కలుషిత రాజకీయాలు ప్రమాదకరం
హైదరాబాద్: నేటితరం రాజకీయ నాయకుల ప్రసంగాలు, విమర్శలు, వ్యవహార శైలితో రాజకీయాలు కలుషితమైపోయాయని, ఇది దేశానికి ప్రమాదకరమని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే శివరామిరెడ్డి గొప్ప నైతిక విలువలు ఉన్న వ్యక్తి అని, ఒకరికి గౌరవం ఇచ్చి మాట్లాడటంలో ఆయనకు ఆయనే సాటి అని కొని యాడారు. కొండాపూర్‌లోని చండ్ర రాజేశ్వర్‌రావు ఫౌండేషన్‌లో స్వాతంత్య్ర సమరయోధుడు, కమ్యూనిస్టు సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే నర్రెడ్డి శివరామిరెడ్డి సంతాప సభను ఆదివారం నిర్వహిం చారు. ఈ సందర్భంగా నారాయణతో పాటు సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి కార్యదర్శి కె.రామకృష్ణ, తెలంగాణ రాష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, సీఆర్ ఫౌండేషన్ కార్యదర్శి చెన్న కేశవరావు, సభ్యురాలు డాక్టర్ రజనీ, సీపీఐ శేరిలింగంపల్లి కార్యదర్శి కె.శ్రీశైలంగౌడ్‌తో పాటు పలువురు శివరామిరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.
అనంతరం నారాయణ మాట్లాడుతూ చట్ట సభకు ఎన్నికైన తొలితరం ప్రజా ప్రతినిధుల్లో ఒకరైన శివరామిరెడ్డి నిస్వార్థ సేవలం దించి ప్రజల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. తాను మరణించే వరకు సీఆర్ ఫౌండేషన్‌కు, వృద్ధాశ్రమంలో ఉంటూ సేవలందించారన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కె.రామకృష్ణ మాట్లాడుతూ శివరామిరెడ్డి రైతాంగ సమస్యలపై పోరాడారని గుర్తు చేశారు.
నేటితరం నాయకులందరికీ ఆదర్శ ప్రాయులని, ఉన్నత భావాలున్న గొప్ప వ్యక్తిని కోల్పోవడం తీరని లోటని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగించి పార్టీ ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసుకోవడమే ఆయనకిచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. తెలంగాణ రా>ష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ శివరామిరెడ్డి భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన ఆశయాల సాధనకు ఉద్య మాలు నిర్మించాల్సి ఉందన్నారు. సంతాప సభలో శివరామిరెడ్డి కుటుంబ సభ్యులు, సీఆర్ ఫౌండేషన్, వృద్ధాశ్రమం సహచరులు పాల్గొన్నారు.