ఆతిథ్యానికి అందలం | CM YS Jagan Govt developing tourism sector rapidly | Sakshi
Sakshi News home page

ఆతిథ్యానికి అందలం

Published Sat, Jul 22 2023 6:17 AM | Last Updated on Sat, Jul 22 2023 9:33 AM

CM YS Jagan Govt developing tourism sector rapidly - Sakshi

సాక్షి, అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ నేతృత్వంలో సంక్షేమం, అభివృద్ధిలో దూసుకెళ్తు­న్న రాష్ట్రం.. పర్యాటక రంగం అభివృద్ధిలోనూ వేగం­గా ముందుకెళ్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ­పొం­­దించిన ప్రణాళికతో రాష్ట్రంలో పర్యాటక రంగంలో అంతర్జాతీయ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. లగ్జరీ విల్లాలు, 5 స్టార్,  7 స్టార్‌ హోటళ్ల ఏర్పాటుతో పర్యాటకులను ఆకర్షించడంతోపాటు స్థానికులకు ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. సులభతర వాణిజ్యంలో భాగంగా పర్యాటక ప్రాజెక్టులకు ప్రభుత్వం వేగంగా అనుమతులు మంజూరు చేస్తోంది.

విశాఖ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌ (జీఐఎస్‌)లో ఒప్పందం కుదిరిన ప్రాజెక్టులకు మరింత ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే ఐదు ప్రదేశాల్లో రూ.1,350 కోట్ల అంచనాతో 7 స్టార్‌ సౌకర్యాలతో లగ్జరీ రిసార్ట్స్‌ నిర్మాణానికి ఒబెరాయ్‌ ముందుకొచ్చింది. ఇందులో విశాఖ (అన్నవరం), తిరుపతి (పేరూరు), గండికోటలో నిర్మాణాలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.

త్వరలోనే పిచ్చుకలంక, హార్సిలీహిల్స్‌లో కూడా ఒబెరాయ్‌ నిర్మాణాలకు ఒప్పందాలు జరగనున్నాయి. రాష్ట్రంలో ఒక్క ఒబెరాయ్‌ సంస్థల ద్వారానే సుమారు 10,900 మందికి ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. తాజాగా విశాఖలో మేఫెయిర్, తిరుపతిలో ఎంఆర్‌కేఆర్‌ (హయత్‌) సంస్థల ప్రాజెక్టులకు కేబినెట్‌ ఆమోదం తెలపింది. వీటికి ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ వెంటనే స్థలాలను సైతం కేటాయించింది. 

తిరుపతిలో 5 స్టార్‌ హోటల్‌ 
ప్రపంచ ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతికి ఏటా 30 నుంచి 40 మిలియన్ల యాత్రికులు వస్తుంటారు. దీనికి తోడు చెన్నై – తిరుపతి – నెల్లూరు పారిశ్రామిక హబ్‌ కూడా ఈ ప్రాంతంలో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ క్రమంలో తిరుపతిలోని పేరూరులో 5 స్టార్‌ లగ్జరీ హోటల్‌ నిర్మాణానికి హైదరాబాద్‌కు చెందిన ఎంఆర్‌కేఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ( హయత్‌ గ్రూప్‌) ముందుకొచ్చింది.

రూ.218 కోట్ల పెట్టుబడితో 1550 మందికిపైగా ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ ప్రాజెక్టును రూపొందించింది. దీని ద్వారా వచ్చే 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.230.08 కోట్ల ఆదాయం లభించనుంది. ఇందులో సుమారు 144 గదులు (స్టాండర్డ్, సుపీరియర్, డీలక్స్, సూట్స్‌), అత్యాధునిక రెస్టారెంట్, కాన్ఫరెన్స్, బ్యాంకెట్‌ హాల్, వివాహాలు, ఎగ్జిబిషన్లకు ప్రత్యేక వేదిక,  హెల్త్‌ హబ్‌ ఇతర ప్రపంచ స్థాయి సౌకర్యాలు ఉంటాయి. 

విశాఖలో రూ.525 కోట్లతో విల్లాల సముదాయం 
విశాఖపట్నానికి సమీపంలోని అన్నవరం వద్ద మేఫెయిర్‌ సంస్థ (భువనేశ్వర్‌) అత్యాధునిక లగ్జరీ రిసార్ట్‌ను అభివృద్ధి చేయనుంది. సుమారు 40 ఎకరాల్లో రూ.525 కోట్లతో 250 రిసార్టులను నిర్మిస్తుంది. దీని ద్వారా 1,750 మందికి ఉపాధి లభిస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 25 ఏళ్లలో రాష్ట్రానికి రూ.852.40 కోట్లు ఆదాయం లభిస్తుంది. ఇందులో భారీ కన్వెన్షన్‌ సెంటర్, రెస్టారెంట్, మినీ గోల్ఫ్‌ కోర్సు, 4,500 మంది కూర్చునేలా బ్యాంకెట్‌ హాల్, మరో 10 చిన్న బ్యాంకెట్‌ హాళ్లు, ఓపెన్‌ స్కై బ్యాంకెట్‌ హాల్, షాపింగ్‌ మాల్స్‌ ఉంటాయి. 

రూ.69.37 కోట్లతో మౌలిక సదుపాయాల కల్పన 
పర్యాటక రంగంలో మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎక్కువ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. తొలి దశలో భాగంగా విశాఖపట్నంలోని అన్నవరం, పేరూరు, గండికోట గ్రామాలను పర్యాటకంగా అభివృద్ధి చేయనుంది. సుమారు రూ.69.37 కోట్లతో గ్రామాల్లో పెద్ద రహదారులను కలుపుతూ రోడ్ల నిర్మాణం, నీటి సౌకర్యం మెరుగుదల, ప్రత్యేక విద్యుత్‌ లైన్లు, అత్యాధునిక మురుగు పారుదల వ్యవస్థను అందుబాటులోకి తేనుంది. వీటికి త్వరలో టెండర్లు పిలిచి పనులను ప్రారంభించనుంది.  

సీఎం జగన్‌ బ్రాండింగ్‌తోనే పెట్టుబడులు 
సీఎం జగన్‌ బ్రాండింగ్‌తో రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయి హోటల్‌ రంగ సంస్థలు వస్తున్నాయి. ఒబెరాయ్‌తో పాటు మేఫెయిర్, హయత్‌ గ్రూప్‌ల హోటళ్లు, లగ్జరీ విల్లాల నిర్మాణానికి వేగంగా అనుమతులు ఇచ్చాం. పర్యాటకంతో పాటు స్థానిక యువతకు ఉపాధి కల్పనే ఈ ప్రాజెక్టుల లక్ష్యం.

జీఐఎస్‌లో కుదిరిన ప్రతి ఒప్పందాన్ని క్షేత్ర స్థాయిలోకి తీసుకొస్తాం. తిరుపతి, విశాఖ, గండికోటను ప్రపంచ పటంలో మరింత ఉన్నతంగా నిలబెడతాం. పర్యాటకానికి అవకాశాలుండే ప్రాంతాలను గుర్తించి ప్రభుత్వమే అభివృద్ధి చేస్తుంది. తద్వారా మరింతగా పెట్టుబడులను ఆకర్షిస్తాం. 
– ఆర్కే రోజా, పర్యాటక శాఖ మంత్రి   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement