గడీల పాలన కూల్చేస్తాం..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గరీబోళ్ల పాలన వస్తుందనుకుంటే గడీల పాలన వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. శుక్రవారం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. గడీల పాలన గోడలు కూల్చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తెలంగాణ విమోచన యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చిందన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాలకు పోకుండా సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు.
కలెక్టరేట్ల ముట్టడి:
విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలనే డిమాండ్‌తో ఈ నెల 11, 12, 13 తేదీల్లో జిల్లా కలెక్టరేట్ల ముట్టడి నిర్వహిస్తామని లక్ష్మణ్ తెలిపారు. బీజేపీ అధికారంలోకి రాగానే వెయ్యి కోట్ల రూపాయలతో స్ఫూర్తి కేంద్రాలు, హైదరాబాద్‌లో స్టాట్యూ ఆఫ్ లిబరేషన్ విగ్రహాన్ని ఏర్పా టు చేస్తామన్నారు. ఈ నెల 11న నిర్వ హించే బహిరంగసభకు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరవుతారన్నారు. కేంద్ర కేబినెట్లో టీఆర్ఎస్ను చేర్చుకోబోమన్నారు. పార్టీ నేతలు జారిపోతారనే భయంతోనే కేంద్ర కేబినెట్లో చేరుతామని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేసుకుంటోందన్నారు.