పాత టూ వీలర్ల విక్రయాల్లోకి శ్రీరామ్ ఆటోమాల్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పాత వాహనాల విక్రయ రంగంలో ఉన్న శ్రీరామ్ ఆటోమాల్ ద్విచక్ర వాహన విభాగంలోకి ప్రవేశిస్తోంది. ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద విక్రయాలను ప్రారంభించామని కంపెనీ డెరైక్టర్, సీఈవో సమీర్ మల్హోత్రా బుధవారమిక్కడ మీడియాకు చెప్పారు. దేశంలో ఏటా కొత్త టూ వీలర్లు ఎన్నైతే అమ్ముడవుతున్నాయో, అంతే స్థాయిలో పాతవి విక్రయం అవుతున్నాయని వివరించారు.
‘భారత్లో అన్ని రకాల పాత వాహనాల విక్రయ పరిమాణం రూ.1 లక్ష కోట్లు. వృద్ధి రేటు 5 శాతముంది. వ్యవస్థీకృత రంగ వాటా 4-5 శాతముంటుందని అంచనా’ అని చెప్పారు. 100కుపైగా వేలం కేంద్రాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. గతేడాది 70 వేల వాహనాలను విక్రయించాం. 2014-15లో లక్ష యూనిట్లు లక్ష్యమని పేర్కొన్నారు. కంపెనీ విక్రయ కేంద్రాలైన ఆటోమాల్స్ దేశవ్యాప్తంగా 43 ఉన్నాయి. మార్చికల్లా మరో 17 ప్రారంభించనుంది.