simple wedding
-
హైదరాబాద్‌లో పెరుగుతున్న ఎకో వెడ్డింగ్ కల్చర్..
సాక్షి, హైదరాబాద్: పెళ్లంటే ఇద్దరు కలిసి జీవితం గడపడం అంతే తప్ప కన్నవాళ్లని కష్టాల్లోకి నెట్టడం కాదు...పెళ్లంటే ఇద్దరు భవిష్యత్తును అందంగా ఊహించుకోవం ఒక్కటే కాదు భావితరాలకు మంచి సందేశం ఇవ్వడం కూడా.. అనుకున్నారు నగర యువతి స్ఫూర్తి కొలిపాక. అందుకే తన పెళ్లిని అంగరంగ వైభవంగా కాక ఆదర్శవంతంగా మార్చారు. పర్యావరణ ప్రేమికురాలైన స్ఫూర్తికి ఇటీవలే కేన్సర్ బయాలజీలో పీహెచ్డీ చేసిన ప్రశాంత్‌తో వివాహం జరిగింది ఆర్థికంగా మంచి పరిస్థితిలో ఉన్నా... పూర్తిగా లో బడ్జెట్లో అది కూడా పర్యావరణ హితంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది..ఈ రకమైన పెళ్లి కోసం తన తల్లిదండ్రులను బంధువులు/స్నేహితులను సిద్ధం చేయడానికి తనకు కనీసం సంవత్సరం పట్టిందని అంటున్నారు. ఆమె పంచుకున్న తన ఎకో–వెడ్డింగ్ విశేషాలు... ► అతిథులకు వాట్సాప్ లేదా వీడియో కాల్ల ద్వారా మాత్రమే ఈ–ఆహ్వానాలను పంపించారు. ►పెళ్లికి ముందు జరిగే కార్యక్రమాలన్నీ ఇంట్లోనే ఏర్పాటు చేసుకున్నారు. దీని కోసం సాంప్రదాయ పందిరిని ఎంచుకున్నారు స్థానిక టెంట్ హౌస్ నుంచి కొన్ని అదనపు కుర్చీలను మాత్రం అద్దెకు తీసుకున్నారు. ఇంటి లోపల అదనపు అలంకరణ ఏమీ చేయలేదు. ఇంటి నిండా మొక్కలు, వినోదం, నవ్వు సంగీతం తప్ప. ►పెళ్లి షామీర్‌పేట్‌లోని ఓ గ్రీన్ ఫామ్స్‌లో జరిగింది – గదులు/ ఓపెన్–ఎయిర్ లాన్లు/ డైనింగ్ స్పేస్/ పిల్లల కోసం ప్లే ఏరియాతో కూడిన అందమైన 5 ఎకరాల ఫామ్ హౌస్ –24 గంటలకు కేవలం 55,000/మాత్రమే చెల్లించినట్లు స్ఫూర్తి చెప్పారు. ►ఉదయం పెళ్లి అయినందున, విద్యుత్ తోరణాలు, లైటింగ్/ఏసీ తదితర అనవసరమైన వినియోగాన్ని పూర్తిగా తగ్గించారు. ఉదయపు వెలుతురు ఆహ్లాదకరమైన గాలి బాగా వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ►పెళ్లి మండపాన్ని స్థానికంగా లభించే పూలతో పూర్తిగా అలంకరించారు. అలాగే సహజంగా పెరిగిన చెట్లను నేపథ్యంగా ఉపయోగించారు! ►అతిథుల కోసం వేదికను సూచించడానికి దారి పొడవునా ఫ్లెక్సీ బ్యానర్లను చేయకుండా కాన్వాస్‌ను ఉపయోగించారు. ►ఎంతో కాలంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఉపయోగించని ఆమె తన పెళ్లికి జీరో–ప్లాస్టిక్ బాటిల్ పాలసీని అమలు చేశారు. వివాహ ఆహ్వానంలోనే అతిథులు తమ సొంత వాటర్ బాటిల్‌ను తెచ్చుకోవాలని కోరారు. అలాగే ప్లాస్టిక్‌తో చుట్టబడిన బహుమతులు వద్దని తదితర పర్యావరణ హితమైన సూచచనలతో ప్రత్యేకంగా ఓ పేజీ జతచేశారు. ►విందులోకి పూర్తిగా సహజమైన కాయగూరలు, ఆకుకూరలతో పూర్తి సాంప్రదాయ తెలుగు భోజనాన్ని ఎంచుకున్నారు అది కూడా పచ్చని అరటి ఆకులపై మాత్రమే వడ్డించారు. వ్యయాన్ని తగ్గించారిలా... ►వధువు, వరుని కుటుంబాలు ఇచ్చి పుచ్చుకునే కట్నకానుకల్ని పూర్తిగా రద్దు చేసుకున్నారు. కన్యాదాన్ అప్పగింతలు ఆచారాలు అలాగే మహిళలకు ప్రత్యేకమైన వివాహ గుర్తులను వద్దని నిర్ణయం తీసుకున్నారు. పెళ్లి కోసం కొన్ని సాంప్రదాయ చేనేత వస్త్రాలను మాత్రమే ఎంచుకున్నారు. ఆమె పెళ్లి చీర అదీ చేనేత స్టాల్లో కేవలం 1,000/ మాత్రమే వెచ్చించి కొనుగోలు చేశారు. ►అభివృద్ధి చెందుతున్న ఎకోఫెమినిస్ట్గా, అన్ని రకాల కట్నాలు/ కట్నాలను వ్యతిరేకించాలని స్ఫూర్తి యువతను కోరుతున్నారు. చాలామంది వధువు కుటుంబం వరుడికి ఇచ్చే కట్నం గురించి మాత్రమే మాట్లాడతారు, కానీ వరుడి సోదరీమణులకు బహుమతులు, ఆడపడుచు కట్నం, సమీప బంధువులు వారి పిల్లలకు బట్టలు, బట్టల కట్నాలు, రిటర్న్ బహుమతులు, మొదలైనవి ఇవన్నీ వధువు కుటుంబాల ఆర్థిక భారాన్ని పెంచేవేనని ఇవి మానేస్తే వ్యయాన్ని తగ్గిస్తాయి. ► అంతేకాదు పర్యావరణానికి మేలు చేస్తాయనీ అంటున్నారామె. నగరంలో సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి, సోషల్ వర్క్ కోసం పలు రాష్ట్రాల్లో పర్యటించిన సందర్భంగా తన అనుభవాలే తనను పర్యావరణ ప్రియురాలిగా మార్చాయని, సామాజిక మాధ్యమాలతో పాటు వీలున్నన్ని మార్గాల ద్వారా తన వంతు కృషి చేస్తానని అంటున్నారు. -
దావత్, బారాత్‌లు బంద్.. ఇక సాదాసీదాగానే పెళ్లిళ్లు!!
జోధ్‌పూర్: భారీగా విందు భోజనాలు, తాహతుకు మించి ఆడంబరాలు, అలంకరణలకు స్వస్తి చెప్పాలని రాజస్తాన్‌లోని పాలికి చెందిన రెండు వర్గాల వారు నిర్ణయించుకున్నారు. డీజేలు ఉపయోగించవద్దని, టపాసులను కాల్చరాదని, పెళ్లి కొడుకు గుర్రంపై ఊరేగుతూ రాకూడదని కట్టుబాటు విధించారు. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ నడుస్తోంది. కుమావట్, జాట్ కులాలకు చెందిన 19 గ్రామాలకు చెందిన నేతలు ఈనెల 16వ తేదీన ఈ మేరకు అంగీకారానికి వచ్చారు. అంతేకాదు.. వధూవరులకు బంధువులు కానుకగా ఇచ్చే నగలు, దుస్తులు, నగలు తదితరాలపైనా పరిమితి పెట్టారు. ఇక పవిత్ర కార్యంగా భావించే పెళ్లిలో వరుడు గడ్డం పెంచుకుని ఉండరాదని రూల్ విధించారు. వివాహ వేడుకల్లో అలంకరణలు, సంగీత కార్యక్రమాలు, ఇతర సంప్రదాయాల పేరిట అనవసరంగా ఖర్చు చేసి, అప్పుల పాలు కారాదన్నదే తమ ఉద్దేశమన్నారు. వీటిని అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందే. అతిక్రమించే వారిపై జరిమానా ఇతర శిక్షలు విధిస్తాంమని హెచ్చరించారు. అదేవిధంగా, పాలిలోని రోహెత్ సబ్‌డివిజన్‌లోని ఐదు గ్రామాలకు చెందిన జాట్ కమ్యూనిటీ కూడా వివాహ కార్యక్రమాలను హుందాగా చేయడానికి నిబంధనలను రూపొందిందించాయి. బారాత్‌లు బంద్ చేశాయ్. -
రూ.18 వేలతో ఐఏఎస్ కుమారుడి పెళ్లి!
