సోనియాకు కోర్టు సమన్లు అందించిన సిక్కు సంస్థ
అమెరికా ఫెడరల్ కోర్టు జారీచేసిన సమన్లను సోనియా గాంధీకి తాము అందజేసినట్లు సిక్కు సంస్థ తెలిపింది. వైద్య చికిత్స నిమిత్సం న్యూయార్క్ వచ్చిన సోనియాగాంధీకి ఆస్పత్రి సిబ్బంది ద్వారా ఈ నోటీసులు ఇచ్చామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. సిఖ్స్ ఫర్ జస్టిస్ (ఎస్.ఎఫ్.జె.) అనే సంస్థ సోనియాపై కేసు దాఖలుచేసిన విషయం తెలిసిందే. సిక్కు వ్యతిరేక అల్లర్లలో భాగస్వామ్యం ఉన్న కాంగ్రెస్ నాయకులను ఆమె రక్షిస్తున్నారంటూ వారు కేసు దాఖలు చేశారు.
న్యూయార్క్‌లోని స్లోన్-కెటెరింగ్ కేన్సర్ సెంటర్లో చికిత్స తీసుకున్న సోనియాకు సమన్లను అందించారు. ఆస్పత్రిలోని నైట్ షిప్టు నర్సింగ్ సూపర్వైజర్ ఈస్టర్ రూయిజ్ ఈ సమన్లను అందుకున్నట్లు ఎస్.ఎఫ్.జె. అటార్నీ గురుపత్వంత్ ఎస్. పన్నున్ తెలిపారు. అలాగే ఆస్పత్రి సెక్యూరిటీ మేనేజర్ ఆల్విన్ మిల్నర్కు కూడా సమన్ల కాపీని ఇచ్చారు. అమెరికా ఫెడరల్ నిబంధనల ప్రకారం, ఈ సమన్లపై స్పందించేదుకు సోనియాగాంధీకి 21 రోజుల సమయం ఉంటుంది. అయితే, బుధవారం ఉదయానికే సోనియా అమెరికా నుంచి స్వదేశానికి ఢిల్లీ తిరిగి వచ్చిన విషయం తెలిసిందే.