెల్ల గడువు విధించడంతో రూ.55 లక్షలు చెల్లించనున్నట్టు సమాచారం. మరోపక్క, రాజధాని చుట్టూ 225 కి.మీ. మేర నిర్మించే ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి కేంద్రం నిధులిచ్చేందుకు అంగీకరించడంతో ఫీజిబిలిటీ రిపోర్టు తయారీ బాధ్యత కూడా కన్సల్టెన్సీ చేతిలో పెట్టనున్నారు.