శివసేన పార్టీ ఫ్రస్టేషన్లో ఉంది: నితీష్ రాణె
న్యూఢిల్లీ : శివసేన పార్టీ ప్రస్తుతం ఫ్రస్టేషన్లో ఉందని కాంగ్రెస్ నేత నితీష్ రాణె వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ను ఏమీ చేయలేక, సామాన్య ప్రజలపై ఆ పార్టీ నేతలు తమ ప్రతాపం చూపిస్తున్నారని ఆయన శుక్రవారమిక్కడ విమమర్శించారు. కాగా ఎయిరిండియా సిబ్బందిపై దాడి చేసిన శివసేన ఎంపీ గైక్వాడ్‌పై తగిన చర్యలు తీసుకుంటామని కేంద్ర విమానయాన శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా తెలిపారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని ఆయన తెలిపారు.
ఈ అంశం లోక్‌సభలో శుక్రవారం చర్చకు రాగా, ఎంపీలపై సుమెటో కింద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని, ఎంపీలు దాడులకు దిగటం సరికాదని లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అన్నారు. మరోవైపు శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే... ఎయిరిండియా సిబ్బందిపై దాడికి పాల్పడ్డ గైక్వాడ్‌ను వివరణ కోరారు. అయితే శివసేన మాత్రం ఎంపీ గైక్వాడ్‌ను ఎయిరిండియా సిబ్బంది రెచ్చగొట్టారని వెనకేసుకొచ్చింది. ఒకవేళ గైక్వాడ్ తప్పు ఉంటే పార్టీ అధినేత చర్యలు తీసుకుంటారన్నారు.
ఇక ఎయిరిండియా విమానాల్లో సౌకర్యాలు మెరుగు పరచాలంటూ విమానయాన శాఖ మంత్రికి గైక్వాడ్ లేఖ రాశారు. అలాగే ఎయిరిండియా సిబ్బందికి తాను క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని, ధైర్యం ఉంటే ఢిల్లీ పోలీసులు తనను అరెస్ట్ చేసుకోవచ్చని సవాల్ విసిరారు. కేసులు సంగతి లాయర్లు, పార్టీ అధ్యక్షుడు ఉద్దవ్ ఠాక్రే చూసుకుంటారన్నారు.