సిబ్బంది కొరతతో పోస్టుమార్టం నిలిపివేత
సాక్షి, ముంబై: డాక్టర్లు, సిబ్బంది కొరత కారణంగా రాజావాడి, జేజే, భగవతి, కూపర్ ఆస్పత్రుల్లో సోమవారం సాయంత్రం ఏడు గంటల తరువాత పోస్టుమార్టం నిలిపివేశారు. నగర పాలక సంస్థ (బీఎంసీ) ఆధ్వర్యంలోని ఆరోగ్య శాఖ తీసుకున్న నిర్ణయంవల్ల మృతుల బంధువులు ఇబ్బందులు పడుతున్నారు. దూరప్రాంతాలు, స్వగ్రామాలకు మృతదేహాలను తరలించేందుకు ఉదయం వరకు వేచిచూడాల్సి వ స్తోంది. లేదంటే మరో ఆస్పత్రిని ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది.
గోరేగావ్‌లోని సిద్ధార్థ్ ఆస్పత్రిలో పోస్టుమార్టం కేంద్రాన్ని నిర్మించినప్పటికీ అక్కడ సిబ్బందిని నియమించకపోవడంతో పోస్టుమార్టం జరగడం లేదు. ఇక పరేల్‌లోని కేం, ముంబెసైంట్రల్‌లోని నాయర్ ఆస్పత్రుల్లో సాయంత్రం తరువాత పోస్టుమార్టం చేయడాన్ని గతంలోనే నిలిపివేశారు. రాజావాడి, జే.జే, భగవతి, కూపర్ ఆస్పత్రుల్లో మాత్రం జరిగేది. అయితే సిబ్బంది కొరత కారణంగా రెండు షిఫ్టుల్లోనూ పోస్టుమార్టం చేయడం సాధ్యపడడం లేదు. కేవలం ఉదయం నుంచి సాయంత్రం వరకూ పోస్టుమార్టం చేస్తున్నారు.
వాస్తవానికి వీటిని 24 గంటలు తెరిచే ఉంచాలంటూ ప్రభుత్వం గతంలోనే ఆదేశించింది. అయితే తాజా పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. అనేక కేంద్రాలు మూసివేయడంతో ఇప్పటికే భగవతి, రాజావాడి ఆస్పత్రులపై అదనపు భారం పడుతోంది. దీనికితోడు ఇక్కడ కూడా సాయంత్రం తర్వాత పోస్టుమార్టం నిలిపివేశారు.