సాక్షి, అమరావతి: దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్రంలోని శిల్పారామాలను తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. పట్టణాల్లో పల్లె వాతావరణాన్ని అందించడంతోపాటు విలాసవంతమైన సౌకర్యాలను కల్పించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. చిన్నారులకు సాహస, వినోద కార్యకలాపాలకు ప్రాధాన్యమిస్తోంది.
అమ్యూజ్మెంట్ పార్క్, స్నో వరల్డ్, స్విమ్మింగ్ పూల్, వెల్‌నెస్ సెంటర్ (జిమ్, స్పా), రెసిడెన్షియల్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ హాల్స్, ఫుడ్ కోర్టులను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిని విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి, కడప శిల్పారామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం టెండర్లు సైతం ఆహ్వానించింది.
కళాకారులకు ప్రోత్సాహం
కళాకారులు, చేతివృత్తుల వారికి నేరుగా తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునే సౌలభ్యాన్ని శిల్పారామాల్లో కల్పిస్తున్నారు. హస్తకళల ప్రదర్శన, చేనేత వస్త్రాల ఎగ్జిబిషన్లు, క్రాఫ్ట్ బజార్స్, ఎక్స్‌పో, మేళాలను ఉచితంగా ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందేలా తోడ్పాటు అందిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే శ్రీకాకుళం, విజయనగరం, కర్నూలు, చిత్తూరులో ప్రభుత్వం అర్బన్ హట్స్ నిర్మాణం చేపట్టనుంది.
విశాఖపట్నం, కాకినాడ, కడప, పులివెందుల, అనంతపురం, పుట్టపర్తి, గుంటూరు శిల్పారామాల్లో హస్తకళల మ్యూజియాలను అందుబాటులోకి తేనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. పులివెందులలో రూ.12.26 కోట్లతో శిల్పారామంలో వసతులను మెరుగుపర్చనున్నారు. అక్కడ సాహస కార్యకలాపాలు, విజయనగరం శిల్పారామంలో ఘంటశాల అకాడమీ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
సకల సౌకర్యాల నిలయంగా..
రాష్ట్రంలో శిల్పారామాల వ్యవస్థ పర్యాటక రంగంలో కీలకంగా మారనుంది. అందుకే.. ప్రపంచస్థాయి వినోద, విజ్ఞాన సౌకర్యాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేస్తున్నాం. తద్వారా స్థానిక యువతకు కూడా ఉపాధి లభిస్తుంది. మరోవైపు పేద కళాకారులు, చేతి వృత్తులను ప్రోత్సహించేలా ఉచితంగా మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తున్నాం.
– డి.శ్యామ్ సుందరరెడ్డి, సీఈవో, శిల్పారామం
Comments
Please login to add a commentAdd a comment