ఫిల్మ్ అకాడమీల కన్న... పెద్దల మాట మిన్న!
గ్లామర్ పాయింట్
‘ది న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ’లో నటనలో శిక్షణ తీసుకుంది ప్రముఖ డెరైక్టర్ ఇంద్ర కుమార్ కుమార్తె శ్వేత కుమార్. ఆరోజుల్ని ఒకసారి గుర్తుకు తెస్తే- ‘‘ఏమాటకామాట చెప్పుకోవాలి. అక్కడ నేర్చుకున్నదానికంటే పెద్దల సలహాల నుంచి నేర్చుకుందే ఎక్కువ’’ అంటుంది ఆమె. ‘సూపర్ నాని’ సినిమాలో భాగంగా రేఖ, రణ్‌ధీర్ కపూర్‌లాంటి సీనియర్లతో పని చేసే అవకాశం వచ్చింది శ్వేతకు.
ఆ సమయంలో నటనకు సంబంధించి వారెన్నో సలహాలు ఇచ్చారట. ముఖ్యంగా ఎమోషనల్ సీన్‌ను ఎలా పండించాలి అనేదాని గురించి బోలెడు టిప్పులు ఇచ్చారట. పర్ఫెక్షన్ కోసం రేఖ పడే తపన శ్వేతను ఆకట్టుకుంది. వీలైనప్పుడల్లా అరుణా ఇరానీ సలహాలు కూడా అడుగుతుంది శ్వేత.
ఒకసారి ఇరానీ ‘‘మీ నాన్న డెరైక్టర్ కాబట్టి సినిమాల్లోకి రావాలనుకోకు. నటన మీద పాషన్ ఉంటే మాత్రమే వచ్చేయ్’’ అన్నారట. శ్వేత మాటల్లో కనిపించే అంకితభావం చూస్తుంటే ఆమె ఆషామాషీగా సినిమా రంగంలోకి రాలేదనే విషయం అర్థమవుతుంది. శ్వేతకు ఒక సూపర్ డూపర్ హిట్ సినిమాలో పనిచేసే అవకాశం రావాలని ఆశిద్దాం.