మాదాపూర్: మాయమాటలు చెప్పి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు. ఏసీపీ రమణకుమార్ తెలిపిన వివరాలివీ.. మాదాపూర్‌లోని అమర్ కో-ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు శివరామిరెడ్డి ఇంటికి ఈనెల 11వ తేదీన గుర్తు తెలియని ఇద్దరు మహిళలు వచ్చారు. ఇంట్లో ఉన్న శివరామిరెడ్డి కుటుంబసభ్యులను మాటల్లో పెట్టారు. సమీపంలోని అమ్మవారి ఆలయంలో పూజలు చేస్తామని, బోనాల పండుగ కోసం బియ్యం, బెల్లం కానుకగా ఇవ్వాలని కోరారు.
అలా మాయమాటలు చెప్పి ఇంట్లో ఉన్న రూ.76వేల నగదును పూజలో పెట్టించారు. తాము వెళ్లిపోయిన తరువాత తీసి చూడాలని చెప్పి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత చూడగా పూజ సామగ్రిలో నగదు కనిపించలేదు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన పోలీసులకు.. ఓవ్యక్తి అందజేసిన సీసీ కెమెరా ఫుటేజి ఉపయోగపడింది. నిజామాబాద్ జిల్లాలోని తొర్లికొండ గ్రామానికి చెందిన రాసూరి కవిత(38), రాసూరి దేశమ్మ(25)లను అదుపులోకి తీసుకున్నారు. మాదాపూర్‌లో రెండు, ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడలలో ఒక్కొక్కటి చొప్పున మొత్తం ఐదు నేరాలు చేసినట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. వీరి వద్ద నుంచి రెండు లక్షల నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించారు.
పూజల పేరుతో మహిళల మోసం
Published Thu, Jul 14 2016 6:15 PM | Last Updated on Mon, Sep 4 2017 4:51 AM
Advertisement