పెద్ద బజార్ పోలీస్‌స్టేషన్‌లో అరెస్ట్ అయిన మహిళలు
బరంపురం : రాష్ట్ర రాజధాని భువనేశ్వర్‌లోని ఓ బంగారం దుకాణంలో జరిగిన ఆభరణాల చోరీ కేసులో సంబంధిత నిందితులైన నలుగురు మహిళలతో పాటు బంగారం కొన్న వ్యక్తిని బరంపురంలో పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఈ సంఘటన నగరంలో సంచలనం రేపింది. ఈ సందర్భంగా పోలీసు అధికారులు అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 18వ తేదీన అక్షయ తృతీయ సందర్భంగా రాజధాని భువనేశ్వర్‌లోని లింగరాజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల సమంతపూర్ దగ్గర ఉన్న దేవి దుర్గా జ్యుయలర్స్‌లో ముగ్గురు మహిళలు బంగారం కొనేందుకు వెళ్లగా మరో మహిళ బంగారం దుకాణం బయట పర్యవేక్షించింది. లోన ముగ్గురు మహిళలు బంగారం ఆభరణాన్ని లూటీ చేసి తప్పించుకుని వచ్చారు. జరిగిన సంఘటనపై బంగారం దుకాణం యాజమన్యం లింగరాజ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
దొంగలను పట్టించిన సీసీటీవీ
దీంతో కేసు నమోదు చేసి పోలీస్ కమిషనరేట్ సవాల్‌గా తీసుకుని ఈ కేసును ఛేదించేందుకు ప్రత్యేక పోలీసు బృందాన్ని నియమించింది. దర్యాప్తులో భాగంగా లూటీ జరిగిన దుకాణంలో సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించి ఫొటోలు సేకరించారు. ఇటీవల బంగారం దుకాణాల్లో జరిగిన లూటీకి సంబంధించి ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నిజాలు వెలుగులోకి వచ్చాయి. లూటీ చేసిన మహిళలను బరంపురం నగరంలోని హరడాఖండి బౌరి వీధికి చెందిన వారుగా గుర్తించారు.
ఈ నేపథ్యంలో శనివారం భువనేశ్వర్ నుంచి ప్రత్యేక పోలీసు బృందం వచ్చి పెద్ద బజార్ పోలీసుల సహాయంతో నిందితులైన నలుగురు మహిళలను అరెస్ట్ చేసి పెద్ద బజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా లూటీ చేసిన బంగారం అభరణం కొన్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలియజేశారు. అరెస్ట్ అయిన మహిళలను హరడాఖండిలోని బౌరి వీధికి చెందిన జుమ్మురి దాస్, జుమ్మిరి బెహరా, సుశీల దాస్, సంజు బెహరాలుగా గుర్తించామని ఐఐసీ అధికారి సురేష్ త్రిపాఠి చెప్పారు. ఈ మహిళలు గతంలో కూడా రాష్ట్రంలోని వివిధ బంగారం దుకాణాల్లో నగలు లూటీ చేసిన కేసుల్లో పలుమార్లు అరెస్ట్ అయి జైల్‌కు వెళ్లినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment