కాళేశ్వరం ప్రాజెక్టు; సొరంగంలో మరో ప్రమాదం
శాయంపేట: కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరో ప్రమాదం చోటుచేసుకుంది. 6వ ప్యాకేజీలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం శాయంపేట వద్ద నిర్మిస్తోన్న టన్నెల్లో శుక్రవారం కూలీలు ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడటంతో ఐదుగురికి గాయాలయ్యాయి. కాగా, బండరాళ్లు పడటం వల్లే కూలీలు గాయపడ్డారని కొందరు, వాహనం అదుపుతప్పడం వల్లే ప్రమాదం జరిగిందని మరికొందరు పేర్కొంటుండటం గమనార్హం. ఇదే ప్రాజెక్టు పనుల్లో బుధ, గురువారాల్లో జరిగిన ప్రమాదాల్లో 8 మంది కూలీలు మరణించిన సంగతి తెలిసిందే.
గాయపడ్డవారిని హుటాహుటిన ధర్మారంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఐదుగురిలో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలిసింది. వీరంతా యూపీ, జార్ఖండ్, ఒడిశా, బిహార్ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలేనని సమాచారం.
వరుసగా మూడోరోజు..: ప్యాకేజీల వారీగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో నేటి ఘటనతో కలిపి వరుసగా మూడో రోజూ ప్రమాదాలు జరిగినట్లైంది. 10వ ప్యాకేజీ (సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం తిప్పాపూర్ వద్ద) టన్నెల్లో బుధవారం పైకప్పు కూలిన ఘటనలో ఏడుగురు వలస కూలీలు దుర్మరణం చెందారు. 7వ ప్యాకేజీలో భాగంగా పెద్దపల్లి జిల్లా జిల్లా ధర్మారం మండలం మల్లాపూర్ వద్ద నిర్మిస్తున్న సొరంగం (అండర్ టన్నెల్)లో గురువారం బండరాయి తలపై పడి మరో కూలీ మరణించాడు. పనులు జరుగుతోన్న ప్రదేశంలో సరైన భద్రతా ప్రమాణాలు పాటించనందువల్లే ఈ రెండు ఘటనలు జరిగాయని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నాయి. నేటి ప్రమాదంపై అధికారులు స్పందించాల్సిఉంది.