Shubham Banerjee
-
బ్రెయిగో ల్యాబ్స్‌లో ఇంటెల్ పెట్టుబడులు
శాంటాక్లారా, అమెరికా: చౌక బ్రెయిలీ ప్రింటర్స్ రూపకల్పనతో సంచలనం సృష్టించిన ప్రవాస భారతీయ బాలుడు శుభం బెనర్జీ (13) తాజాగా టెక్నాలజీ దిగ్గజం ఇంటె ల్ దృష్టినీ ఆకర్షించాడు. బ్రెయిగో ల్యాబ్స్ పేరిట బెనర్జీ ఏర్పాటు చేసిన స్టార్టప్ సంస్థలో ఇంటెల్ కూడా పెట్టుబడులు పెట్టింది. ఇలా వెంచర్ క్యాపిటల్ అందుకున్న ఔత్సాహిక వ్యాపారవేత్తల్లో అత్యంత పిన్న వయస్కుడు బెనర్జీనే అయి ఉంటాడని ఇంటెల్ వర్గాలు పేర్కొన్నాయి. సాధారణ బ్రెయిలీ ప్రింటర్ల ధర ప్రస్తుతం 2,000 డాలర్ల (సుమారు రూ.1.20 లక్షలు) పైచిలుకు ఉంటోంది. ఈ నేపథ్యంలో చౌకగా వీటిని అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో బెనర్జీ కృషి చేశాడు. చివరికి లెగో రోబోటిక్స్ కిట్‌ను ఉపయోగించి 350 డాలర్ల స్థాయిలో (సుమారు రూ.21,000) ప్రింటర్‌ను రూపొందించాడు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రింటర్లు 9 కిలోల పైగా బరువుంటుండగా.. బెనర్జీ తీర్చిదిద్దిన ప్రింటరు బరువు కొన్ని పౌండ్లు మాత్రమే. స్కూలు ప్రాజెక్టుగా దీన్ని చేపట్టిన బెనర్జీ తాజాగా వీటి విక్రయాల కోసం పూర్తిస్థాయి కంపెనీనే ప్రారంభించాడు. -
చవకగా బ్రెయిలీ ప్రింటర్
భారత సంతతికి చెందిన 12 ఏళ్ల విద్యార్థి రూపకల్పన న్యూయార్క్: అంధులకు ఉపయోగపడేలా తక్కువ ధరలో బ్రెయిలీ ప్రింటర్ ను అమెరికాలో భారత సంతతికి చెంది న 12 ఏళ్ల శుభమ్ బెనర్జీ రూపొందిం చాడు. ఎలక్ట్రానిక్ ఆట వస్తువు ‘లెగో మైండ్‌స్టార్మ్ ఈవీ3’ తో దీనిని రూపొం దించడం గమనార్హం. పిల్లల్లో సృజనాత్మకత పెంపొందించేందుకు.. చిన్న భాగాలను కలిపి వేర్వేరు ఆట బొమ్మల్ని తయారే చేసేందుకు తోడ్పడే ఎలక్ట్రానిక్ కిట్ ఈ ‘లెగో మైండ్‌స్టార్మ్ ఈవీ3’. దీనికి మరికొన్ని భాగాలను చేర్చి.. ‘బ్రెయిగో’ పేరుతో బ్రెయిలీ ప్రింటర్‌ను బెనర్జీ తయారు చేశాడు. బ్రెయిలీ భాష లో ఏ నుంచి జెడ్ వరకూ అక్షరాలను, అంకెలను దీనితో కాగితంపై ప్రింట్ చేయవచ్చు. ఒక్కో అక్షరాన్ని ప్రింట్ చేయడానికి ఇది ఏడు సెకన్ల సమయం తీసుకుంటుంది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని శాంటాక్లారాలో ఏడో తరగతి చదువుతున్న శుభమ్ బెనర్జీ... తాను రూపొందించిన ఈ డిజైన్‌ను, ప్రోగ్రామ్ సాఫ్ట్‌వేర్‌ను అందరికీ ఉచితంగా అందజేస్తానని చెబుతున్నాడు. దీనితో అక్షరాలను ప్రింట్ చేసే విధానాన్ని వీడియో తీసి యూట్యూబ్‌లో పెట్టాడు కూడా. సాధారణంగా బ్రెయిలీ ప్రింటర్ ధర రూ. లక్షన్నర వరకూ ఉండగా... ‘బ్రెయిగో’ను రూ. 20 వేలతో తయారు చేసుకోవచ్చు.