ఆరో తరగతి విద్యార్థిని ఆత్మహత్య
నిజాంసాగర్(జుక్కల్): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామానికి చెందిన ఆరో తరగతి విద్యార్థిని శెట్టి షాలిని(11) బుధవారం ఆత్మహత్య చేసుకుంది. గ్రామానికి చెందిన శెట్టి సంగీత, శ్రీశైలంలకు ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. కూతురు షాలిని పిట్లంలోని ప్రైవేట్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. హోంవర్క్ చేయకపోవడంతో ఉపాధ్యాయుడు మందలించడం, ఇంట్లో అన్నయ్య తరచూ కొడుతుండడం, తల్లిదండ్రుల మందలింపులతో మనస్తాపానికి గురైంది.
మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటల వేడిని తాళలేక ఇంట్లోనుంచి బయటికి పరుగెత్తుకు వచ్చింది. స్థానికులు దీనిని గమనించి మంటలను ఆర్పివేశారు. తీవ్రంగా గాయపడిన షాలినిని కుటుంబ సభ్యులు సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడినుంచి సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మరణించింది. కాగా సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ లభించినట్లు తెలుస్తోంది.
హోంవర్క్ చేయకపోవడంతో ఉపాధ్యాయుడు మందలించి, ప్రిన్సిపాల్‌కు చెబుతానని బెదిరించారని, ఇంట్లో అన్నయ్య కొడుతున్నాడని అందులో పేర్కొన్నట్లు సమాచారం. అయితే కూతురి ఆర్యోగ పరిస్థితి బాగాలేదని, అందుకే ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తండ్రి శ్రీశైలం ఫిర్యాదు చేశారని నిజాంసాగర్ ఏఎస్సై గాంధీ గౌడ్ తెలిపారు.