అమాత్యుడి పాలన.. అవినీతి లాలన.. | Shidha Ragavarao Not Developed Darshi Constituency | Sakshi
Sakshi News home page

అమాత్యుడి పాలన.. అవినీతి లాలన..

Published Sun, Apr 7 2019 11:25 AM | Last Updated on Sun, Apr 7 2019 11:25 AM

Shidha Ragavarao Not Developed Darshi Constituency - Sakshi

శిథిలావస్థకు చేరిన తాగునీటి ఫిల్టర్‌బెడ్లు

సాక్షి, దర్శి (ప్రకాశం): అలివికాని అబద్దపు హామీలిచ్చి ఓట్లేయించుకుని నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన శిద్దా రాఘవరావు ఈ అయిదేళ్లలో దర్శి నియోజకవర్గాన్ని అంధకారంలోకి నెట్టారు. ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక నియోజకవర్గాన్ని అధోగతి పాలు చేశారు. రూ. మూడు వేల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్తున్న మంత్రిని శ్వేతపత్రం విడుదల చేయాలని బీజేపీ, వైఎస్సార్‌ సీపీ నాయకులు సవాల్‌ విసిరితే మాత్రం తేలుకుట్టిన దొంగలా నోరు మెదపక పోవడమే అందుకు నిదర్శనమన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అధికారంలోకి వచ్చిన తరువాత ముండ్లమూరు మండలంలో ప్రధానంగా ఇసుక దోపిడీపై దృష్టి పెట్టారు. బినామీగా అక్కడి మండల పదవి అనుభవిస్తున్న వ్యక్తిని అడ్డుపెట్టుకుని చిలకలేరు, పోలవరంలలో ఇసుకను ఇష్టారాజ్యంగా ఇప్పటికీ ఇతర జిల్లాలకు తరలించడం గమనార్హం. ప్రతి రోజు సుమారు వంద టర్బోలు, రెండు వందల ట్రాక్టర్ల వరకు ఇసుకను తరలిస్తూనే ఉన్నారు. దీంతో భూగర్భజలాలు పూర్తిస్థాయిలో అడుగంటి అక్కడి రైతులు లబోదిబో మంటున్నారు. గత ఐదేళ్లలో మంత్రి గారి ఇలాకాలో ఆయన బినామీలు సుమారు రూ. 50 కోట్లకు మేర దోచుకున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ దోపిడీలో పోలీసులు సైతం ప్రధాన పాత్ర పోషించారన్న విమర్శలున్నాయి. 

సాగర్‌ జలాల సరఫరాలో ఘోర వైఫల్యం
టీడీపీ అధికారంలోకి వచ్చిన 2014వ సంవత్సరం సాగర్‌ జలాలు విడుదల చేశారు. పూర్తి స్థాయిలో కాలువలకు నీరందించపోగా, రైతుల వరి పొలాలు ఎండిపోతుంటే కనీసం అటు వైపు మంత్రి కన్నెత్తి చూడలేదు. అప్పట్లో ఒక్కో రైతు ఎకరాకు రూ. 15 వేల వరకు నష్ట పోయారు. ఆతరువాత చంద్రబాబు అడుగు పెట్టిన పుణ్యమా అని మూడేళ్లు కరువు కరాళ నృత్యం చేసింది. 2018లో ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడి సాగర్‌ డ్యాం పూర్తి స్థాయిలో నిండింది.

రైతులందరూ కంది వేసుకున్న నెల తరువాత వరికి సాగర్‌ జలాలు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో రైతుల ఆశలు చిగురించాయి. రూ. 5 వేలు కర్చు చేసి వేసిన కందిని దున్నేసి తిండి గింజల కోసం సుమారు ఆయకట్టు పరిధిలో 80 వేల ఎకరాల్లో వరి నాటారు. నాటిన వెంటనే ప్రధాన కాలువకు  వారబందీ పెట్టి రైతులకు వెన్నుపోటు పొడిచారు. దీంతో ఒక్కోక్క రైతు వరికి రూ. 25 వేలు, కందికి రూ. 5 వేలు వెరసి రూ. 30 వేల వరకు నష్టపోయిన విషయం ఆయనకు తెలియందేమీ కాదు.

