ముంచెత్తుతున్న వరదలు
యూపీలో 48 మంది మృత్యువాత.. ముంపులో వెయ్యికిపైగా గ్రామాలు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో వరద బీభత్సం కొనసాగుతోంది. వరదల కారణంగా ఇప్పటి వరకూ 48 మంది మరణించారు. ఆదివారమే 28 మంది మృత్యువాతపడగా.. సోమవారం మరో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... బహరైచ్ జిల్లాలో తొమ్మిది మంది, శ్రవస్తి జిల్లాలో ఎనిమిది మంది, బలరామ్‌పూర్ జిల్లాల్లో ఇద్దరు, లఖింపూర్ జిల్లాలో ఒకరు వరద సంబంధిత ఘటనల్లో మరణించారు. మరోవైపు రాప్తీ, సరయు, ఘాఘ్ర, శారద తదితర నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తుండటంతో వెయ్యికిపైగా గ్రామాలు పూర్తిగా ముంపులో చిక్కుకున్నాయి.
వీటికి బయటి ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. బహరైచ్, శ్రవస్తి, బల్‌రామ్‌పూర్, గోండా, లఖింపూర్, బారాబంకీ, సీతాపూర్, ఫైజాబాద్, అజాంఘర్ జిల్లాల్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. ముంపు ప్రభావిత గ్రామాల్లో ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. గణేష్‌పూర్ ప్రాంతంలో జాతీయ రహదారిని వరద నీరు ముంచెత్తడంతో లక్నో, బహరైచ్ మధ్య రాకపోకలు స్తంభించాయి. యూపీ, బీహార్ వరదల్లో మృతి చెందిన వారికి రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సంతాపం తెలిపారు.
నేపాల్‌లో అంటురోగాల భయం..
ఖట్మండూ: నేపాల్‌లో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మరణించిన వారి సంఖ్య 105కి చేరింది. సోమవారానికి ఏడు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మరో 130 మంది జాడ తెలియడం లేదు. మరోవైపు వరదల కారణంగా కలరా వంటి అంటు వ్యాధులు వ్యాపిస్తాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. హోలియా, బేతాని, మల్లా జిల్లాల్లో ఇప్పటికే అనేక మంది అంటు రోగాలబారిన పడ్డారని, నిర్ణీత సమయంలో నివారణ చర్యలు తీసుకోకుంటే పరిస్థితి మరింత తీవ్రం కావొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.