shivaratri special
-
రామాలయంలో శివారాధన
వైష్ణవ దేవాలయంలో శివారాధన అత్యంత అరుదు. అలాంటి అద్భుతం ఏటా ‘రామతీర్ధం’ ఆలయంలో ఆవిష్కృతమవుతుంది! ఉత్తరాంధ్రలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం గ్రామంలో కొలువైన రామాలయంలో ఏటా శివరాత్రి జాతర అంగరంగ వైభవంగా జరగడం విశేషం. శివరాత్రికి రెండు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచే కాకుండా ఒడిశా రాష్ట్రం నుంచి వేలాదిగా భక్తులు ఈ క్షేత్రానికి తరలివస్తుంటారు. రామతీర్థం ఉత్తర రాజగోపురానికి ఎదురుగా నిలువుటద్దంలా కనిపించే బోడికొండ దశాబ్దాల అద్భుతంగా అలరారుతోంది. మరో వైపు బౌద్ధులు నడయాడిన గురుభక్తుల కొండ.. ఎదురుగా పచ్చని నీటితో కనిపించే రామకోనేరు.. ఇలా ఆ ప్రాంతమంతా అత్యంత సుందర నిలయమై భక్తులకు, పర్యాటకులకు కనువిందు చేస్తుంటాయి. రామతీర్థ మహత్మ్యం ద్వాపర యుగంలో పాండవులు అరణ్యవాసానికి వెళుతూ శ్రీకృష్ణపరమాత్మను కూడా తోడు రమ్మని అడిగారు. అందుకు కృష్ణ పరమాత్మ వారితో.. తాను రామావతార సమయంలో దండకారణ్య ప్రాంతంలో సీతాలక్ష్మణ సమేతుడనై సంచరించానని, కనుక ఆనాటి రామావతారాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే వనవాస కాలంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవని పాండవులకు చెప్పారు. చెప్పడమేగాక సీతారామలక్ష్మణ స్వామి విగ్రహాలను సృష్టించి పాండవులకు అందించారు. శ్రీకృష్ణుడు ఉపదేశించిన విధంగా పాండవులు రామతీర్ధం ప్రాంతంలో రాముడి దేవాలయాన్ని నిర్మించి స్వామివారిని సేవించి వనవాసాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. తర్వాత పాండవులు అజ్ఞాత వాసానికి వెళ్తూ వెళ్తూ నిర్మించిన దేవాలయాన్ని పరమ నిష్టాగరిష్టుడైన వేదగర్భుడు అనే వైష్ణవుడికి అప్పగించి వెళ్లిపోయారు. ఆ వేదగర్భుడు, వారి పుత్ర పౌత్రాదులు స్వామివారిని సేవిస్తూ ఉండేవారు. కొంతకాలం తరువాత క్రీ.పూ 6వ శతాబ్ధంలో బౌద్ధ భిక్షువులు ఆ ప్రాంతాన్నే కేంద్రంగా చేసుకొని వారి మత ప్రచారాన్ని చేసుకుంటూ కాల క్రమేపి రామతీర్థం ప్రాంతాన్ని ఆక్రమించారు. వాళ్ల మత సిద్ధాంతాలకు భయపడిన వేదగర్భుని వంశీయులు సీతారామలక్ష్మణ విగ్రహాలను భూగర్భంలో దాచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్లి పోయారు. నీటి మడుగులో విగ్రహాలు విజయనగరం పూసపాటి వంశీయులు 1650వ సంవత్సరంలో కుంభిళాపురం (నేడు కుమిలి గ్రామం)ను రాజధానిగా చేసుకొని పాలిస్తుండేవారు. ఆ గ్రామానికి చెందిన ఏకుల వంశానికి చెందిన ఓ ముసలావిడ కట్టెల కోసం వెళ్లి అరణ్యంలో చిక్కుకుంది. ఆమె నిస్సహాయ స్థితిని చూసి స్వామివారు ప్రకాశవంతమైన తేజస్సుతో దర్శనమిచ్చి కాపాడారు. మేము ఇక్కడ కొలువై ఉన్నామని మాకు దేవాలయం నిర్మించమని రాజుతో చెప్పమని సాక్షాత్తూ స్వామివారే ఆమెకు చెప్పారట. మరుసటి రోజు తెల్లవారు జామున రాజు కలలో కూడా సాక్షాత్కరించి ముదుసలి చెప్పినట్లు చేయమని ఆజ్ఞాపించారు. ఉదయం ముదుసలి చెప్పినట్లుగా పుణ్యస్థలానికి చేరుకొని వెతికితే నీటిమడుగులో సీతారామ లక్ష్మణుల ప్రతిమలు కనిపించాయి. దేవాలయ నిర్మాణానికి ఆ రాజు 1200 ఎకరాల పంట భూమిని రాసిచ్చి భీష్మ ఏకాదశి రోజున స్వామివారి విగ్రహాలను ప్రతిష్టించారు. అప్పటి నుంచి నేటికీ శ్రీరామ చంద్రమూర్తి భక్తుల నుంచి విశేష పూజలందుకుంటున్నారు. విశిష్టతల సమాహారం రామతీర్థ క్షేత్రానికి ఉత్తర దిక్కున నీలాచలం పేరుతో రెండు కిలోమీటర్ల పొడవు గల ఏకశిలా పర్వతం బోడికొండగా వ్యవహారంలో ఉంది. ఈ పర్వతంపై సీతారాములు, పాండవులు సంచరించినట్లుగా చిహ్నాలున్నాయి. అలాగే పర్వత శిఖరాన కోదండరాముని ఆలయం కూడా ఉంది. ఆలయం పక్కనే ఎప్పటికీ ఎండిపోని పాతాళగంగ అనే పేరు గల నీటికొలను ఉంది. ఈ నీటి మడుగు నుంచి పడమర దిశగా ఇరుకురాయి, దాని మధ్య నుంచి వెళితే భీముని బుర్ర చిహ్నం ఉంటుంది. అక్కడే భీముడు వంట చేయడానికి ఉపయోగించిన గాడిపొయ్యి కూడా ఉంది. దీనికి సమీపంలో ఉన్న గుహలో బుద్ధ విగ్రహం, పలుకురాయి ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒకసారి పిలిస్తే ఆ పిలుపు మూడు సార్లు ప్రతిధ్వనిస్తుంది. అలాగే పాండవుల ఐదు పంచలు, సీతమ్మవారి పురిటి మంచం తదితర చిహ్నాలు నేటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. ఈ కొండ పక్కనే దుర్గాభైరవ కొండ, బౌద్ధుల నివాస గుహలు ఉన్నాయి. చారిత్రక గుర్తులను చూసేందుకు భక్తులు, సందర్శకులు అధిక సంఖ్యలో పర్వతంపైకి వెళుతుంటారు. రామతీర్థం రామాలయంలో వైకుంఠనాథస్వామి, వేణుగోపాలస్వామి, లక్షీ్మదేవి, మాధవ స్వామి, భూభుజంగ వరహాలక్షీ్మ స్వామి, ఆళ్వారుల సన్నిధి, శ్రీరామక్రతువు స్తంభం, సదాశివస్వామి వార్ల ఉపాలయాలు ఉన్నాయి. నిర్విరామంగా ప్రతినిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి శివరాత్రి జాగరణ ఏటా శ్రీ స్వామివారి కల్యాణోత్సవములు, రథయాత్ర, మహాశివరాత్రి, శ్రీరామనవమి ఉత్సవాలు, జ్యేష్టాభిషేకాలు, విఖసన జయంతి, పవిత్రోత్సవాలు, శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తెప్పోత్సవం, గోపురోత్సవం, అధ్యయనోత్సవాలు, వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతుంటాయి. అలాగే ప్రతి ఏటా ముక్కోటి ఏకాదశి పర్వదినాన అశేష జనావళి నడుమ గిరిప్రదక్షణం కూడా జరుగుతుంది. వైష్ణవాలయంలో శివరాత్రి ఉత్సవాలు జరపడమనేది ఇక్కడి ప్రత్యేకత. ఆ ఉత్సవాన్ని తిలకించేందుకు వేలాది మంది భక్తులు ముందురోజే క్షేత్రానికి చేరుకుని కోనేటిలో స్నానమాచరించి నిష్టాగరిష్టులై శివరాత్రి జాగరణ చేసి తరిస్తుంటారు. బోణం గణేష్, సాక్షి ప్రతినిధి, విజయనగరం. ఫొటోలు: డి.సత్యనారాయణ, పక్కి సురేష్ పట్నాయక్ -
ఉపవాసం.. జాగరణం
ఉపవాసం, జాగరణ.. ఈ రెండూ ఆధ్యాత్మికమైన తృప్తినీ, మనశ్శాంతినీ ఇస్తాయి. డబ్ల్యూహెచ్ఓ మార్గదర్శకాల మేరకు ఓ మనిషి శారీరక, మానసిక ఆరోగ్యాలతో పాటు ఆధ్యాత్మికంగా కూడా ఆరోగ్యంగా ఉంటేనే సంపూర్ణారోగ్యంగా ఉన్నట్లు. అందుకే మన సంస్కృతి నిర్దేశించిన ఉపవాసం, జాగరణ వంటి నియమాలను పాటిస్తూనే, ఆరోగ్యంపై వాటి ప్రభావం పడకుండా చూసుకోవడం అవసరం. యువతీ యువకులు తాము ఒకింత కఠిన ఉపవాసం చేయవచ్చు. కానీ రోజూ మందులు తీసుకోవాల్సిన పెద్ద వయసువారు మాత్రం కాస్తంత జాగ్రత్త వహించాలి. మరీ కఠినంగా పాటించనంత వరకు ఉపవాసాలు కొంతవరకు ఉపయోగకరమే. ఆరోగ్యదాయకమే. ఉపవాసం సమయంలో ఒంట్లో ఏం జరుగుతుందంటే... సాధారణంగా మనం తీసుకునే ఆహారానికీ, ఆహారానికీ మధ్య కొంత వ్యవధి ఉంటుంది. రాత్రి భోజనం తర్వాత మళ్లీ ఉదయం తీసుకునే భోజనం వరకు ఉండే వ్యవధి ఎక్కువ కాబట్టే.. మనం ఉదయం తీసుకునే ఆహారాన్ని ‘బ్రేక్ ఫాస్ట్’గా పేర్కొంటారు. అంటే... రాత్రి ఉపవాసాన్ని ‘బ్రేక్’ చేసే ఆహారం అన్నమాట. ఇది రోజూ సాధారణంగా జరిగే ప్రక్రియ. కాబట్టి దీంతో ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కానీ రోజులో సాధారణంగా మనం ఐదు నుంచి ఆరుగంటల వ్యవధిలో భోజనం చేస్తూ ఉంటాం. మన ఒంట్లోని జీవక్రియలకూ, మన పనులకూ అవసరమైన చక్కెరలు అందాలంటే అలా భోజనం చేస్తుంటాం. దాంతో మన దేహం కూడా ఆ ‘సైకిల్’కు అలవాటు పడి ఉంటుంది. మన ఒంట్లోని జీవక్రియలకు అవసరమైన శక్తి చక్కెర నుంచి, ఆ చక్కెరలు మన ఆహారం నుంచి అందుతుంటాయి. మనకు అవసరమైన శక్తి అందకుండానే మళ్లీ యథాతథమైన పనులన్నీ జరగాలంటే.. అందుకు తగినంత శక్తి అందక శరీరం మొరాయిస్తూ ఉంటుంది. దాంతో పాటు ఒంట్లో ఉండాల్సిన చక్కెర మోతాదుల్లో తేడాలు వచ్చినప్పుడు వెంటనే శరీరానికి ఉండాల్సిన సాధారణ రక్తపోటు పడిపోతూ ఉంటుంది. ఒంట్లోని చక్కెరలు బాగా తగ్గిపోయే కండిషన్‌ను ‘హైపోగ్లైసీమియా’ అంటారు. ఫలితంగా సాధారణ రక్తపోటు పడిపోయే అవకాశం ఉంది. అదే జరిగితే మెదడుకు, దాంతోపాటు ఒంట్లోని కీలక అవయవాలకు తగినంత రక్తం అందకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో కొన్ని అనర్థాలు జరిగే అవకాశం ఉంది. అందుకే ఉపవాసం వల్ల ఒంట్లోని సాధారణ పనులకు అవసరమైన శక్తి తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆ సమయంలో మన దేహంలో నిల్వ ఉన్న కొవ్వుల నుంచీ, కొన్ని సందర్భాల్లో కండరాల నుంచి కూడా మన శరీరానికి అవసరమైన శక్తిని తీసుకుంటూ ఉంటుంది. దీనికి అనుగుణంగానే మళ్లీ మనం మన దేహాన్ని రోజువారీ చేసే కఠినమైన శారీరక శ్రమతో కూడిన పనులతో అలసిపోయేలా చేయకూడదు. ఉపవాసం ఉన్న రోజుల్లో అలాంటి పనులు ఏవైనా ఉంటే.. వాటికి తాత్కాలికంగా దూరంగా ఉండటం మేలు చేస్తుంది. ఇక కొందరు నీళ్లు కూడా తీసుకోకుండా కఠిన ఉపవాసం చేస్తుంటారు. మన దేహంలో జరిగే జీవక్రియల్లో మెదడు నుంచి వచ్చే ఆదేశాలన్నీ లవణాల తాలూకు విద్యుదావేశ మూలకాల రూపంలోనే జరుగుతుంటాయి. ఒంట్లో తగినన్ని ఖనిజాలూ, లవణాలూ ఉండి, అవి ద్రవరూపంలోకి మారితేనే అవి ఖనిజలవణాల విద్యుదావేశ మూలకాల రూపంలోకి మారి.. తద్వారా మెదడు నుంచి దేహంలోని రకరకాల అవయవాలకు అవసరమైన ఆదేశాలు అందుతుంటాయి. ఇందుకు తగినన్ని పాళ్లలో ఒంట్లో నీరుండటం ఎంతగానో అవసరం. ఒంట్లో ఉండాల్సిన నీటిపాళ్లు తగ్గితే అది డీహైడ్రేషన్‌కు దారితీసి మెదడు నుంచి ఆయా అవయవాలకు అందాల్సిన ఆదేశాలు అందవు. పైగా ఒక్కోసారి కండరాల్లో ఉండాల్సిన మృదుత్వం తగ్గిపోయి, అవి బిగుసుకుపోతాయి. పై కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని, ఉపవాసం సమయంలో కేవలం మన ఒంట్లోని కొవ్వులు మాత్రమే దహనం అయ్యేంత మేరకే మనం ఉపవాసం ఉండాలి. ఉపవాస సమయంలో నీరు తీసుకోవడం నిషిద్ధ కాదు కాబట్టి మరీ ఎక్కువగా కాకపోయినా, ఒంట్లోని జీవక్రియలకు అవసరమైనంతగానైనా నీరు తీసుకుంటూ ఉండాలి. షుగర్, హైబీపీ ఉన్నవారికి సూచనలు షుగర్, హైబీపీ వంటి సమస్యలు ఉన్నవారు ఉపవాసానికి ముందుగా తాము తీసుకోవాల్సిన ఆహారాన్ని ఎప్పటిలాగే తీసుకుని, అప్పుడే తగినన్ని నీళ్లతో తాము రోజూ వేసుకోవాల్సిన టాబ్లెట్లను తీసుకోవాలి. ఒకవేళ రోజులో ఒక క్రమపద్ధతిలో వేసుకోవాల్సిన మాత్రలేవైనా ఉంటే.. వాటిని తప్పించకూడదు (స్కిప్ చేయకూడదు). నీళ్లతో టాబ్లెట్లు వేసుకోవడం ప్రధానాహారం కాదు కాబట్టి అది పెద్దగా దోషం కాబోదంటూ మనసుకు నచ్చజెప్పుకొని ఆరోగ్యం కోసం విధిగా వేళకు మాత్రలు వాడాలి. జాగరణ కోసం ఈరోజుల్లో రాత్రి చాలా సేపటివరకు మేల్కొని ఉండటం సాధారణమైపోయింది. దాంతో పోలిస్తే.. ఇక జాగరణ పేరిట నిద్రకు దూరంగా ఉండాల్సిన సమయం ఏ ఐదారు గంటలో అదనంగా ఉంటుంది. అయితే కిందటి రాత్రి నిద్రపోలేదు కాబట్టి ఆ మర్నాడు పగలు పడుకోవడాన్ని వీలైనంత వరకు నివారించాలి. ఎందుకంటే ఆ పగటి నిద్ర వల్ల రాత్రికి ఆలస్యంగా నిద్రపట్టడం, అసలే పట్టకపోవడం జరిగి నిద్ర క్రమం తప్పవచ్చు. జాగరణ కోసం ఈ జాగ్రత్త పాటిస్తే మంచిది. డా. సుధీంద్ర ఊటూరిలైఫ్స్టైల్ స్పెషలిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