మినుముల్లో కూడా భారీ దోపిడీ
2017వ సంవత్సరంలో దర్శి నియోజకవర్గంలో 168 క్వింటాళ్లు మినుములు పండించారు. అయితే ఇతర రాష్ట్రాల నుంచి మినుములు కొనుగోలు చేసి మార్క్‌ఫెడ్‌ ద్వారా 29 వేల క్వింటాళ్ల మినుములు ప్రభుత్వ మద్దతు ధరకు అమ్మి ప్రజాదనాన్ని అడ్డగోలుగా దోచుకున్నారు. ఈ తతంగం మొత్తం మంత్రి కుమారుడు, మార్క్‌ఫెడ్‌కు చెందిన రాష్ట్ర అధికారి కనుసన్నల్లోనే జరిగినట్లు సమాచారం. ఈ విధంగా కందులు, మినుముల్లో రూ. 120 కోట్ల వరకు మంత్రి బినామీల ద్వారా దోచుకున్నట్లు సమాచారం.

నీరు–చెట్టు కాసుల పట్టు
నీరు–చెట్టు పథకం ద్వారా నియోజకవర్గంలో కోట్లాది రూపాయలు అడ్డగోలుగా దోచుకున్నారు. పాతగుంటలను చదరం చేసి నూతనంగా పనులు చేసినట్లు రికార్డుల్లో చూపించి ఇష్టారీతిన దోచుకున్నారు.   
కార్పొరేషన్‌ రుణాల్లో కమీషన్లే
పలు కుల సంఘాలకు కార్పొరేషన్‌ ద్వారా కల్పించిన సబ్సిడీ రుణాల్లో కూడా 15 శాతం కమీషన్‌ తీసుకున్నట్లు ఆరోపణలున్నాయి. వారు ఇచ్చిన రుణాలకు షాపులు, సంబంధిత వ్యాపారాలు లేకున్నప్పటికీ ఇతర దుకాణాలు, వ్యాపారాలు చూపించి మరి పేదలకు చెందాల్సిన కార్పొరేషన్‌ రుణాలను కమీషన్ల కోసం అనర్హుల జేబులు నింపిన సంఘటనలు విచారిస్తే వెలుగుచూస్తాయి.

ఆర్‌ అండ్‌ బీలో భారీ అవినీతి
రోడ్డు, భవనాలు శాఖలో మంత్రిగా ఉన్న హయాంలో నియోజకవర్గంలో ప్రధాన నాయకుల్ని బినామీలుగా పెట్టుకుని జిల్లాలో వేసిన రోడ్లలో బారీగా కమీషన్లు పుచ్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. దర్శి నుంచి బొట్లపాలెం వెళ్లే రోడ్డులో ప్రస్తుతం డబుల్‌ రోడ్డు ఉంది. గతంలో ఉన్న సింగిల్‌ రోడ్డుకు రూ. 70 లక్షలు నిధులు మంజూరు చేసి రోడ్డు వేసినట్లు బిల్లులు చేసుకున్నారు. అయితే ఆ రోడ్డుకు రెండు మూడు సార్లు మరమ్మతులు మాత్రమే చేశారు. తూర్పువీరాయపాలెంలో టీడీపీ కార్యకర్తకు గ్రామంలోని ప్రధాన రోడ్డుపై నివాసాన్ని ఏర్పాటు చేసుకునేందుకు కోర్డు ఆర్డర్లను దిక్కరించి మంత్రి అండదండలతో భారీ భవనాన్ని ఏర్పాటు చేశారు.

