shidha raghava rao
-
అమాత్యుడి పాలన.. అవినీతి లాలన..
సాక్షి, దర్శి (ప్రకాశం): అలివికాని అబద్దపు హామీలిచ్చి ఓట్లేయించుకుని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన శిద్దా రాఘవరావు ఈ అయిదేళ్లలో దర్శి నియోజకవర్గాన్ని అంధకారంలోకి నెట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక నియోజకవర్గాన్ని అధోగతి పాలు చేశారు. రూ. మూడు వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్తున్న మంత్రిని శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ, వైఎస్సార్ సీపీ నాయకులు సవాల్ విసిరితే మాత్రం తేలుకుట్టిన దొంగలా నోరు మెదపక పోవడమే అందుకు నిదర్శనమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికారంలోకి వచ్చిన తరువాత ముండ్లమూరు మండలంలో ప్రధానంగా ఇసుక దోపిడీపై దృష్టి పెట్టారు. బినామీగా అక్కడి మండల పదవి అనుభవిస్తున్న వ్యక్తిని అడ్డుపెట్టుకుని చిలకలేరు, పోలవరంలలో ఇసుకను ఇష్టారాజ్యంగా ఇప్పటికీ ఇతర జిల్లాలకు తరలించడం గమనార్హం. ప్రతి రోజు సుమారు వంద టర్బోలు, రెండు వందల ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. దీంతో భూగర్భజలాలు పూర్తిస్థాయిలో అడుగంటి అక్కడి రైతులు లబోదిబో మంటున్నారు. గత ఐదేళ్లలో మంత్రి గారి ఇలాకాలో ఆయన బినామీలు సుమారు రూ. 50 కోట్లకు మేర దోచుకున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ దోపిడీలో పోలీసులు సైతం ప్రధాన పాత్ర పోషించారన్న విమర్శలున్నాయి. సాగర్ జలాల సరఫరాలో ఘోర వైఫల్యం టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014వ సంవత్సరం సాగర్ జలాలు విడుదల చేశారు. పూర్తి స్థాయిలో కాలువలకు నీరందించపోగా, రైతుల వరి పొలాలు ఎండిపోతుంటే కనీసం అటు వైపు మంత్రి కన్నెత్తి చూడలేదు. అప్పట్లో ఒక్కో రైతు ఎకరాకు రూ. 15 వేల వరకు నష్ట పోయారు. ఆతరువాత చంద్రబాబు అడుగు పెట్టిన పుణ్యమా అని మూడేళ్లు కరువు కరాళ నృత్యం చేసింది. 2018లో ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడి సాగర్ డ్యాం పూర్తి స్థాయిలో నిండింది. రైతులందరూ కంది వేసుకున్న నెల తరువాత వరికి సాగర్ జలాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రైతుల ఆశలు చిగురించాయి. రూ. 5 వేలు కర్చు చేసి వేసిన కందిని దున్నేసి తిండి గింజల కోసం సుమారు ఆయకట్టు పరిధిలో 80 వేల ఎకరాల్లో వరి నాటారు. నాటిన వెంటనే ప్రధాన కాలువకు వారబందీ పెట్టి రైతులకు వెన్నుపోటు పొడిచారు. దీంతో ఒక్కోక్క రైతు వరికి రూ. 25 వేలు, కందికి రూ. 5 వేలు వెరసి రూ. 