ఢీనోటిఫికేషన్
కాంగ్రెస్ పార్టీ నిధుల కోసమేనంటూ బీజేపీ ధ్వజం
సీబీఐ దర్యాప్తునకు పట్టు
అరుపులతో దద్దరిల్లిన అసెంబ్లీ
ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసంచేస్తానంటూ సీఎం సవాల్
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : నగరంలోని అర్కావతి లేఔట్లో 541 ఎకరాల భూమిని డీనోటిఫికేషన్ చేయడంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ ప్రతిపక్ష బీజేపీ శనివారం శాసన సభను స్తంభింపజేసింది. ఉదయం సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలు ఈ అంశంపై పరస్పరం ఆరోపణలు, ప్రత్యారోపణలకు దిగడంతో సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. పాలక, ప్రతిపక్ష సభ్యుల అరుపులతో సభ దద్దరిల్లింది.
డీనోటిఫికేషన్ వ్యవహారం కోట్ల రూపాయల కుంభకోణం కనుక సీబీఐ చేత దర్యాప్తు చేయించాల్సిందేనని శెట్టర్ పట్టుబట్టారు. గత జూన్ 18న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య డీనోటిఫికేషన్కు ఆమోదం తెలిపారని ఆరోపించారు. భూసేకరణను విరమించుకోవడం హైకోర్టు ఆదేశాలను ఉల్లఘించడమే అవుతుందని తెలిసినప్పటికీ, సీఎం అంగీకరించారని తెలిపారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే డీనోటిఫికేషన్కు సంబంధించిన ఫైల్ తన వద్దకు వచ్చిందని చెప్పారు. అయితే హైకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా ఉన్నందున తాను అంగీకరించలేదని వెల్లడించారు.
ఇటీవల లోక్సభ ఎన్నికల సందర్భంగా పార్టీ నిధుల కోసం ముఖ్యమంత్రి డీనోటిఫికేషన్కు అంగీకరించారని ఆరోపించారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ, 541 ఎకరాల డీనోటిఫికేషన్కు సంబంధించి బీడీఏ 2013లోనే తీర్మానాన్ని ఆమోదించిందని, దీనినే ప్రభుత్వానికి కూడా సిఫార్సు చేసిందని వెల్లడించారు. అప్పట్లో సీఎంగా ఉన్న శెట్టర్ తీర్మానం ఆమోదం పొందకుండా ఎందుకు అడ్డుకోలేక పోయారని ప్రశ్నించారు.
డీనోటిఫికేషన్కు సంబంధించి సిఫార్సులు చేయడానికి బీడీఏ తరఫున అధికారులను కూడా గత బీజేపీ హయాంలోనే నియమించారని గుర్తు చేశారు. హైకోర్టు మార్గదర్శకాల ప్రకారమే డీనోటిఫికేషన్ జరిగినందున, ఇందులో చట్ట వ్యతిరేకమేదీ లేదని సమర్థించుకున్నారు. వారంలోగా డీనోటిఫికేషన్ చేయకపోతే కోర్టు ధిక్కరణ కేసును నమోదు చేయాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించిందని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో తమకు వేరే ప్రత్యామ్నాయమే లేకుండా పోయిందని వివరణ ఇచ్చారు.
యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2007, 2010 మధ్య 198 ఎకరాల బీడీఏ భూమిని డీనోటిఫై చేసిన విషయాన్ని గుర్తు చేయడం ద్వారా ముఖ్యమంత్రి బీజేపీని ఇబ్బందుల్లోకి నెట్టడానికి ప్రయత్నించారు. శెట్టర్, యడ్యూరప్ప ప్రభృతులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు అబద్ధాలు చెబుతున్నారని అన్నారు. కోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి ఉంటే చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకాడబోదని స్పష్టం చేశారు.
తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాలు విసిరారు. దీనిపై సీఐడీ దర్యాప్తునకు సిద్ధమేనని ప్రకటించారు. ఈ సమాధానంతో సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు సీబీఐ చేత దర్యాప్తు చేయించాలంటూ నినాదాలు చేశారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ సభ్యులు కూడా కేకలు వేశారు. ఇలా అరుపులు, కేకలతో ఎంతకూ పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో స్పీకర్ కాగోడు తిమ్మప్ప సభను సోమవారానికి వాయిదా వేశారు.