ఉల్లగల్లు నుంచి మొహిద్దినాపురంనకు రోడ్డు మంజూరు కాగా దానిని మంజూరైన ప్రాంతంలో కాకుండా తక్కువ మొత్తానికి పూర్తి చేయాలనే దురుద్దేశ్యంతో దారులు తప్పించి వీరాయపాలెం గ్రామంలోకి  వేశారు. నిర్మించాల్సిన చోట బ్రిడ్జి నిర్మాణం చేయకుండా వైఎస్సార్‌ సీపీ మద్దతు దారుల పట్టా భూముల్లో నుంచి బ్రిడ్జి నిర్మాణాన్ని చేపట్టారు. దీంతో ఆ రైతులు కోర్డును ఆశ్రయించారు. అయినప్పటికి వారికి మాత్రం కోట్లాది రూపాయలు బిల్లులు మంజూరు చేశారు. ఈ తతంగాన్ని మంత్రి శిద్దా రాఘవరావు ఒత్తిళ్ల మేరకే చేశారని ఆ పొలం యజమాని ఆరోపిస్తున్నారు. శిద్దా మంత్రి అయ్యాక గత నాలుగేళ్లుగా వర్షాలు లేక నియోజకవర్గంలో తీవ్ర కరువు ఏర్పడింది. రైతులు కూలీలుగా మారిపోయినా.. దర్శి  మండలాన్ని కరువు మండలంగా ప్రకటించకపోవడం అమాత్యుడి అసమర్ధతేనని రైతులు మండిపడుతున్నారు.

తాగునీటికి దిక్కులేదు
గ్రామాల్లో ఐదేళ్లుగా తాగునీరు లేక గొంతెండిపోయింది. ఇంటింటికి తాగునీరు అందిస్తామని చెప్పిన మంత్రి తమ స్వార్థం కోసం ఎన్‌ఏపీ ప్రాజెక్టును శిథిలావస్థకు చేర్చారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినట్లు బిల్లులు చేసుకుని అడ్డగోలుగా దోచుకున్నారే గాని  తాగునీరు అందించిన పాపాన పోలేదని స్థానికులు మండిపడుతున్నారు.

భూ మాయలో శిద్దహస్తులే
తన బినామీల చేత అసైన్డు భూములను ఆక్రమింపజేసి వాటిని ప్లాట్లుగా మార్చి అధికారాన్ని అడ్డుపెట్టి పేదల ముసుగులో దనవంతులకు ఆ ప్లాట్లను అమ్ముకుని వారికి ప్రభుత్వ పట్టాలు ఉచితంగా ఇప్పించినట్లు ప్రచారం చేసుకున్న ఘనత ఒక్క మంత్రి శిద్దా రాఘవరావుకే దక్కిందని చెప్పవచ్చు. ఈ విధంగా కురిచేడు రోడ్డు, అద్దంకి రోడ్లలో మంత్రి అండదండలతో వందల సంఖ్యలో ప్లాట్లు వేసి ప్రభుత్వ భూములను అమ్ముకుని అడ్డగోలుగా దోచుకున్నారు. ఇంత దోపిడీకి అలవాటైన తెలుగుతమ్ముళ్లు మంత్రిని వదిలి పెట్టలేక పోతున్నారని నియోజకవర్గంలో చర్చనియాంశమైంది.

కందులు, మినుములు కొనుగోలులో రూ. 60 కోట్ల దోపిడీ
జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన కందుల్లో రూ. 60 కోట్లకు పైగా దోపిడీ జరిగినట్లు స్పష్టమవుతుంది. 2017–18 సంవత్సరంలో జిల్లాలో మార్క్‌ఫెడ్‌ ద్వారా 34576.600 మెట్రిక్‌ టన్నులు, నాఫెడ్‌ ద్వారా 17684.600 మెట్రిక్‌ టన్నులు కందులు కొనుగోలు చేశారు. ప్రభుత్వ మద్దతు ధర  క్వింటాకు రూ. 5450 లెక్కన రూ. 284,82,35,400 రైతులకు చెల్లించింది. అయితే ఆ సొమ్ము బ్యాంకు ఖాతాలకు చేరిందే గాని రైతులకు మాత్రం చెందలేదు. రైతుల ఖాతాలను ఉపయోగించుకుని ఇతర రాష్ట్రాల నుంచి కందులు కొనుగోలు చేసి ఆ కందులను రైతులు పండించినట్లు కాగితాల్లో సృష్టించి వాటిని మార్క్‌ఫెడ్‌కు తరలించి రైతులకు చెందాల్సిన సబ్సిడీని అడ్డదారిలో అడ్డగోలుగా దోచుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement