మహాదేవుడి మహాపర్వదినం | shivaratri special | Sakshi
Sakshi News home page

మహాదేవుడి మహాపర్వదినం

Published Sun, Feb 19 2017 12:45 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM

మహాదేవుడి మహాపర్వదినం

మహాదేవుడి మహాపర్వదినం

శివ అనే పదానికి శుభం, మంగళకరం, కల్యాణం, భద్రం, విశ్వశ్రేయస్సు, సర్వ సంరక్షణం, మోక్షప్రదాయకం అనే అర్థాలున్నాయి. అందరూ అమంగళ కరమైనవిగా భావించే శ్మశానం, కపాలం, చితాభస్మం, విషసర్పాలు వంటివి శివుడికి ప్రీతిపాత్రమైనవి. ఆయన శ్మశానంలో నివసిస్తాడు. చితాభస్మాన్ని ఒంటికి పూసుకుంటాడు. విషసర్పాలను ఆభరణాలుగా ధరిస్తాడు. అయినప్పటికీ ఆయన మంగళ ప్రదాత, మంగళస్వరూపుడు. సర్వదేవతా వంద్యుడు.

ఆదిమధ్యాంత రహితుడు, అనుగ్రహప్రదాత, బోళాశంకరుడు, పరమేశ్వరుడు. అందుకే పరమేశ్వర శబ్దం దేవ, దానవ, మానవ జాతులందరికీ పూజనీయమైనది. తాను విషాన్ని మింగి, లోకాలకు అమృతాన్ని పంచిన మహా ఉదారుడాయన. అందుకే ఆయనకు మహాదేవుడు అని పేరు. అంటే దేవతలందరిలోకీ ఉన్నతమైనవాడన్నమాట. తాను శ్మశానవాసిగా భిక్షాటన చేస్తూ, తన భక్తులకు సకలైశ్వర్యాలను ప్రసాదించే భక్తసులభుడాయన. ఆర్తితో పిలిస్తే పలికే దైవం ఆయన. ఆయనకు అత్యంత ప్రీతికరమైన రేయి మహాశివరాత్రి.

శివరాత్రి అంటే మంగళకరమయిన రాత్రి అని అర్థం. ప్రతినెలా శివరాత్రి వస్తుంది. అయితే అది మాస శివరాత్రి. మాఘకృష్ణ చతుర్దశినాడు వచ్చే శివరాత్రి మహాశివరాత్రి. అంటే లింగోద్భవ సమయమన్నమాట. సకల చరాచరజీవులలో, ప్రాణులలో శివుడు అంతర్యామిగా జ్యోత్లింగ స్వరూపునిగా కొలువై వున్నాడు. ఈ జగత్తులో ప్రతిజీవి తనను పూజించేందుకు పన్నెండు ప్రదేశాలలో జ్యోతిర్లింగరూపాలలో వెలిశాడాయన. లోకకళ్యాణంకోసం పరమ శివుడు మహాశివరాత్రి నాడు శివలింగం నుంచి బయటకు వస్తాడని, సమస్త సృష్టి ప్రారంభం శివరాత్రినాడే జరిగిందని పురాణాలుచెబుతున్నాయి.

జ్యోతిష శాస్త్రాన్ననుసరించి మాఘ బహుళ చతుర్దశి తిథిన చంద్రుడు సూర్యునికి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి, శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశినాడు శివపూజ చేసిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేకప్రియుడు. కాబట్టి దుఃఖనివృత్తికై క్షీరంతోనూ, బుద్ధివికాసానికి పంచదారతోనూ, శత్రునాశనానికి తైలంతోనూ, భోగప్రాప్తికి సుగంధ ద్రవ్యజలంతో, ఐశ్వర్యానికి తేనెతో, సంతానప్రాప్తికి చెరకు రసంతో, మోక్షప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి.

శివరాత్రి పూజా విధానం
శివపూజ చేసేవారు ప్రాతఃకాలానే లేచి స్నానసంధ్యాదికర్మలు పూర్తి చేసుకుని, నుదుట భస్మత్రిపుండ్రాలు, మెడలో రుద్రాక్షమాలను ధరించి శివాలయానికి వెళ్లి సంకల్పం చెప్పుకో వాలి. రాత్రి నాలుగవ ఝాములో శివపంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ, గంధపుష్పాక్షతలు, బిల్వ పత్రాలు, ఉమ్మెత్తపుష్పాలు, ధూప దీప నైవేద్యాలతో పూజించాలి. అనంతరం పంచామృతాభిషేకం చేసి, షోడశోపచారాలతో పూజించి, పంచాక్షరీ మంత్రంతోగాని, రుద్రంతోగాని శంకరునికి జలాభిషేకంచేయాలి.  

