Shilparamam construction
-
వినోదం @ శిల్పారామాలు
సాక్షి, అమరావతి: దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలోని శిల్పారామాలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పట్టణాల్లో పల్లె వాతావరణాన్ని అందించడంతోపాటు విలాసవంతమైన సౌకర్యాలను కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. చిన్నారులకు సాహస, వినోద కార్యకలాపాలకు ప్రాధాన్యమిస్తోంది. అమ్యూజ్మెంట్ పార్క్, స్నో వరల్డ్, స్విమ్మింగ్ పూల్, వెల్నెస్ సెంటర్ (జిమ్, స్పా), రెసిడెన్షియల్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ హాల్స్, ఫుడ్ కోర్టులను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి, కడప శిల్పారామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం టెండర్లు సైతం ఆహ్వానించింది. కళాకారులకు ప్రోత్సాహం కళాకారులు, చేతివృత్తుల వారికి నేరుగా తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే సౌలభ్యాన్ని శిల్పారామాల్లో కల్పిస్తున్నారు. హస్తకళల ప్రదర్శన, చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్లు, క్రాఫ్ట్ బజార్స్, ఎక్స్పో, మేళాలను ఉచితంగా ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేలా తోడ్పాటు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, చిత్తూరులో ప్రభుత్వం అర్బన్ హట్స్ నిర్మాణం చేపట్టనుంది. విశాఖపట్నం, కాకినాడ, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి, గుంటూరు శిల్పారామాల్లో హస్తకళల మ్యూజియాలను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. పులివెందులలో రూ.12.26 కోట్లతో శిల్పారామంలో వసతులను మెరుగుపర్చనున్నారు. అక్కడ సాహస కార్యకలాపాలు, విజయనగరం శిల్పారామంలో ఘంటశాల అకాడమీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. సకల సౌకర్యాల నిలయంగా.. రాష్ట్రంలో శిల్పారామాల వ్యవస్థ పర్యాటక రంగంలో కీలకంగా మారనుంది. అందుకే.. ప్రపంచస్థాయి వినోద, విజ్ఞాన సౌకర్యాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నాం. తద్వారా స్థానిక యువతకు కూడా ఉపాధి లభిస్తుంది. మరోవైపు పేద కళాకారులు, చేతి వృత్తులను ప్రోత్సహించేలా ఉచితంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం. – డి.శ్యామ్ సుందరరెడ్డి, సీఈవో, శిల్పారామం -
త్వరలో మరిన్ని శిల్పారామాలు
హైదరాబాద్: తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను సంరక్షించడంతో పాటు చేతి వృత్తుల కళాకారులకు ఉపాధి కల్పించడమే శిల్పారామం ముఖ్య ఉద్దేశమని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, టూరిజం, సాంస్కృతిక, పురాతత్వశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఉప్పల్‌లో ఏర్పాటుచేసిన మినీ శిల్పారామం ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి, పశుసంవర్ధక శాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. శిల్పారామాన్ని ఆదరించాలని ఆయన ప్రజలను కోరారు. తెలంగాణలోని అన్ని జిల్లాలు సాంస్కృతిక సాంప్రదాయాలకు నెలవని, దానిని దృష్టిలో పెట్టుకొని ప్రతి జిల్లాకు ఒక శిల్పారామం నిర్మించేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉప్పల్‌లో ఏర్పాటుచేసిన శిల్పారామం ఉప్పల్ పరిసర ప్రాంతాలైన కాప్రా, ఎల్బీనగర్, ఘట్కేసర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాలకు ఉల్లాసాన్ని ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు మంత్రి శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ.. కళలను, కళాకారులను, చేతి వృత్తుల మీద ఆధారపడిన వారికి శిల్పారామం తోడుగా ఉంటుందన్నారు. స్వయం ఉపాధితో పాటు ఆహ్లాదాన్ని కూడా పంచుతుందన్నారు. మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాల ద్వారా ఇక్కడి భగాయత్ రైతులు 12 సంవత్సరాలు అనేక ఇబ్బందులు పడ్డారని, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులంతా ఆనందంతో ఉన్నారని, ఉప్పల్ రూపురేఖలు మార్చారని గుర్తు చేశారు. ఎంపీ రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతుల త్యాగంతోనే మెట్రో రైల్ స్టేషన్ నిలబడిందన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో భాగంగా రైతులకు ఎకరానికి వెయ్యి గజాలు, సీలింగ్ భూముల రైతులకు 600 గజాల చొప్పున కేటాయించిందని, సీలింగ్ భూములకు కూడా వెయ్యి గజాలు కేటాయించాలని, మెట్రోలో భూములు కోల్పోయిన వారికి ఇంటికి ఒక ఉద్యోగం ఇవ్వాలని మంత్రులను కోరారు. దానికి సానుకూలంగా స్పందించిన మంత్రులు ప్రత్యేక సమావేశం ఏర్పాటుచేసి రైతుల సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అయితే భగాయత్ భూముల్లో కొందరికి వీధి పోట్ల ప్లాట్లు లాటరీలో కేటాయించారని వాటిని మార్చాలని కొందరు రైతులు ప్లకార్డులు ప్రదర్శించారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్పందించి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, కార్పొరేటర్ మేకల అనలా హన్మంత్‌రెడ్డి, కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, శిల్పారామం ప్రత్యేక అధికారి కిషన్‌రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రులకు స్వాగతం పలుకుతూ ఏర్పాటుచేసిన సాంస్కృతిక కళా ప్రదర్శనలు డప్పులు, డోలు వాయిద్యాలు, నృత్యాలు, ఎంతగానో ఆకట్టుకున్నాయి. -
ఆంధ్రా శిల్పారామం ఏక్కడ?
