అనంతగిరిలో టెర్రర్ క్యాంప్!
ఉగ్ర శిబిరం ఏర్పాటుకు కుట్ర
► సిమీ చీఫ్ సఫ్దార్ నగోరీపై సిట్‌లోనూ కేసు
► 2008లో నగరానికి వచ్చి వెళ్లిన సఫ్దార్
► జీవితఖైదు విధించిన ఇండోర్ కోర్టు
సాక్షి, హైదరాబాద్: నిషేధిత ‘స్టూడెంట్స్ ఇస్లామిక్ మూవ్మెంట్ ఆఫ్ ఇండియా’(సిమీ) చీఫ్ సఫ్దార్హుసేన్ నగోరీ... దేశద్రోహం కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్ ఇండోర్‌లోని ప్రత్యేక న్యాయస్థానం సఫ్దార్కు సోమవారం జీవిత ఖైదు విధించింది. గతంలో ఈ నగోరీ నగరయువతనూ ఉగ్రవాదం వైపు మళ్లించడానికి యత్నించాడు. నగర శివారులోని అనంతగిరిలో ఉగ్రవాద శిక్షణ శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. ఈ మేరకు నగోరీపై సిటీలోనూ ఓ కేసు ఉంది. ఇలా చేయడం ద్వారా దేశంపై యుద్ధానికి యత్నించారనే ఆరోపణలపై నగర నేర పరిశోధన విభాగం అధీనంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) 2008లో ఈ కేసును నమోదు చేసింది. కోర్టు జీవిత ఖైదు విధించిన నేపథ్యంలో సిటీ పోలీసులు 2008 నాటి కేసు పూర్వాపరాలను పరిశీలించారు. సిమీకి ఆలిండియా చీఫ్‌గా వ్యవహరించిన సఫ్దార్పై దేశవ్యాప్తంగా అనేక కేసులున్నాయి. ఉగ్రవాద చర్యలకు పాల్పడడం, ప్రేరేపించడం, దేశద్రోహం తదితర ఆరోపణలపై ఇవి నమోదయ్యాయి.
నగరంలో అనువైన ప్రాంతం కోసం గాలింపు...
సిమీ ముసుగులో ఉగ్రవాదుల్ని తయారు చేయడానికి అనేక ప్రయత్నాలు చేసిన నగోరీ దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశాడు. మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో ఈ శిబిరాలు పూర్తి చేసిన నగోరీ తదితరులు అనేక మందిని ఉగ్రవాదులుగా తయారు చేశారు. అనంతరం 2007లో ఇతడి కన్ను హైదరాబాద్‌పై పడింది. స్థాని కంగా ఉన్న కొందరి సహకారంతో నగర యువతనూ ఉగ్రవాదం వైపు మళ్లించడానికి కుట్ర పన్నాడు. ఆ ఏడాది మేలో హైదరాబాద్ వచ్చి వెళ్లిన నగోరీ... ఉగ్ర శిబిరం ఏర్పాటుకు అనువైన ప్రాంతం కోసం గాలించాడు. నగర శివార్లలో ఉన్న అనంతగిరి అడవుల్ని సందర్శించిన ఇతగాడు అక్కడే శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించాడు. 2008 మార్చి 27న నగోరీ సహా అతడి అనుచరుల్ని మధ్యప్రదేశ్ పోలీసులు ఇండోర్‌లో అరెస్టు చేశారు. అతడిని విచారించిన ఇండోర్ పోలీసులు హైదరాబాద్‌నూ టార్గెట్ చేసినట్లు గుర్తించారు.
అనుమానితుడి అరెస్టుతో వెలుగులోకి...
2008 సెప్టెంబర్‌లో నగర పోలీసులు ఓ అనుమానితుడిని అరెస్టు చేసి విచారించిన తరువాత గానీ... సఫ్దార్ ఇక్కడకు వచ్చి వెళ్లిన విషయం వెలుగులోకి రాలేదు. సఫ్దార్తో పాటు అతడి సోదరుడు, అనుచరుల రాకపోకలు, అనంతగిరి ‘టూర్’విషయాలు బయటపడ్డాయి. దీంతో సిట్ అధికారులు ఆ కేసులో నగోరీతో పాటు మిగిలిన వారినీ నిందితులుగా చేర్చారు. అప్పట్లో ఇండోర్ జైల్లో ఉన్న నగోరీ తదితరుల్ని పీటీ వారంట్‌పై సిటీకి తీసుకువచ్చి అరెస్టు చేయాలని సిట్ అధికారులు భావించారు. అయితే అరెస్టయిన నిందితుడు చెప్పిన వివరాలు మినహా ఇతర ఆధారాలు లభించకపోవడంతో ఇది కార్యరూపంలోకి రాలేదు. ఇండోర్ కోర్టు సోమవారం నగోరీతో సహా 10 మందికి జీవితఖైదు విధించడంతో సిటీ పోలీసులు నాటి కేసు పూర్వాపరాలను పరిశీలించారు.