30 వేల వరకు నష్టపోయిన విషయం ఆయనకు తెలియందేమీ కాదు. మినుముల్లో కూడా భారీ దోపిడీ 2017వ సంవత్సరంలో దర్శి నియోజకవర్గంలో 168 క్వింటాళ్లు మినుములు పండించారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి మినుములు కొనుగోలు చేసి మార్క్‌ఫెడ్ ద్వారా 29 వేల క్వింటాళ్ల మినుములు ప్రభుత్వ మద్దతు ధరకు అమ్మి ప్రజాదనాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. ఈ తతంగం మొత్తం మంత్రి కుమారుడు, మార్క్‌ఫెడ్‌కు చెందిన రాష్ట్ర అధికారి కనుసన్నల్లోనే జరిగినట్లు సమాచారం. ఈ విధంగా కందులు, మినుముల్లో రూ. 120 కోట్ల వరకు మంత్రి బినామీల ద్వారా దోచుకున్నట్లు సమాచారం. నీరు–చెట్టు కాసుల పట్టు నీరు–చెట్టు పథకం ద్వారా నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు అడ్డగోలుగా దోచుకున్నారు. పాతగుంటలను చదరం చేసి నూతనంగా పనులు చేసినట్లు రికార్డుల్లో చూపించి ఇష్టారీతిన దోచుకున్నారు. కార్పొరేషన్ రుణాల్లో కమీషన్లే పలు కుల సంఘాలకు కార్పొరేషన్ ద్వారా కల్పించిన సబ్సిడీ రుణాల్లో కూడా 15 శాతం కమీషన్ తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. వారు ఇచ్చిన రుణాలకు షాపులు, సంబంధిత వ్యాపారాలు లేకున్నప్పటికీ ఇతర దుకాణాలు, వ్యాపారాలు చూపించి మరి పేదలకు చెందాల్సిన కార్పొరేషన్ రుణాలను కమీషన్ల కోసం అనర్హుల జేబులు నింపిన సంఘటనలు విచారిస్తే వెలుగుచూస్తాయి. ఆర్ అండ్ బీలో భారీ అవినీతి రోడ్డు, భవనాలు శాఖలో మంత్రిగా ఉన్న హయాంలో నియోజకవర్గంలో ప్రధాన నాయకుల్ని బినామీలుగా పెట్టుకుని జిల్లాలో వేసిన రోడ్లలో బారీగా కమీషన్లు పుచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. దర్శి నుంచి బొట్లపాలెం వెళ్లే రోడ్డులో ప్రస్తుతం డబుల్ రోడ్డు ఉంది. గతంలో ఉన్న సింగిల్ రోడ్డుకు రూ. 70 లక్షలు నిధులు మంజూరు చేసి రోడ్డు వేసినట్లు బిల్లులు చేసుకున్నారు. అయితే ఆ రోడ్డుకు రెండు మూడు సార్లు మరమ్మతులు మాత్రమే చేశారు. తూర్పువీరాయపాలెంలో టీడీపీ కార్యకర్తకు గ్రామంలోని ప్రధాన రోడ్డుపై నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కోర్డు ఆర్డర్లను దిక్కరించి మంత్రి అండదండలతో భారీ భవనాన్ని ఏర్పాటు చేశారు. ఉల్లగల్లు నుంచి మొహిద్దినాపురంనకు రోడ్డు మంజూరు కాగా దానిని మంజూరైన ప్రాంతంలో కాకుండా తక్కువ మొత్తానికి పూర్తి చేయాలనే దురుద్దేశ్యంతో దారులు తప్పించి వీరాయపాలెం గ్రామంలోకి వేశారు. నిర్మించాల్సిన చోట బ్రిడ్జి నిర్మాణం చేయకుండా వైఎస్సార్ సీపీ మద్దతు దారుల పట్టా భూముల్లో నుంచి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో ఆ రైతులు కోర్డును ఆశ్రయించారు. అయినప్పటికి వారికి మాత్రం కోట్లాది రూపాయలు బిల్లులు మంజూరు చేశారు. ఈ తతంగాన్ని మంత్రి శిద్దా రాఘవరావు ఒత్తిళ్ల మేరకే చేశారని ఆ పొలం యజమాని ఆరోపిస్తున్నారు. శిద్దా మంత్రి అయ్యాక గత నాలుగేళ్లుగా వర్షాలు లేక నియోజకవర్గంలో తీవ్ర కరువు ఏర్పడింది. రైతులు కూలీలుగా మారిపోయినా.. దర్శి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోవడం అమాత్యుడి అసమర్ధతేనని రైతులు మండిపడుతున్నారు. తాగునీటికి