శిల్పారామం నిర్మాణంలో అలసత్వం వనరులు సమకూరినా పనులు ప్రారంభించని ైవె నం పర్యాటక శాఖాధికారుల పని తీరుపై సర్వత్రా విమర్శలు ‘అమరావతిని ప్రపంచంలోకెల్లా సుందర రాజధానిగా తీర్చిదిద్దుతాం’ ఇదీ మైక్ పట్టినప్పుడలా ప్రజాప్రతినిధులు పదే పదే వల్లె వేసే పలుకులు. అయితే వీరు చెప్పేదానికి, చేసే దానికి పొంతన ఉండడం లేదు. దీనికి శిల్పారామం ఏర్పాటే నిదర్శనం. జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు భూమి, నిధులు సమకూరాయి. అనుమతులు మంజూరయ్యాయి. అధికారుల్లో మాత్రం చలనం రాలేదు. ప్రజాప్రతినిధులకు పర్యవేక్షించాలన్న ఆలోచన కలగలేదు..శిల్పారామం నిర్మాణానికి అడుగు ముందుకు పడలేదు. గుంటూరు వెస్ట్ : రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లోని శిల్పారామానికి దీటుగా రాజధాని ప్రాంతంలో శిల్పారామం నిర్మించాలని ప్రభుత్వం భావించింది. అనుకున్నదే తడవుగా 13వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించతలపెట్టిన శిల్పారామం కోసం స్థలాన్ని సేకరించాలని కలెక్టర్‌ను ప్రభుత్వం ఆదేశించింది. కలెక్టర్ కాంతిలాల్ దండే గుంటూరు రూరల్ మండలం అడవితక్కెళ్లపాడులోని సర్వే నంబర్ 237లో 3.60 ఎకరాల ప్రభుత్వ భూమిని పర్యాటక శాఖకు అప్పగించారు. ఇదంతా కొన్ని నెలల క్రితమే పూర్తయింది. ప్రభుత్వం కోటి రూపాయలు మంజూరు చేసింది. కానీ పనులు మాత్రం ప్రారంభం కాలేదు. ఈ నెల 23న అడవితక్కెళ్లపాడులో జరిగే క్రిస్టియన్ భవన్ శంకుస్థాపనకు సీఎం చంద్రబాబు విచ్చేస్తున్నారు. ఆయనైనా దృష్టి సారించిశిల్పారామం నిర్మాణానికి చొరవ చూపాలని ప్రజలు కోరుతున్నారు. కళాత్మక విలువలు ఉట్టిపడేలా.. 1992లో శిల్పారామాల ఏర్పాటు ప్రారంభమైంది. సాంస్కృతిక వారసత్వం, భారత కళల సంరక్షణ, చేతివృత్తిల వారిని చైతన్య పరచటం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ శిల్పారామాలను ఏర్పాటు చేస్తుంది. ఇందులో ఎన్నో కొయ్యబొమ్మలు, ఆభరణాలు, వస్త్రాలు, దేశంలోని వివిధ ప్రాంతాల కళలు, కళాత్మక విలువలను ఉట్టిపడేలా రూపొందిస్తుంటారు. హాలిడే స్పాట్స్‌గా వీటిని తీర్చిదిద్దడంతో పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇంత ప్రాధాన్యమున్న శిల్పారామం ఏర్పాటుపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రత్యేక అధికారిని నియమించాలి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేయనున్న శిల్పారామాలకు తక్షణం ప్రత్యేక అధికారిని నియమించాలి. గతంలో శిల్పారామాల కంటే అత్యంత అద్భుతంగా, తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలాగా వాటిని తీర్చిదిద్దాలి. రాజధాని ప్రాంతమైన గుంటూరులో శిల్పారామం నిర్మాణాన్ని తక్షణమే చేపట్టాలి. జాస్తి వీరాంజనేయులు, జాతీయ కార్యదర్శి, అఖిల భారత పంచాయతీ పరిషత్