మహాదేవుడి మహాపర్వదినం
శివ అనే పదానికి శుభం, మంగళకరం, కల్యాణం, భద్రం, విశ్వశ్రేయస్సు, సర్వ సంరక్షణం, మోక్షప్రదాయకం అనే అర్థాలున్నాయి. అందరూ అమంగళ కరమైనవిగా భావించే శ్మశానం, కపాలం, చితాభస్మం, విషసర్పాలు వంటివి శివుడికి ప్రీతిపాత్రమైనవి. ఆయన శ్మశానంలో నివసిస్తాడు. చితాభస్మాన్ని ఒంటికి పూసుకుంటాడు. విషసర్పాలను ఆభరణాలుగా ధరిస్తాడు. అయినప్పటికీ ఆయన మంగళ ప్రదాత, మంగళస్వరూపుడు. సర్వదేవతా వంద్యుడు. ఆదిమధ్యాంత రహితుడు, అనుగ్రహప్రదాత, బోళాశంకరుడు, పరమేశ్వరుడు. అందుకే పరమేశ్వర శబ్దం దేవ, దానవ, మానవ జాతులందరికీ పూజనీయమైనది. తాను విషాన్ని మింగి, లోకాలకు అమృతాన్ని పంచిన మహా ఉదారుడాయన. అందుకే ఆయనకు మహాదేవుడు అని పేరు. అంటే దేవతలందరిలోకీ ఉన్నతమైనవాడన్నమాట. తాను శ్మశానవాసిగా భిక్షాటన చేస్తూ, తన భక్తులకు సకలైశ్వర్యాలను ప్రసాదించే భక్తసులభుడాయన. ఆర్తితో పిలిస్తే పలికే దైవం ఆయన. ఆయనకు అత్యంత ప్రీతికరమైన రేయి మహాశివరాత్రి. శివరాత్రి అంటే మంగళకరమయిన రాత్రి అని అర్థం. ప్రతినెలా శివరాత్రి వస్తుంది. అయితే అది మాస శివరాత్రి. మాఘకృష్ణ చతుర్దశినాడు వచ్చే శివరాత్రి మహాశివరాత్రి. అంటే లింగోద్భవ సమయమన్నమాట. సకల చరాచరజీవులలో, ప్రాణులలో శివుడు అంతర్యామిగా జ్యోత్లింగ స్వరూపునిగా కొలువై వున్నాడు. ఈ జగత్తులో ప్రతిజీవి తనను పూజించేందుకు పన్నెండు ప్రదేశాలలో జ్యోతిర్లింగరూపాలలో వెలిశాడాయన. లోకకళ్యాణంకోసం పరమ శివుడు మహాశివరాత్రి నాడు శివలింగం నుంచి బయటకు వస్తాడని, సమస్త సృష్టి ప్రారంభం శివరాత్రినాడే జరిగిందని పురాణాలుచెబుతున్నాయి. జ్యోతిష శాస్త్రాన్ననుసరించి మాఘ బహుళ చతుర్దశి తిథిన చంద్రుడు సూర్యునికి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి, శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశినాడు శివపూజ చేసిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేకప్రియుడు. కాబట్టి దుఃఖనివృత్తికై క్షీరంతోనూ, బుద్ధివికాసానికి పంచదారతోనూ, శత్రునాశనానికి తైలంతోనూ, భోగప్రాప్తికి సుగంధ ద్రవ్యజలంతో, ఐశ్వర్యానికి తేనెతో, సంతానప్రాప్తికి చెరకు రసంతో, మోక్షప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి. శివరాత్రి పూజా విధానం శివపూజ చేసేవారు ప్రాతఃకాలానే లేచి స్నానసంధ్యాదికర్మలు పూర్తి చేసుకుని, నుదుట భస్మత్రిపుండ్రాలు, మెడలో రుద్రాక్షమాలను ధరించి శివాలయానికి వెళ్లి సంకల్పం చెప్పుకో వాలి. రాత్రి నాలుగవ ఝాములో శివపంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ, గంధపుష్పాక్షతలు, బిల్వ పత్రాలు, ఉమ్మెత్తపుష్పాలు, ధూప దీప నైవేద్యాలతో పూజించాలి. అనంతరం పంచామృతాభిషేకం చేసి, షోడశోపచారాలతో పూజించి, పంచాక్షరీ మంత్రంతోగాని, రుద్రంతోగాని శంకరునికి జలాభిషేకంచేయాలి. ఎలా చేయాలి? అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై మారేడు దళాలనుంచి ఒక్కొక్క కలశంలోని నీటితో కలశపూజ చేసి ప్రతి కలశంలోని జలాన్నీ శివపంచాక్షరితో అభిమంత్రించాలి. ఆ విధంగా 108 కలశాలనూ మంత్రపూరితం చేసి సిద్ధం చేసుకున్న తర్వాత రుద్రాభిషేకం ప్రారంభిం చాలి. మరునాడు ఉదయాన్నే తిరిగి స్నాన పానాదుల అనంతరం పూజ చేసిన తర్వాత వ్రత పారణæ చేయాలి. పురాణాల ప్రకారం పైవిధంగా పూజ చేసిన వారికి పునర్జన్మ వుండదు. శివలింగ పూజతో ఈశ్వరానుగ్రహం లభించడంతోబాటు సుఖం, సమృద్ధి కలుగుతాయి. శివశక్తిని తనలో ఐక్యం చేసుకోవడం కోసమూ, పరమేశ్వర ప్రసాదాన్ని పొందడం కోసమూ శివరాత్రినాడు ఉపవాస జాగరణలు చేయడం సహజం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే కాదు, దేశమంతటా అన్ని శైవక్షేత్రాలలోనూ కూడా ఈరోజున శివరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. వాటిలో శ్రీశైలం, అమరావతి, కోటప్పకొండ, వేములవాడ, భైరవకొండ, దాక్షారామం, కాళహస్తి తదితరాలు ముఖ్యమైనవి. శివ అనే శబ్దం దేవ, దానవ, మానవ జాతులందరికీ పూజనీయమైనది. సృష్టిని బ్రహ్మ చేస్తే– స్థితిని విష్ణువు చేస్తే– లయాన్ని శంకరుడు చేస్తాడని మనకి తెలిసిన విషయం. అయితే శంకరుడు ఈ మూడు కార్యాలనీ చేయగలడు. వినాయకుని తలని శూలంతో ఖండించి లయకార్యాన్నీ, ఏనుగుతలని అతికించి ప్రాణం పోసి సృష్టికార్యాన్నీ, వేరొక ప్రాణి తలని తెచ్చి మనుష్యజాతి ప్రాణికి తగిలించి సంపూర్ణ జీవిత స్థితి కలిగేలా చేయడం స్థితికార్యాన్నీ (మార్కండేయుని ఆయుష్యాన్ని పెంచి చిరాయుష్మంతునిగా చేయడం) ... ఇలా మూడిటినీ సమర్థవంతంగా చేయగలవాడూ చేసినవాడూ శివుడే. ఇంతటి మహోదాత్త గుణాలున్న శంకరునికి ‘ఏం కావాలి?’ అని అడిగితే ఆయన్ని గురించి ఓ మహా కవి ఇలా చెప్పాడు. శంకరుడి నెత్తి మీద ఓ చెంబుడు నీళ్లు చల్లి, ఏదో ఓ చెట్టుకి సంబంధించిన పత్రి... మారేడైతే మంచిది. అలా ఆయన నెత్తిమీద పారవేస్తే చాలు– పరమానందపడిపోయి– కామధేనువుని ఆ భక్తుని పెరట్లో కట్టేసి, ఇంటి ముంగిట కల్పవృక్షాన్ని పాతేసి, ఆనక అనంతమైన మోక్షఫలాన్ని ప్రసాదిస్తాట్ట. ఇది అక్షరసత్యం. ఇది నిజం కానినాడు పాదరక్షలతో తన ఒంటిని శుభ్రంచేసి, నోటితో పుక్కిలించిన నీటితో తనను అభిషేకించి సగం తిన్న పంది మాంసపు తునకలని నివేదన చేసిన తిన్నడికి మోక్షాన్ని ఇస్తాడా? తనకు అత్యంత ఇష్టమైన శ్రీకాళహస్తిలోనే, తన ఆలయ ప్రాంగణంలోనే గుడిని కట్టించి, తనతో సమానంగా పూజాపురస్కారాలని అందుకునేలా చేస్తాడా? విభూది... మానవులకు చావుపుట్టుకలు అనివార్యం. మరణించిన వ్యక్తి చివరకు పిడికెడు బూడిదగా మారి పంచభూతాలలో కలసిపోతాడు. ఈ సత్యాన్ని చాటేందుకే శివుడు శరీరం మీద బూడిద పూసుకుంటాడు. అలాగే ఎంత వైభవంగా బతికినా, ఎంత దీనంగా జీవించినా చివరకు చేరేది శ్మశానానికే. అందుకే ఆయన శ్మశానంలో నివసిస్తాడు. మెడలో సర్పాలెందుకు? కోరికలను సర్పాలతో పోల్చారు. కోరికలను నియంత్రించుకోవడమంటే ఇంద్రియాలమీద పట్టు సాధించడమే. పాములనే మెడలో ధరిస్తున్నాడంటే, కోరికల మీద, ప్రకృతి, మాయల మీద నియంత్రణ ఉన్నదని చాటడం కోసమే. శిరస్సుపై చంద్రవంక... చంద్రుడు వృద్ధిక్షయలకు ప్రతీక. శుక్లపక్షంలో పెరుగుతూ, బహుళపక్షంలో తరుగుతూ ఉంటాడాయన. అటువంటి చంద్రుడిని శిరస్సుమీద ధరించడం ద్వారా తాను కాలాతీతుడు అనే విషయాన్ని తెలియచెబుతున్నాడు. మరోవిధంగా చెప్పాలంటే శివుడు గరళాన్ని మింగడం వల్ల ఆ వేడికి ఆయన కంఠం నల్లగా మారింది. ఆ వేడిని తగ్గించి, చల్లదనాన్ని ఇవ్వడం కోసమే ఆయన తన శిరస్సున నెలవంకను, గంగమ్మను ధరించాడని చెబుతారు. త్రిశూలం, పులిచర్మం ఎందుకు? త్రిశూలం సత్త్వ రజస్తమోగుణాలకు ప్రతీక. ఆ మూడుగుణాలమీద నియంత్రణ ఉన్నవాడు కాబట్టి ఆయన చేతిలో త్రిశూలాన్ని ధరిస్తాడు. అదేవిధంగా çపులిచర్మాన్ని ధరించడం ద్వారా తాను ఇతరులచే ఛేదించలేనంతటి శక్తి కలిగిన వాడినని చాటుతున్నాడన్నమాట. శివపూజా ఫలం జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నవారు, ఆయుః ప్రమాణం తక్కువగా వున్నవారు శివుని పూజించటంవల్ల మంచి ఫలితముంటుంది. శివుడు బోళాశంకరుడు గనుక తెలిసి చేసినా, తెలియక చేసినా శివపూజ వల్ల, నామస్మరణం వల్ల సర్వపాపాలు పటాపంచలవుతాయి. గ్రహదోషాలు తొలగి సకల సంపదలూ కలుగుతాయి. దీర్ఘరోగులు, ఆయుష్షులో గండాలున్నవారు శివరాత్రినాడు మృత్యుంజయ మంత్రంతో లింగాభిషేకం చేస్తే చాలు– ఆయన అనుగ్రహంతో ఆయుష్షు మరికొంతకాలం పాటు పొడిగింపబడుతుంది. ఓంనమః శివాయ అనే మంత్రం అజ్ఞానాంధకారాన్ని తొలగించి, సంసారమనే సముద్రాన్ని సులభంగా దాటించి మోక్షం ప్రసాదిస్తుంది. బ్రహ్మహత్యాపాతకాన్ని సైతం పటాపంచలు చేయగలంత సర్వశక్తిమంతమైనది. సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సంతాన సౌఖ్యం, సౌభాగ్యం శివసాయుజ్యం పొందాలంటే శివరాత్రినాడు రుద్రాభిషేకం శుభదాయకం. మహాశివరాత్రినాడు శివపురాణాన్ని పఠించినా, దానం చేసినా ఎన్నో శుభాలు కలుగుతాయని పురాణోక్తి.