
ఆర్. నారాయణమూర్తి
‘‘బడా పారిశ్రామికవేత్తలు అప్పులు చేస్తే శిక్షలు వేయరు. కానీ రైతు అప్పు కట్టకపోతే పొలాల్ని, ఇంటిని జప్తు చేస్తారు. వాటిని నా ‘అన్నదాత సుఖీభవ’ చిత్రంలో చూపించా. సినిమాకి కీలకమైన ఆ సన్నివేశాలను తొలగించాలని సెన్సార్ బోర్డ్ చెప్పడం బాధ కలిగించింది. అసలు రైతుల బాధలను చూపించాలనే ఉద్దేశంతోనే ఈ చిత్రం తీశా’’ అని నటుడు, దర్శక–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘అన్నదాత సుఖీభవ’.
ఈ నెల 14న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. అయితే సెన్సార్ బోర్డు చెప్పిన సన్నివేశాల తొలగింపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ బుధవారం నారాయణమూర్తి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘దేశానికి వెన్నెముక రైతు అంటారు. అన్నం పెట్టే అన్నదాత పంటలకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నాడు. నోట్ల రద్దు వల్ల కూడా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జీఎస్టీ వల్ల వేల కోట్ల ధనం ప్రజలు కోల్పోతున్నారు. ఈ అంశాలన్నింటినీ మా సినిమాలో ప్రస్తావించా.
ఈ నెల 14న సినిమాను విడుదల చేయాలని మార్చిలో సెన్సార్‌కు అప్లై చేశా. వారం క్రితం సినిమా చూసిన సెన్సార్ బోర్డు నోట్ల రద్దు, జీఎస్టీ సన్నివేశాలను తొలగించాలని చెప్పడంతో ఒప్పుకున్నా. కానీ, సినిమాకి కీలకమైన రైతు సన్నివేశాలను తొలగించాలని చెప్పడంతో ఒప్పుకోలేదు. అందుకే నా సినిమాకు సెన్సార్ చేయలేదు. సెన్సార్ బోర్డు తీరుకు నిరసనగా నేను రివైజింగ్ కమిటీకి వెళ్తున్నా. 30 ఏళ్లుగా నేను ప్రజా సమస్యలపై మాత్రమే సినిమాలు తీస్తున్నా. సెన్సార్ విషయంలో శ్యామ్ బెనగల్ సూచనలను అమలు చేయాలని అన్ని ఇండస్ట్రీల నిర్మాతలు పోరాటాలు చేయాలి’’ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment