ప్రధాని మోదీతో మస్క్-శివోన్ పిల్లల అల్లరి
వాషింగ్టన్: భారత ప్రధాని నరేంద్ర మోదీ తాజా అమెరికా పర్యటనలో అత్యంత అరుదైన క్షణాలు నమోదు చేసుకుంటున్నాయి. మునుపెన్నడూ లేనంత ఘనస్వాగతం అగ్రరాజ్యంలో ఆయనకు దక్కింది. అధ్యక్షుడు ట్రంప్ సహా పలువురు ప్రముఖులతో ఆయన వరుసగా భేటీ అవుతున్నారు. టెక్ బిలియనీర్ ఇలాన్ మస్క్ కుటుంబంతో సరదాగా గడిపిన క్షణాలనూ ప్రధాని మోదీ స్వయంగా తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ క్రమంలో మస్క్ భాగస్వామి, భారత మూలాలున్న శివోన్ జిలిస్(39) మరోసారి చర్చనీయాంశంగా మారారు.శివోన్ జిలిస్-ఇలాన్ మస్క్‌కు ముగ్గురు సంతానం. 2021లో ఈ జంట ఐవీఎఫ్ ద్వారా కవలలకు జన్మనిచ్చింది. కిందటి ఏడాది జూన్‌లో సరోగసీ మూడో బిడ్డకు జన్మనిచ్చారు. ఆ ముగ్గురు పిల్లలతో కలిసి ఈ జంట ప్రధాని మోదీని కలిశారు. ఈ సందర్భంగా ఆ పిల్లలకు మోదీ బొమ్మల కథల పుస్తకాలను బహుకరించినట్లు తెలుస్తోంది . అలాగే.. మస్క్ సైతం మోదీకి కానుక అందజేసినట్లు సమాచారం. ఆ కుటుంబంతో విస్తృత అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్ వేదికగా తెలియజేశారు. It was also a delight to meet Mr. @elonmusk’s family and to talk about a wide range of subjects! pic.twitter.com/0WTEqBaVpT— Narendra Modi (@narendramodi) February 13, 2025శివోన్ నేపథ్యం ఇదే.. ఇలాన్ మస్క్ ప్రస్తుత భాగస్వామి శివోన్ అలైస్ జిలిస్. ఆమె తల్లి శారద పంజాబ్‌కు చెందిన వ్యక్తి. తండ్రి రిచర్డ్ జిలిస్ కెనడా వ్యక్తి. శివోన్ పుట్టింది కెనడాలో. ఆమె టెక్ మేధావి. యేల్ యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేట్ అయ్యారు. న్యూయార్క్ ఐబీఎంలో ఆమె తన ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించారు. పెరూ, ఇండోనేషియాలో ఫైనాన్షియల్ టెక్నాలజీస్ విభాగంలో పని చేశారు. బ్లూమ్‌బర్గ్ బేటా వ్యవస్థాపకుల్లో ఈమె ఒకరు. 2015లో ఫోర్బ్స్-30 30 ఏళ్లలోపు జాబితాలో ఈమె చోటు దక్కించుకున్నారు. 2017-19 దాకా ఇలాన్ మస్క్ టెస్లాలో ఆటోపైలట్ ప్రొడక్ట్, చిప్ డిజైన్ టీం ప్రాజెక్టు హెడ్‌గా పని చేశారు. లింకెడిన్ 35 అండర్ 35 లిస్ట్‌లోనూ ఆమె చోటు సంపాదించుకున్నారు. శామ్ ఆల్ట్‌మన్-మస్క్ కలిసి స్థాపించిన ఓపెన్ఏఐలోనూ పని చేసిన అనుభవం ఉంది ఈమెకు. సాంకేతికతంగా ఆమెకు ఉన్న పరిజ్ఞానం గురించి తరచూ చర్చ నడుస్తుంటుంది. ప్రస్తుతం మస్క్‌కు చెందిన బ్రెయిన్ చిప్ కంపెనీ న్యూరాలింక్ వ్యవహారాలను చూసుకుంటున్నారు.ఈ ఇద్దరూ సహజీవనంలో ఉన్నట్లుగానీ, వివాహం చేసుకున్నట్లుగానీ ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించుకోలేదు. కానీ, 2022 జులైలో ఈ జంటకు కవలలు ఉన్నట్లు కోర్టు డాక్యుమెంట్ల ద్వారా బయటపడింది. ఆస్టిన్‌లో తన 11 మంది పిల్లల కోసం మస్క్ నిర్మించిన కాంప్లెక్స్‌లోనే ప్రస్తుతం శివోని జిలిస్ ఉంటున్నారు.