ఆమ్ఆద్మీ బీమా యోజనలో అక్రమాలు
సామాజిక తనిఖీలో వెలుగులోకి
బతికుండగానే చంపేసి రూ. 30 వేలు స్వాహా
పెద్దమండ్యం: ఆమ్ ఆద్మీ బీమా యోజన పథకంలో జరిగిన అక్రమాలు సామాజిక తనిఖీలో వెలుగులోకి వస్తున్నాయి. బతికుండంగానే ఓ యువకుడిని చనిపోయినట్లు చూపించి రూ.30 వేలు స్వాహా చేశారు. నాలుగు సంవత్సరాలుగా గుట్టుచప్పుడు కాకుండా ఉండిపోయిన అక్రమాలు సామాజిక తనిఖీతో వెలుగులోకి వచ్చాయి. బాధితుల కథనం మేరకు.. దిగువపల్లె పంచాయతీ వడ్డివంకతాండాకు చెందిన మూడే శివనాయక్, మూడే సునీత వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నారు. సునీత స్వయం సహాయక సంఘంలో సభ్యురాలుగా ఉంది. ఆమ్ ఆద్మీ భీమా యోజనా పథకంలో పాలసీ చేసింది. వీరికి ప్రభుత్వం జారీచేసిన డబ్ల్యూఏపి 100102300033 నెంబరు గల రేషన్‌కార్డు ఉంది.
అయితే మే 2011 లో సునీత భర్త శివానాయక్ సాధారణ మరణం చెందినట్లు చెప్పి తక్షణ సహాయంగా ఆమ్ఆద్మీ ద్వారా వచ్చిన రూ.5 వేలు సొమ్మును తీసుకున్నారు. మరో విడతగా రూ.25 వేలు అదే గ్రామానికి శంకరమ్మ బ్యాంక్ ఖాతాకు (నెంబరు 86454160) జవ చేశారు. శివానాయక్ మృతి చెందినట్లు చూపించి రూ.30 వేలు స్వాహా చేసినట్లు తేలింది. సామాజిక తనిఖీలో భాగంగా ఆమ్ఆద్మీ ఇన్సూరెన్స్ పొందిన వారి వివరాలను తనిఖీ బృందాల సభ్యులు సేకరించారు. దీంతో బతికే ఉన్న శివానాయక్ పేరు మీద ఆమ్ ఆద్మీ ఇన్సూరెన్స్ సొమ్ము రూ.30 వేలను స్వాహా చేశారని తేలిపోయింది. ఈ మేరకు బాధితుడు శివనాయక్ స్థానిక పోలీసులు, ఎంపీడీవో, ఐకేపీ ఇన్చార్జి ఏపీఎంకు ఫిర్యాదు చేశారు.
బతికుండంగానే చంపేశారు..
స్వయం సహాయక సంఘంలో నా భార్య సునీత సభ్యురాలుగా ఉంది. నేను బతికి ఉండగానే కాల్ సెంటర్‌కు చనిపోయారని ఎవరు చెప్పారు. ఆమ్ ఆద్మీ ద్వారా వచ్చిన సొమ్ము స్వాహా చేసిన వారెవరో తేల్చాలి.
-మూడే శివనాయక్, వడ్డివంకతాండా