దిక్కులేదు గ్రామాల్లో ఐదేళ్లుగా తాగునీరు లేక గొంతెండిపోయింది. ఇంటింటికి తాగునీరు అందిస్తామని చెప్పిన మంత్రి తమ స్వార్థం కోసం ఎన్ఏపీ ప్రాజెక్టును శిథిలావస్థకు చేర్చారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు బిల్లులు చేసుకుని అడ్డగోలుగా దోచుకున్నారే గాని తాగునీరు అందించిన పాపాన పోలేదని స్థానికులు మండిపడుతున్నారు. భూ మాయలో శిద్దహస్తులే తన బినామీల చేత అసైన్డు భూములను ఆక్రమింపజేసి వాటిని ప్లాట్లుగా మార్చి అధికారాన్ని అడ్డుపెట్టి పేదల ముసుగులో దనవంతులకు ఆ ప్లాట్లను అమ్ముకుని వారికి ప్రభుత్వ పట్టాలు ఉచితంగా ఇప్పించినట్లు ప్రచారం చేసుకున్న ఘనత ఒక్క మంత్రి శిద్దా రాఘవరావుకే దక్కిందని చెప్పవచ్చు. ఈ విధంగా కురిచేడు రోడ్డు, అద్దంకి రోడ్లలో మంత్రి అండదండలతో వందల సంఖ్యలో ప్లాట్లు వేసి ప్రభుత్వ భూములను అమ్ముకుని అడ్డగోలుగా దోచుకున్నారు. ఇంత దోపిడీకి అలవాటైన తెలుగుతమ్ముళ్లు మంత్రిని వదిలి పెట్టలేక పోతున్నారని నియోజకవర్గంలో చర్చనియాంశమైంది. కందులు, మినుములు కొనుగోలులో రూ. 60 కోట్ల దోపిడీ జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన కందుల్లో రూ. 60 కోట్లకు పైగా దోపిడీ జరిగినట్లు స్పష్టమవుతుంది. 2017–18 సంవత్సరంలో జిల్లాలో మార్క్‌ఫెడ్ ద్వారా 34576.600 మెట్రిక్ టన్నులు, నాఫెడ్ ద్వారా 17684.600 మెట్రిక్ టన్నులు కందులు కొనుగోలు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర క్వింటాకు రూ. 5450 లెక్కన రూ. 284,82,35,400 రైతులకు చెల్లించింది. అయితే ఆ సొమ్ము బ్యాంకు ఖాతాలకు చేరిందే గాని రైతులకు మాత్రం చెందలేదు. రైతుల ఖాతాలను ఉపయోగించుకుని ఇతర రాష్ట్రాల నుంచి కందులు కొనుగోలు చేసి ఆ కందులను రైతులు పండించినట్లు కాగితాల్లో సృష్టించి వాటిని మార్క్‌ఫెడ్‌కు తరలించి రైతులకు చెందాల్సిన సబ్సిడీని అడ్డదారిలో అడ్డగోలుగా దోచుకున్నారు. -
కథలు చెప్పొద్దు
♦ జిల్లాలో పరిస్థితి భయంకరంగా ఉంది. ♦ ఒక్కో గ్రామంలో 300 మంది జ్వర పీడితులున్నారు ♦ 56 మండలాల్లో ఇదే పరిస్థితి ♦ ఎక్కడా డాక్టర్లు సరిగ్గా లేరు.. సరైన మెడిసిన్ లేదు ♦ మీవల్ల సర్కారుకు చెడ్డపేరొస్తోంది ♦ పద్దతి మార్చుకొని ప్రజారోగ్యంపై దృష్టి సారించండి ♦ వైద్యాధికారులపై మంత్రి శిద్దా ఫైర్ ఒంగోలు టౌన్ : ‘ప్రతి గ్రామంలో 250 నుంచి 300 మంది జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగీ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. జిల్లాలోని 56 మండలాల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లాలో పరిస్థితి భయంకరంగా ఉంటే డాక్టర్స్ ఎక్కడా కరెక్ట్‌గా లేరు. సరైన మెడిసిన్ లేదు. అదేమని అడిగితే స్టోరీలు చెబుతున్నారు. పద్ధతి మార్చుకొని ప్రజారోగ్యంపై దృష్టి పెట్టాలి. మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు. జ్వరాలు మాత్రం కంట్రోల్ కావాలి’అని రాష్ట్ర అటవీ శాఖామంత్రి శిద్దా రాఘవరావు ఆదేశించారు. జిల్లాలో జ్వరాల తీవ్రత నేపథ్యంలో మంగళవారం స్థానిక సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో వైద్యాధికారులు, నియోజకవర్గ ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో 96,524 మంది జ్వర బాధితులు: డీఎంహెచ్ఓ జిల్లాలో గతేడాది 1,12,254 మంది సాధారణ జ్వరాలతో బాధపడగా.. ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటి వరకు 96,524 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి జె.యాస్మిన్ వెల్లడించారు. ఈ ఏడాది జనవరిలో 11, ఫిబ్రవరిలో 25, మార్చిలో 21, ఏప్రిల్‌లో 28, మే నెలలో 19, జూన్‌లో 7, జూన్‌లో 13, జూలైలో 13, ఆగస్టులో 53, సెప్టెంబర్‌లో 91 డెంగీ కేసులు నమోదైనట్లు వివరించారు. ఈ ఏడాది జిల్లాలో మలేరియా కేసులు తగ్గుముఖం పట్టినప్పటికీ డెంగీ కేసులు పెరిగాయన్నారు. మంత్రి శిద్దా జోక్యం చేసుకుంటూ తాను 15 రోజుల కిందట దర్శి నియోజకవర్గంలో పర్యటిస్తే అక్కడ వైద్యులు అందుబాటులో లేరని, మందులు కూడా లేవన్నారు. అదే సమయంలో ఒక ఆర్ఎంపీకి చెందిన చిన్న షెడ్లో 50 మంది జ్వర పీడితులు ఉన్నారని, బెడ్స్ లేకపోవడంతో చాపలు, నాపరాళ్లపై పడుకోబెట్టి వైద్యం అందిస్తున్నారన్నారు. ఎంత చెప్పినా మార్పు రావడంలేదని, మీవల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందంటూ వైద్యాధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు ఒంగోలులో కూర్చుంటే కుదరదని, సరైన డైరెక్షన్ ఇస్తూ జ్వరాలను నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సక్రమంగా పనిచేయకపోతే సస్పెండే: కలెక్టర్ జిల్లాలో వ్యాధులను నియంత్రించేందుకు రానున్న మూడు రోజులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి. వినయ్‌చంద్ ఆదేశించారు. విధులు సక్రమంగా నిర్వహించకుంటే వైద్యులు, వైద్యులైనా, వైద్య సిబ్బంది అయినా, పంచాయతీ కార్యదర్శులైనా సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. పారిశుద్ధ్యంపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఏరోజుకారోజు తనకు నివేదికలు అందించాలని ఆదేశించారు. ఒంగోలుతో పాటు మిగతా అన్ని మున్సిపాలిటీల్లో జనావాసాల మధ్య పందులు పెంచకుండా ఉండేందుకు, వాటి నిర్వాహకులకు నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. 20 రోజుల్లో జిల్లాకు ప్లేట్లెట్స్ మెíషీన్: మంత్రి శిద్దా 20 రోజుల్లో జిల్లాకు ప్లేట్లెట్స్ మెషీన్ వస్తోందని మంత్రి శిద్దా రాఘవరావు వెల్లడించారు. సమీక్ష సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్లేట్లెట్స్ మెషీన్‌కు సంబంధించి టెండర్ ప్రక్రియ జరుగుతుందన్నారు. జిల్లాలో డెంగీతో ఎవరూ చనిపోలేదని, వివిధ అనారోగ్య కారణాలతోనే చనిపోయారని స్పష్టం చేశారు.