కీలక బిల్లుల ఆమోదం అనుమానమే: చిదంబరం
న్యూఢిల్లీ: ఈ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బిల్లు మినహా మరే కీలక బిల్లు పార్లమెంటు ఆమోదం పొందడం అనుమానమేనని కేంద్ర ఆర్థిక మంత్రి పీ చిదంబరం బుధవారం వ్యాఖ్యానించారు. స్థానిక శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న చిదంబరం.. ‘రోజూ పార్లమెంటుకెళ్లడం.. ఉత్త చేతులతో తిరిగిరావడం సాధారణమైపోయింది’ అన్నారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ‘ఆర్థిక బిల్లు, ఓటాన్ అకౌంట్, ద్రవ్య వినిమయ బిల్లులు ఆమోదం పొందుతాయి. ఒకవేళ చర్చ జరగకుండా అవి ఆమోదం పొందితే మాత్రం నేను సంతోషించను. చర్చ జరిగిన తరువాతే అవి పాస్ కావాలని కోరుకుంటున్నాను’ అన్నారు. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్(సీఎన్జీ), పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ)ల తగ్గింపు నిర్ణయం రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసింది కాదన్నారు.
తెలంగాణపై సభలో నిరసనలు తాత్కాలికమేనన్న ప్రధాని
ఇదిలా ఉండగా, తెలంగాణ అంశంపై సభను అడ్డుకునే సంఘటనలు తాత్కాలిక అవాంతరాలేనని ప్రధాని మన్మోహన్ అభివర్ణించారు. వ్యక్తిగత వ్యతిరేకాభిప్రాయాలను పక్కనబెట్టి సభ సజావుగా నడిచేలా వ్యవహరించాలన్న జ్ఞానం అన్నివర్గాలకు ఉందని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. పార్లమెంటు భవనం వెలుపల బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాగా పార్లమెంటు చివరి సమావేశాల్లో 39 బిల్లులను ఆమోదింపజేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. వాటిలో తెలంగాణ బిల్లు, పలు అవినీతి వ్యతిరేక బిల్లులు ఉన్నాయి.