మతవిద్వేష దాడుల్ని ఆపండి!
కోల్‌కతా/న్యూఢిల్లీ: దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీలపై మతం ఆధారంగా జరుగుతున్న మూకహత్యలు, దాడులపై సినీపరిశ్రమతో పాటు వేర్వేరు రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులు గళమెత్తారు. ఈ మూకహత్యలను వెంటనే అరికట్టేందుకు ప్రధాని మోదీ చర్యలు తీసుకోవాలని ప్రముఖ దర్శకులు మణిరత్నం, అదూర్ గోపాలకృష్ణన్, అనురాగ్ కశ్యప్, శ్యామ్‌బెనగల్ నటీనటులు అపర్ణాసేన్, కొంకణ్‌సేన్ శర్మ, రేవతి, సౌమిత్రో ఛటర్జీ, గాయని శుభా ముగ్దల్, ప్రముఖ చరిత్రకారుడు రామచంద్రగుహ, సామాజిక కార్యకర్త బినాయక్ సేన్, సామాజికవేత్త ఆశిష్ నంది సహా 49 మంది బహిరంగ లేఖ రాశారు. కోల్‌కతాలో నటి అపర్ణాసేన్ ఈ లేఖను మీడియాకు విడుదల చేశారు.
అందులో.. ‘‘మోదీజీ.. మనదేశంలో ఇటీవల చోటుచేసుకుంటున్న దురదృష్టకరమైన సంఘటనలపై మేమంతా కలత చెందుతున్నాం. మనది శాంతికాముక దేశం. కానీ దేశంలో ముస్లింలు, దళితులు, ఇతర మైనారిటీ మతస్తులను చంపేస్తున్నారు. దీన్ని నిలువరించాలి. ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) గణాంకాలు చూసి విస్తుపోయాం. ఎందుకంటే ఒక్క 2016లోనే దళితులపై 840 దాడి ఘటనలు నమోదయ్యాయి. 9 ఏళ్లలో మతవిద్వేష దాడులు అమాంతం పెరిగిపోగా, అందులో 62 శాతం మంది బాధితులు ముస్లింలే. 2009, జనవరి 1 నుంచి 2018 అక్టోబర్ 29 వరకూ దేశవ్యాప్తంగా 254 మత విద్వేష ఘటనలు నమోదుకాగా, వీటిలో 91 మంది చనిపోయారు. ఈ విద్వేషదాడుల్లో 90 శాతం 2014, మే తర్వాతే(మోదీ వచ్చాకే) నమోదయ్యాయి.
ఈ నేరాల్లో శిక్షలు పడుతున్న కేసులు గణనీయంగా తగ్గిపోవడం ఇంకా దారుణం. మోదీజీ.. మీరు పార్లమెంటులో ఈ మూకహత్యలను ఖండించారు. కానీ అది మాత్రమే సరిపోదు. హత్య కేసుల్లో పెరోల్ లేకుండా జీవితఖైదు పడుతున్నప్పుడు అంతకంటే దారుణమైన మూకహత్యలకు అదే శిక్ష ఎందుకు వర్తించదు? ఇలాంటి ఘటనల్లో దోషులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఏ దేశంలో కూడా ప్రజలు భయంతో బతకకూడదు. మెజారిటీ ప్రజలు శ్రీరాముడిని ఆరాధిస్తారు. కానీ, ‘జై శ్రీరామ్’ రెచ్చగొట్టే యుద్ధ నినాదంగా మారిపోయింది. ఆయన పేరుతో హత్యలు చేయడానికి ఇది మధ్యయుగం కాదు. ప్రధానిగా ఈ దుశ్చర్యలను నిలువరించాలి. మతవిద్వేష దాడులతో శ్రీరాముడి పేరును అపవిత్రం చేయడం ఆపండి. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించిన వారిని దేశద్రోహులుగా, జాతివ్యతిరేకులుగా, అర్బన్ నక్సల్స్‌గా ముద్రవేయడం సరికాదు. అధికార పార్టీని విమర్శిస్తే∙దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదు. ప్రజలు తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కును రాజ్యాంగం కల్పిస్తోంది. ఎక్కడైతే భిన్నాభిప్రాయాన్ని, అసమ్మతిని వినిపించేందుకు అవకాశముంటుందో అదే బలమైన దేశంగా రూపుదిద్దుకుంటుంది’’ అని లేఖలో పేర్కొన్నారు.
అందరూ సురక్షితమే: నఖ్వీ
భారత్‌లో ముస్లింలు దళితులు సహా మైనారిటీలంతా సురక్షితంగా ఉన్నారని కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. మూకహత్యలు, మతవిద్వేష దాడుల్ని అరికట్టాలని 49 మంది దర్శకులు, నటులు, ఇతర కళాకారులు ప్రధాని మోదీకి రాసిన లేఖను ఆయన తప్పుపట్టారు. నేరాలకు మతం రంగు పులమడం సరికాదని వ్యాఖ్యానించారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎలాంటి మతఘర్షణలు చోటు చేసుకోలేదని గుర్తుచేశారు. ‘‘2014 ఎన్నికల తర్వాత ‘అవార్డు వాపసీ’ పేరుతో ఇలాంటి కార్యక్రమాన్నే మనమంతా చూశాం. ఇది దానికి పార్ట్–2 మాత్రమే. విద్వేష నేరాలు, మూకహత్యలను అరికట్టడానికి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కానీ తమనుతాము మానవ హక్కుల పరిరక్షకులుగా, లౌకికవాదానికి కస్టోడియన్లుగా చెప్పుకునే కొందరు ఈ నేరాలకు మతం రంగుపులిమే ప్రయత్నం చేస్తున్నారు’’ అని నఖ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు.