నేటి నుంచి శివదీక్ష విరమణ
శిబిరాల వద్దకు ఉత్సవమూర్తులు
శ్రీశైలం : కార్తీకమాసం సందర్భంగా శివదీక్ష స్వీకరించిన భక్తులు గురువారం నుంచి దీక్ష విరమణ చేయాల్సి ఉంటుందని ఈఓ నారాయణభరత్ గుప్త బుధవారం తెలిపారు. గురువారం నుంచి 11 వ తేదీ వరకు నాలుగు రోజులపాటు జరిగే దీక్ష విరమణకు పాతాళగంగ వద్ద ఉన్న శివదీక్ష శిబిరాల వద్ద మంచినీటి వసతి, లైటింగ్ తదితర ఏర్పాట్లు చేశామన్నారు. ఈ కార్యక్రమం సజావుగా సాగేలా దేవస్థానం అధికారులకు, పర్యవేక్షకులకు, సిబ్బందికి ప్రత్యేక విధులను కేటాయించామన్నారు. అలాగే భక్తులు జ్యోతిర్ముడిని కలిగినప్పుడు మాత్రమే స్వామివార్ల çదర్శనాలు కల్పించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. శివదీక్ష విరమణను దృష్టిలో పెట్టుకుని భక్తులందరికీ స్వామివార్ల లడ్డూ ప్రసాదాలు అందజేస్తామన్నారు.
శివదీక్షా శిబిరాలకు తరలనున్న ఉత్సవమూర్తులు:
కార్తీకమాసం సందర్భంగా మండలదీక్ష, అర్ధమండల దీక్ష తీసుకున్న భక్తులు ఇరుముడులను సమర్పించడానికి అధిక సంఖ్యలో శ్రీశైలం వస్తారని, ఇందుకోసం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను శిబిరాల వద్దకు తరలిస్తున్నట్లు ఈఓ నారాయణ భరత్ గుప్త తెలిపారు. ఆలయ ప్రాంగణంలోని దక్షిణద్వారం వద్ద ఉదయం 8గంటలకు స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఆవహింపజేసి అర్చకులు ప్రత్యేకపూజలు నిర్వహిస్తారన్నారు. అనంతరం పురవీధుల గుండా గ్రామోత్సవంగా శివదీక్ష శిబిరాల వద్దకు తీసుకెళ్తారని చెప్పారు. దీక్ష విరమణ చేసే భక్తులు జ్యోతిర్ముడిలోని ఆవునెయ్యి, కొబ్బరికాయలు, తదితర ద్రవ్యాలను హోమగుండంలో సమర్పిస్తారని అన్నారు.