ఎలా చేయాలి?
అభిషేకం చేసేటప్పుడు శివలింగంపై మారేడు దళాలనుంచి ఒక్కొక్క కలశంలోని నీటితో కలశపూజ చేసి ప్రతి కలశంలోని జలాన్నీ శివపంచాక్షరితో అభిమంత్రించాలి. ఆ విధంగా 108 కలశాలనూ మంత్రపూరితం చేసి సిద్ధం చేసుకున్న తర్వాత రుద్రాభిషేకం ప్రారంభిం చాలి. మరునాడు ఉదయాన్నే తిరిగి స్నాన పానాదుల అనంతరం పూజ చేసిన తర్వాత వ్రత పారణæ చేయాలి. పురాణాల ప్రకారం పైవిధంగా పూజ చేసిన వారికి పునర్జన్మ వుండదు. శివలింగ పూజతో ఈశ్వరానుగ్రహం లభించడంతోబాటు  సుఖం, సమృద్ధి కలుగుతాయి. శివశక్తిని తనలో ఐక్యం చేసుకోవడం కోసమూ, పరమేశ్వర ప్రసాదాన్ని పొందడం కోసమూ శివరాత్రినాడు ఉపవాస జాగరణలు చేయడం సహజం.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే కాదు, దేశమంతటా అన్ని శైవక్షేత్రాలలోనూ కూడా ఈరోజున శివరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతాయి. వాటిలో శ్రీశైలం, అమరావతి, కోటప్పకొండ, వేములవాడ, భైరవకొండ, దాక్షారామం, కాళహస్తి తదితరాలు ముఖ్యమైనవి.

శివ అనే శబ్దం దేవ, దానవ, మానవ జాతులందరికీ పూజనీయమైనది. సృష్టిని బ్రహ్మ చేస్తే– స్థితిని విష్ణువు చేస్తే– లయాన్ని శంకరుడు చేస్తాడని మనకి తెలిసిన విషయం. అయితే శంకరుడు ఈ మూడు కార్యాలనీ చేయగలడు. వినాయకుని తలని శూలంతో ఖండించి లయకార్యాన్నీ, ఏనుగుతలని అతికించి ప్రాణం పోసి సృష్టికార్యాన్నీ, వేరొక ప్రాణి తలని తెచ్చి మనుష్యజాతి ప్రాణికి తగిలించి సంపూర్ణ జీవిత స్థితి కలిగేలా చేయడం స్థితికార్యాన్నీ (మార్కండేయుని ఆయుష్యాన్ని పెంచి చిరాయుష్మంతునిగా చేయడం) ... ఇలా మూడిటినీ సమర్థవంతంగా చేయగలవాడూ చేసినవాడూ శివుడే. ఇంతటి మహోదాత్త గుణాలున్న శంకరునికి ‘ఏం కావాలి?’ అని అడిగితే ఆయన్ని గురించి ఓ మహా కవి ఇలా చెప్పాడు.

శంకరుడి నెత్తి మీద ఓ చెంబుడు నీళ్లు చల్లి, ఏదో ఓ చెట్టుకి సంబంధించిన పత్రి... మారేడైతే మంచిది. అలా ఆయన నెత్తిమీద పారవేస్తే చాలు–

పరమానందపడిపోయి– కామధేనువుని ఆ భక్తుని పెరట్లో కట్టేసి, ఇంటి ముంగిట కల్పవృక్షాన్ని పాతేసి, ఆనక అనంతమైన మోక్షఫలాన్ని ప్రసాదిస్తాట్ట.

ఇది అక్షరసత్యం. ఇది నిజం కానినాడు పాదరక్షలతో తన ఒంటిని శుభ్రంచేసి, నోటితో పుక్కిలించిన నీటితో తనను అభిషేకించి సగం తిన్న పంది మాంసపు తునకలని నివేదన చేసిన తిన్నడికి మోక్షాన్ని ఇస్తాడా? తనకు అత్యంత ఇష్టమైన శ్రీకాళహస్తిలోనే, తన ఆలయ ప్రాంగణంలోనే గుడిని కట్టించి, తనతో సమానంగా పూజాపురస్కారాలని అందుకునేలా చేస్తాడా?

విభూది...
మానవులకు చావుపుట్టుకలు అనివార్యం. మరణించిన వ్యక్తి చివరకు పిడికెడు బూడిదగా మారి పంచభూతాలలో కలసిపోతాడు. ఈ సత్యాన్ని చాటేందుకే శివుడు శరీరం మీద బూడిద పూసుకుంటాడు. అలాగే ఎంత వైభవంగా బతికినా, ఎంత దీనంగా జీవించినా చివరకు చేరేది శ్మశానానికే. అందుకే ఆయన శ్మశానంలో నివసిస్తాడు.

మెడలో సర్పాలెందుకు?
కోరికలను సర్పాలతో పోల్చారు. కోరికలను నియంత్రించుకోవడమంటే ఇంద్రియాలమీద పట్టు సాధించడమే. పాములనే  మెడలో ధరిస్తున్నాడంటే, కోరికల మీద, ప్రకృతి, మాయల మీద నియంత్రణ ఉన్నదని చాటడం కోసమే.
శిరస్సుపై చంద్రవంక...

 చంద్రుడు వృద్ధిక్షయలకు ప్రతీక. శుక్లపక్షంలో పెరుగుతూ, బహుళపక్షంలో తరుగుతూ ఉంటాడాయన. అటువంటి చంద్రుడిని శిరస్సుమీద ధరించడం ద్వారా తాను కాలాతీతుడు అనే విషయాన్ని తెలియచెబుతున్నాడు. మరోవిధంగా చెప్పాలంటే శివుడు గరళాన్ని మింగడం వల్ల ఆ వేడికి ఆయన కంఠం నల్లగా మారింది. ఆ వేడిని తగ్గించి, చల్లదనాన్ని ఇవ్వడం కోసమే ఆయన తన శిరస్సున నెలవంకను, గంగమ్మను ధరించాడని చెబుతారు.

త్రిశూలం, పులిచర్మం ఎందుకు?
త్రిశూలం సత్త్వ రజస్తమోగుణాలకు ప్రతీక. ఆ మూడుగుణాలమీద నియంత్రణ ఉన్నవాడు కాబట్టి ఆయన చేతిలో త్రిశూలాన్ని ధరిస్తాడు. అదేవిధంగా çపులిచర్మాన్ని ధరించడం ద్వారా తాను ఇతరులచే ఛేదించలేనంతటి శక్తి కలిగిన వాడినని చాటుతున్నాడన్నమాట.

శివపూజా ఫలం
జాతకరీత్యా అపమృత్యు దోషాలున్నవారు, ఆయుః ప్రమాణం తక్కువగా వున్నవారు శివుని పూజించటంవల్ల మంచి ఫలితముంటుంది.
శివుడు బోళాశంకరుడు గనుక తెలిసి చేసినా, తెలియక చేసినా శివపూజ వల్ల, నామస్మరణం వల్ల సర్వపాపాలు పటాపంచలవుతాయి. గ్రహదోషాలు తొలగి సకల సంపదలూ కలుగుతాయి.
దీర్ఘరోగులు, ఆయుష్షులో గండాలున్నవారు శివరాత్రినాడు మృత్యుంజయ మంత్రంతో లింగాభిషేకం చేస్తే చాలు– ఆయన అనుగ్రహంతో ఆయుష్షు మరికొంతకాలం పాటు పొడిగింపబడుతుంది.
ఓంనమః శివాయ అనే మంత్రం అజ్ఞానాంధకారాన్ని తొలగించి, సంసారమనే సముద్రాన్ని సులభంగా దాటించి మోక్షం ప్రసాదిస్తుంది.
బ్రహ్మహత్యాపాతకాన్ని  సైతం పటాపంచలు చేయగలంత సర్వశక్తిమంతమైనది.
సిరిసంపదలు, ఆయురారోగ్యాలు, సంతాన సౌఖ్యం, సౌభాగ్యం శివసాయుజ్యం పొందాలంటే శివరాత్రినాడు రుద్రాభిషేకం  శుభదాయకం.
మహాశివరాత్రినాడు శివపురాణాన్ని పఠించినా, దానం చేసినా ఎన్నో శుభాలు కలుగుతాయని పురాణోక్తి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement