silverjublee
-
అమెరికాలో మా వేడుకలు
మా (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఏప్రిల్ 28న అమెరికాలో నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా మాట్లాడుతూ– ‘‘ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్– తిరుమల ప్రొడక్షన్స్ సంయుక్తగా అమెరికాలో ఈ వేడుక నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమానికి చిరంజీవిగారు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. మే నెలలో జరిగే ఓ ఈవెంట్‌కు మహేశ్‌బాబు వస్తానన్నారు. హీరోయిన్లు కచ్చితంగా ‘మా’లో మెంబర్షిప్ తీసుకోవాలి. ఏదైనా సమస్య వచ్చినప్పుడే ‘మా’ ముందుకు వస్తున్నారు. ఒక చేతితో ‘మా’ మెంబర్ షిప్ ఫారమ్, మరో చేతితో ఫిర్యాదు ఫారమ్ తీసుకొస్తున్నారు. ‘మా’ సిల్వర్ జూబ్లీ సందర్భంగా 35 మందికి ఈ నెల నుంచి 3000 పెన్షన్ అందేలా చర్యలు తీసుకుంటున్నాం’’ అన్నారు. ‘మా’ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, జనరల్ సెక్రటరీ నరేష్, కార్యవర్గ సభ్యుడు సురేష్, అమెరికా ఈవెంట్ ఆర్గనైజర్లలో ఒకరైన రాధాకృష్ణ రాజా, స్టీఫెన్ పల్లామ్ (అమెరికా), రాంబాబు కల్లూరి (అమెరికా), నిఖిల్ నాంచారి (అమెరికా), ‘మా’ వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ, కల్చరల్ కమిటీ చైర్మన్ సురేశ్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. -
ఆయనే నిజమైన కళాకారుడు – కైకాల సత్యనారాయణ
‘‘ఆ ఈశ్వరుడికి, కళకు సంబంధం ఉంది. కళలో ఈశ్వర శక్తి ఉంది. అందుకే కళలను ప్రేమిస్తాను. ఆరాధిస్తాను. కళాకారులపై అభిమానంతో, వారిని అభినందించి సత్కరిస్తాను. దీనికి రాజకీయంతో సంబంధం లేదు. కళలను ఆరాధిస్తూ అందర్నీ ప్రేమిస్తూ, అజాత శత్రువుగా ఉండాలన్నదే జీవితంలో నా కోరిక అన్నారు’’ కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి. మహా శివరాత్రి సందర్భంగా విశాఖ సముద్ర తీరాన టీయస్సార్ ఆధ్వర్యంలో కోటి శివలింగాల ప్రతిష్ట, మహా కుంభాభిషేకం కార్యక్రమం ఈ నెల 13న జరగనుంది. ఈ సందర్భంగా సీనియర్ నటులు కైకాల సత్యనారాయణకు ‘విశ్వనట సమ్రాట్ బిరుదు’ ప్రదానం చేయనున్నారు. అలాగే యశ్ చోప్రా స్మారక జాతీయ అవార్డును ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకల వివరాలను హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో టి. సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ – ‘‘కోటి లింగాల ప్రతిష్ట, మహా కుంభాభిషేకం కార్యక్రమం ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయింది. ఫిబ్రవరి 13న సిల్వర్ జూబ్లీ చేయనున్నాం. ఆ రోజు 7 గంటలకు ప్రారంభమయ్యే అభిషేకం మధ్యాహ్నం మూడు గంటల వరకు సాగుతుంది. అలాగే సాయంత్రం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు శివజాగారం కొరకు భక్తి రస కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. దాదాపు వెయ్యి చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించారు. ఎన్టీఆర్ వంటి గ్రేట్ ఆర్టిస్ట్‌తో వర్క్ చేశారు. ఆయనకు ‘విశ్వనట సమ్రాట్’ బిరుదును ప్రదానం చేయనున్నాం. స్వర్ణకంకణ ఘనసన్మానం కూడా జరుగుతుంది. యశ్ చోప్రాగారు దేశం గర్వించదగ్గ ఫిల్మ్‌మేకర్. ఆయనతో కలిసి ‘చాందినీ, లమ్హే’ లాంటి చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నందుకు ఆనందంగా ఉంది. ఆయన జ్ఞాపకార్థం 2014లో ప్రారంభించిన యశ్ చోప్రా స్మారక జాతీయ పురస్కారాన్ని ఈ ఏడాది గాయని ఆశా భోంస్లేకు అందజేయాలని జ్యూరీ కమిటీ నిర్ణయించింది. త్వరలో మహబూబ్‌నగర్‌లో కాకతీయ కళా వైభోత్సవాన్ని నిర్వహించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మహాశివరాత్రి రోజున ప్రజల సమక్షంలో విశ్వనట సమ్రాట్ బిరుదుతో నన్ను సత్కరించనుండటం ఆనందంగా ఉంది. కళాకారులు గౌరవాన్ని కోరుకుంటారు. ఏమీ ఆశించకుండా డబ్బును కళాసేవకు వినియోగిస్తున్నారు టి.సుబ్బరామిరెడ్డిగారు. ఆయనే నిజమైన కళాకారుడు. కళామతల్లి ముద్దుబిడ్డ అన్నది నా ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలి. నాకు పద్మశ్రీ, పద్మ విభూషణ్ కంటే ఈ అవార్డు గొప్పదని నేను భావిస్తున్నాను’’ అన్నారు కైకాల సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, పరుచూరి వెంకటేశ్వరరావు, పద్మినీ కొల్హాపురి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా మా వేడుకలు
‘‘1993లో స్థాపించిన ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఈరోజు మంచి స్థానంలో ఉంది. మా’కి సొంత భవనం, ఓల్డేజ్ హోమ్ కోసం ప్రభుత్వం నుంచి స్థలం ఇప్పిస్తాం. పేద కళాకారులకు మేజర్ ట్రీట్మెంట్కు సీఏం సహాయనిధి నుంచి డబ్బులు వచ్చేలా చూస్తా. చిత్రపురి కాలనీలో ఇంకొంత మందికి సొంత ఇళ్లు రావాల్సి ఉంది. వాళ్లకు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వాళ్లతో పాటు సినిమా జర్నలిస్టులను కూడా కలుపుకుని ముందుకు వెళ్తే మంచిదని భావిస్తున్నా’’ అని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ‘మా’ 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలు ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. ‘‘విదేశాల్లోనూ ఈ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నాం. అందుకు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేశ్‌బాబు, రామ్‌చరణ్ తదితరులు సహకరిస్తామన్నారు’’ అని సోమవారం జరిగిన కర్టన్ రైజర్ ప్రోగ్రామ్‌లో ‘మా’ అధ్యక్షుడు శివాజీరాజా అన్నారు. 2018 ‘మా’ డైరీని తలసాని ఆవిష్క రించారు. సీనియర్ నటులు కృష్ణ, కృష్ణంరాజు, జమున, శారద తదితర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. -
నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలి
- ఎన్సీసీ గ్రూప్ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ - ఘనంగా సిల్వర్ జూబ్లీ కళాశాల వార్షికోత్సవం కర్నూలు(అర్బన్): విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవరుచుకోవాలని ఎన్సీసీ కర్నూలు గ్రూప్ కమాండర్ కల్నల్ పీజీ కృష్ణ అన్నారు. సిల్వర్ జూబ్లీ కళాశాల వార్షికోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థి దశలో ఒత్తిడి సహజమని దాన్ని అధిగమిస్తే విజయం సొంతమవుతుందన్నారు. కార్యక్రమంలో శ్రీశైలం ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్, కళాశాల పూర్వ విద్యార్థి సుబ్బారెడ్డి, సిల్వర్ జూబ్లీ ఫ్రెటర్నిటీ అధ్యక్షుడు డాక్టర్ జీవీ రమణయ్య, కళాశాల ప్రిన్సిపాల్ అబ్దుల్ ఖాదర్, వైస్ ప్రిన్సిపాల్ సునీత పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.