Sikh riots case
-
సిక్కు అల్లర్ల కేసు: బెయిల్ నిరాకరణ
న్యూఢిల్లీ: సిక్కు అల్లర్ల కేసులో యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్న కాంగ్రెస్ నాయకుడు సజ్జన్ కుమార్‌కు బుధవారం సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన కోరిన మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది. సజ్జన్ కుమార్ వైద్య కారణాల రీత్యా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కోరాడు. ఈ నేపథ్యంలో అధికారులు అతనికి ఎయిమ్స్ వైద్యుల చేత పరీక్షలు నిర్వహించారు. అనంతరం వైద్య నివేదికను పరిశీలించిన న్యాయస్థానం అతన్ని ఆసుపత్రిలో చేర్పించాల్సిన అవసరం లేదని పేర్కొంటూ బెయిల్ తిరస్కరించింది. బెయిల్ దరఖాస్తుపై విచారణను జూలైకు వాయిదా వేసింది. ('సిక్కుల ఊచకోత జరిగేది కాదు') సిక్కుల ఊచకోత; దోషిగా సజ్జన్ 1984 అక్టోబరు 31న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీని సిక్కులైన ఆమె వ్యక్తిగత భద్రతా సిబ్బంది సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ కాల్చి చంపారు. ఆ మరుసటి రోజే దేశవ్యాప్తంగా సిక్కుల ఊచకోత జరిగింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఈ అల్లర్లలో దేశవ్యాప్తంగా 3,500 మంది సిక్కులు చనిపోగా, ఒక్క ఢిల్లీలోనే 2,800 మంది సిక్కులు ఊచకోతకు గురయ్యారు. ఇందులో ఢిల్లీలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని అతి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనలో పలువురు నాయకులతోపాటు కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్‌పైనా కేసు నమోదైంది. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు సరైన సాక్ష్యాధారాలు లేక సజ్జన్‌ను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో బాధితులు తీర్పును సవాలు చేస్తూ ఢిల్లీ కోర్టును ఆశ్రయించారు. వీటిపై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు 34 ఏళ్ల తర్వాత 2018 డిసెంబర్లో సజ్జన్‌ను దోషిగా తేలుస్తూ జీవితకాల జైలు శిక్ష విధించింది. ఈ తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సజ్జన్ సుప్రీంకోర్టులో సవాలు చేసిన విషయం తెలిసిందే. (కమల్‌నాథ్‌పై సిక్కు అల్లర్ల కేసు!) -
రాజీవ్ ఆదేశాలతోనే సిక్కుల ఊచకోత
న్యూఢిల్లీ: 1984లో సిక్కులను ఊచకోత కోయాలని రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నపుడు ప్రధాని కార్యాలయం(పీఎంవో) నుంచి ఆదేశాలు వచ్చాయని బీజేపీ గురువారం సంచలన ఆరోపణ చేసింది. ఈ విషయం నానావతి కమిషన్ దృష్టికి వచ్చిందని తెలిపింది. అయితే నానావతి కమిషన్ రిపోర్టు మాత్రం బీజేపీ ఆరోపణలకు భిన్నంగా ఉండటం గమనార్హం. ప్రధాని ఇందిరాగాంధీని 1984 అక్టోబర్ 31న ఆమె అంగరక్షకులైన ఇద్దరు సిక్కులు కాల్చిచంపడంతో ఢిల్లీలో అల్లర్లు చెలరేగాయి. దాదాపు 3,000 మంది అమాయక సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. ‘నానావతి’ రిపోర్టులో ఏముంది? సిక్కుల ఊచకోతపై 2000లో ఎన్డీయే ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ జీటీ నానావతి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను నియమించింది. 2005లో సమర్పించిన ఈ నివేదికలో నానావతి కమిషన్ స్పందిస్తూ.. ‘సిక్కులకు గుణపాఠం చెప్పాలని రాజీవ్ అన్నట్లు వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యం లేదు. ఢిల్లీలో పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు రాజీవ్ కృషి చేశారు. ఇందిర హత్య అనంతరం ప్రజలు శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు’ అని తెలిపింది. దమ్ముంటే ప్రజాసమస్యలపై పోరాడండి: కాంగ్రెస్ బీజేపీ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడింది. ప్రస్తుతం 2019 ఎన్నికలు జరుగుతున్నాయే తప్ప 1951, 1966, 1984 లోక్‌సభ ఎన్నికలు జరగడం లేదు. దమ్ముంటే నిజమైన ప్రజా సమస్యలపై పోరాడండి. మోదీ పెద్ద అబద్దాలకోరుగా మారిపోయారు’ అని ఆగ్రహం వ్యక్తం చేసింది. సిక్కు వ్యతిరేక అల్లర్లలో దోషిగా తేలిన కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు గతేడాది డిసెంబర్లో యావజ్జీవ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. -
సుప్రీంకోర్టులో సజ్జన్ కుమార్ పిటిషన్
న్యూఢిల్లీ: 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో యావజ్జీవశిక్ష ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ మాజీ నేత సజ్జన్ కుమార్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆయన అత్యున్నత న్యాయస్థానంలో శనివారం పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు ఈ కేసులో సిక్కుల తరఫు న్యాయవాది హెచ్.ఎస్.ఫూల్కా మీడియాతో మాట్లాడుతూ.. సిక్కుల ఊచకోత వ్యవహారంలో తాము గతంలోనే సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశామని తెలిపారు. దీంతో సజ్జన్ కుమార్ పిటిషన్‌పై కోర్టు రిజిస్ట్రీ ద్వారా తమకు సమాచారం అందిందన్నారు. -
సోనియాపై ఫిర్యాదును కొట్టివేసిన అమెరికా కోర్టు
న్యూయార్క్:కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో సిక్కు హక్కుల గ్రూపు దాఖలు చేసిన సవరణ పిటీషన్ ను అమెరికా కోర్టు తిరస్కరించింది. అమెరికాలోని సిక్స్ ఫర్ జస్టిస్(ఎస్ జేఎఫ్) అనే సంస్థ 1984 నాటి సిక్కు అల్లర్లకు సంబంధించి సోనియా గాంధీపై మానవ హక్కుల ఉల్లంఘన ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో ఈ పిటీషన్ ను విచారించిన యూఎస్ జిల్లా కోర్టు న్యాయమూర్తి బ్రియాన్ కోగెన్ సరైన ఆధారాలు లేవంటూ కొట్టిపారేశారు. తాజాగా ఎస్ జేఎఫ్ ప్రతినిధులు సోనియా గాంధీపై సవరణ ఫిర్యాదు చేయాలంటూ కోగెన్ కు లేఖ రాశారు. దీనిపై కోగెన్ స్పందిస్తూ.. ఈ కేసులో తుది తీర్పు వెలువడిందని, తదుపరి విచారణకు సరైన ఆధారాలు లేవంటూ ఎస్ జేఎఫ్ విజ్ఞప్తిని తిరస్కరించారు.