shravasti district
-
ఈ సీటు రూటే సపరేటు!
లోక్‌సభ ఎన్నికల సమరానికి ఇంక కొన్ని రోజులే మిగిలిఉన్నాయి. అత్యధిక స్థానాలు ఉన్న ఉత్తర ప్రదేశ్‌లో అత్యంత ప్రాధాన్యం ఉన్న సీట్లు చాలానే ఉన్నాయి. చాలా చోట్ల వరుసగా రెండు మూడు సార్లు నెగ్గిన అభ్యర్థులు ఉన్నారు. అయితే శ్రావస్తి లోక్‌సభ నియోజకవర్గం ఓటర్ల తీరు ప్రత్యేకంగా ఉంటుంది. ఇప్పటి వరకు జరిగిన లోక్ సభ ఎన్నికలను పరిశీలిస్తే ప్రతి ఎన్నికల తర్వాత ఎంపీలు మారిపోతున్నారు. కొత్త డీలిమిటేషన్ తర్వాత జరిగిన మొత్తం మూడు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఎస్పీ క్యాంపుల నుంచి అభ్యర్థులు ఎన్నికయ్యారు. ఇక నాలుగోసారి అంటే ఈ సారి ఎన్నికల్లో ఎంపీ ఎవరవుతారన్న చర్చ పొలిటికల్ సర్కిల్‌ను వేడెక్కిస్తోంది. శ్రావస్తి జిల్లాలోని భింగా, శ్రావస్తి అసెంబ్లీ నియోజకవర్గాలు, బలరాంపూర్ జిల్లాలోని తులసిపూర్, బల్రాంపూర్ సదర్ అసెంబ్లీ నియోజకవర్గాలు, గస్డి ప్రాంతం కలిపి 2009 సంవత్సరంలో శ్రావస్తి లోక్‌సభ నియోజకవర్గం ఏర్పడింది. డీలిమిటేషన్ తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో 11 మంది అభ్యర్థులు తలపడ్డారు. కాంగ్రెస్ తరఫున వినయ్‌కుమార్ పాండే అలియాస్ బిన్నూ, బీఎస్పీ నుంచి రిజ్వాన్ జహీర్, ఎస్పీ నుంచి రుబాబ్ సయీదా, బీజేపీ నుంచి సత్యదేవ్ సింగ్ బరిలో నిలిచారు. ఇందులో కాంగ్రెస్ అభ్యర్థికి 2,01,556 ఓట్లు రాగా బీఎస్పీ అభ్యర్థిపై 42,029 ఓట్లతో విజయం సాధించారు. ఎస్పీకి మూడో స్థానం, బీజేపీకి నాలుగో స్థానం దక్కాయి. 2014 ఎన్నికల్లో 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీజేపీ తరపున దద్దన్ మిశ్రా, ఎస్పీ అతీక్ అహ్మద్, బీఎస్పీ నుంచి లాల్జీ వర్మ, కాంగ్రెస్ నుంచి వినయ్ కుమార్ పాండే అలియాస్ బిన్నూ రెండోసారి బరిలో నిలిచారు. ఈ ఎన్నికల్లో రిజ్వాన్ జహీర్ పీస్ పార్టీ నుంచి పోటీ చేశారు. అతిక్ అహ్మద్ 85 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి దద్దన్ మిశ్రా 85,913 ఓట్లతో విజయం సాధించారు. ఈయనకు 3,45,964 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో ఎస్పీ రెండో స్థానంలో, బీఎస్పీ మూడో స్థానంలో, పీస్ పార్టీ నాలుగో స్థానంలో నిలిచాయి. కాంగ్రెస్ ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇక మూడోసారి ఎన్నికలు 2019లో జరిగాయి.ఈసారి ఎస్పీ-బీఎస్పీ పొత్తు తర్వాత ఈ సీటు బీఎస్పీ శిబిరానికి దక్కింది. ఎన్నికల్లో మొత్తం 11 మంది అభ్యర్థులు పోటీ చేశారు. బీఎస్పీ కూటమి రామ్ శిరోమణి వర్మను అభ్యర్థిగా చేసింది. బీజేపీ నుంచి దద్దన్ మిశ్రా రెండోసారి ఎన్నికల బరిలో నిలిచారు. కాంగ్రెస్ తన రూపు మార్చుకుని ధీరేంద్ర ప్రతాప్ సింగ్‌ను రంగంలోకి దించింది. ఈ ఎన్నికలలో బీఎస్పీ అభ్యర్థి బీజేపీపై 5,320 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈసారి నాలుగో ఎన్నికల ప్రకటన వెలువడింది. బీజేపీ తన అభ్యర్థిగా ఎమ్మెల్సీ సాకేత్ మిశ్రాను ప్రకటించింది. ఎస్పీ-కాంగ్రెస్ పొత్తు తర్వాత ఈ సీటు ఎస్పీకి దక్కింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ-బీఎస్పీ అభ్యర్థులు ఎవరు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరనే దానిపై ఇటు ఓటర్లు, అటు రాజకీయ పరిశీలకుల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
అత్యాచారం కేసు: 33 ఏళ్ల తర్వాత మహిళకు శిక్ష
శ్రావస్తి/లక్నో: 33 ఏళ్ల క్రితం 12 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసేందుకు సాయం చేసిన మహిళకు శ్రావస్తి స్థానిక కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. అదనపు సెషన్స్ జడ్జి పరమేశ్వర్ ప్రసాద్ గురువారం నిందితురాలికి 15 వేల రూపాయల జరిమానా విధించినట్లు ప్రభుత్వ న్యాయవాది కేపీ సింగ్ తెలిపారు. ఈ కేసులో మిగతా నిందితులందరూ విచారణ సమయంలో మరణించారని ఆయన అన్నారు. కోర్టులో దీర్ఘకాలం పెండింగ్‌లో ఉన్న పురాతన కేసుల్లో ఇది ఒకటి అని సింగ్ అన్నారు. కేసు వివరాలు.. 33 ఏళ్ల క్రితం అనగా 1988, జూన్ 30న ఉత్తరప్రదేశ్ శ్రావస్తికి చెందిన బాధితురాలు సమీప గ్రామంలో ఓ విహానికి హాజరయ్యింది. రాత్రి తిరిగి ఇంటికి వస్తుండగా నిందితురాలు రామ్‌వతి, ఆమె తల్లి ఫూల్‌మాత మైనర్‌ను ముక్కు, పుస్సు, లాహ్రీ అనే ముగ్గురు వ్యక్తులకు అప్పగించారు. ఈ కేసులో ముక్కు, పుస్సు, లాహ్రీ, రామ్‌వతి, ఆమె తల్లి ఐదుగురిపై ఐపీసీ సంబంధిత విభాగాల కింద భింగా పోలీస్‌స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు చార్జిషీట్ కూడా దాఖలు చేశారు. 33 సంవత్సరాల తరువాత, 2021 ఏప్రిల్‌లో కోర్టు వారందరినీ దోషులుగా గుర్తించి తన తీర్పును రిజర్వు చేసింది. చదవండి: ఆసుపత్రిలో నర్సును లైంగికంగా వేధించిన డాక్టర్.. -
ముంచెత్తుతున్న వరదలు
యూపీలో 48 మంది మృత్యువాత.. ముంపులో వెయ్యికిపైగా గ్రామాలు లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల కారణంగా ఇప్పటి వరకూ 48 మంది మరణించారు. ఆదివారమే 28 మంది మృత్యువాతపడగా.. సోమవారం మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... బహరైచ్ జిల్లాలో తొమ్మిది మంది, శ్రవస్తి జిల్లాలో ఎనిమిది మంది, బలరామ్‌పూర్ జిల్లాల్లో ఇద్దరు, లఖింపూర్ జిల్లాలో ఒకరు వరద సంబంధిత ఘటనల్లో మరణించారు. మరోవైపు రాప్తీ, సరయు, ఘాఘ్ర, శారద తదితర నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో వెయ్యికిపైగా గ్రామాలు పూర్తిగా ముంపులో చిక్కుకున్నాయి. వీటికి బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. బహరైచ్, శ్రవస్తి, బల్రామ్పూర్, గోండా, లఖింపూర్, బారాబంకీ, సీతాపూర్, ఫైజాబాద్, అజాంఘర్ జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ముంపు ప్రభావిత గ్రామాల్లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గణేష్‌పూర్ ప్రాంతంలో జాతీయ రహదారిని వరద నీరు ముంచెత్తడంతో లక్నో, బహరైచ్ మధ్య రాకపోకలు స్తంభించాయి. యూపీ, బీహార్ వరదల్లో మృతి చెందిన వారికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతాపం తెలిపారు. నేపాల్‌లో అంటురోగాల భయం.. ఖట్మండూ: నేపాల్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 105కి చేరింది. సోమవారానికి ఏడు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మరో 130 మంది జాడ తెలియడం లేదు. మరోవైపు వరదల కారణంగా కలరా వంటి అంటు వ్యాధులు వ్యాపిస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. హోలియా, బేతాని, మల్లా జిల్లాల్లో ఇప్పటికే అనేక మంది అంటు రోగాలబారిన పడ్డారని, నిర్ణీత సమయంలో నివారణ చర్యలు తీసుకోకుంటే పరిస్థితి మరింత తీవ్రం కావొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.