'ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ఎదగాలి'
గూడూరు: ఆర్యవైశ్యులు కేవలం వ్యాపార రంగంలోనే కాకుండా అన్ని రంగాల్లోనూ ఎదిగేందుకు కృషి చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరులోని పీవీఆర్ కల్యాణ మండపంలో ఆదివారం జిల్లా రూరల్ ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా వచ్చిన మంత్రి మాట్లాడుతూ.. మహాత్మాగాంధీ, పొట్టిశ్రీరాములు వంశంలో పుట్టిన మనం వారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు పోవాలన్నారు. నూతనంగా ఎన్నికైన సంఘం సభ్యులు ఎవరైనా ఆర్థికంగా వెనుకబడి ఉంటే వారి అభివృద్ధికి కృషి చేయాలన్నారు. అందుకు తన వంతు సాయం కూడా అందజేస్తానని మంత్రి తెలిపారు.
ఆర్యవైశ్యుల అవసరాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు మంత్రి పదవి ఇచ్చారని తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న కార్యక్రమంలో ఆర్యవైశ్యులంతా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులు ఎదో ఒక పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ రాజకీయంగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిని అన్ని విధాలా ఆదుకోవాలని ఆయన అన్నారు.