18 ఏళ్ల క్రితం కేసులో ఇద్దరికి ఏడాది జైలుశిక్ష
న్యూఢిల్లీ: పద్దెనిమిదేళ్ల క్రితం ఓ మార్కెట్లో మూడు దుకాణాలు కేటాయించేందుకు బీజేపీ ఎమ్మెల్యే కరన్ సింగ్ తన్వర్‌కు రూ.ఆరు లక్షల లంచం ఇవ్వజూపిన ఇద్దరు వ్యక్తులను స్థానిక కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అలాగే 1995లో జరిగిన ఈ కేసులో ఢిల్లీ వాసులు జస్బీర్ సింగ్ చావ్లా, షోయబ్ అహ్మద్‌కు తలా లక్ష రూపాయల జరిమానాను ప్రత్యేక సీబీఐ జడ్జి రాజీవ్ మెహ్రా విధించారు. ఈ నెల 30 వరకు ఈ కేసులో అప్పీల్ చేసుకునేందుకు దోషులకు వెసులుబాటు లేదన్నారు.
జామా మసీద్‌లో చేప, కోళ్ల మార్కెట్ కమిటీ అడ్మినిస్ట్రేటర్‌గా వ్యవహరిస్తున్న తన్వర్ కావాలనే రాజకీయ కక్ష్యతో తమను ఈ కేసులో ఇరికించారన్న నిందితుల వాదనను తోసిపుచ్చారు. సీబీఐ వర్గాల కథనం ప్రకారం... మూడు దుకాణాలు కేటాయించేందుకు ఎమ్మెల్యే తన్వర్‌కు రూ.ఆరు లక్షల లంచం ఇవ్వజూపామని విచారణలో నిందితులు ఒప్పుకున్నారు. మొదటగా రూ.రెండు లక్షలు, దుకాణాలు కేటాయించిన తర్వాత రూ.నాలుగు లక్షలు ఇస్తామని బేరం పెట్టారన్నారు.
ఈ విషయాన్ని తన్వర్ సీబీఐకి ఫిర్యాదు చేయగా వలపన్ని పట్టుకున్నారు. 1995 అక్టోబర్ 16న నరైనాలోని తన్వర్ కార్యాలయానికి వచ్చిన చావ్లా, అహ్మద్‌లు రూ.రెండు లక్షలు ఇవ్వబోయారు. అక్కడే ఉన్న సీబీఐ అధికారులు వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే కరోల్ బాగ్‌కు యూత్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ విభాగానికి చావ్లా కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నాడు.