విశాఖపట్నం: మామూలుగా పెళ్లికి ఎంత ఖర్చవుతుంది అంటే.. సమాధానం లక్షలు రూపాయలు అని సమాధానం వస్తుంది. ఇక ప్రభుత్వ ఉన్నతాధికారులైతే తమ హోదాకు తగ్గకుండా లక్షలు ఖర్చు చేస్తుంటారు. కానీ సీనియర్ ఐఏఎస్ అధికారి పట్నాల బసంత్ కుమార్ అందరిలా కాదు. పెద్ద ఉద్యోగంలో ఉండికూడా తన కుమారుడికి పెళ్లికి కేవలం 18 వేల రూపాయలు మాత్రమే ఖర్చు చేస్తున్నారు. ఇదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? నగరంలోని విశాలాక్షినగర్ దయాల్‌నగర్‌కాలనీలో నివాసం ఉంటున్న బసంత్ కుమార్.. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ(వీఎంఆర్డీఏ) చైర్మన్‌గా పనిచేస్తున్నారు. ఆయన కుమారుడు అభినవ్ మానస్ వివాహం ఈ నెల 10న డాక్టర్ లావణ్యతో జరగనుంది. ఈ వివాహానికి వరుడి తండ్రి రూ. 18 వేలు మాత్రమే ఖర్చు చేస్తుండడం విశేషం. రాధాసోమి సత్సంగ్ నియమాలు పాటించే ఆయన 2017లో కుమార్తె బినతి పెళ్లికి కేవలం రూ.16,100 మాత్రమే ఖర్చుపెట్టారు. కుమారుడి వివాహానికి కూడా ఇదేవిధంగా ఏర్పాట్లు చేశారు. ఒక్కో పెళ్లి శుభలేఖకు ఐదు రూపాయలు వెచ్చించారు. వందలోపే అతిథులను ఆహ్వానించారు. పుష్పగుచ్చాలు, కానుకలు అంగీకరించబోమని శుభలేఖలో స్పష్టం చేశారు. పురోహితుడికి రూ. 1000, వంటమనిషికి రూ. 500 ఇవ్వనున్నారు. తమ కాలనీలో పండించే తోట నుంచి వంటకు కావాల్సిన కూరగాయాలు తెచ్చుకోనున్నారు. మొత్తానికి పెళ్లి భోజనం కోసం ఒక్కొక్కరికి కేవలం రూ. 13 వెచ్చిస్తున్నారు. కళ్యాణ వేదిక వుడా చిల్డ్రన్ ఎరీనాకు రూ.వెయ్యి చెల్లించారు. పెళ్లికి వచ్చే అతిథులు సత్సంగ్ నిబంధనల ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. కూర్చోవడానికి కుర్చీలు ఉండవు. నేల మీదే కూర్చొవాల్సి ఉంటుంది. కుమారుడి పెళ్లికి బసంత్ కుమార్ ఒక్కరోజు కూడా సెలవు పెట్టకపోవడం విశేషం. గవర్నర్ దంపతుల ఆశీస్సులు వివాహం పవిత్రమైన బంధమని ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అన్నారు. వీఎంఆర్డీఏ చైర్మన్ బసంత్‌కుమార్ కుమారుడు అభినవ్మానస్ వివాహం సందర్భంగా నగరంలోని విశాలాక్షినగర్ దయాల్‌నగర్‌కాలనీలో శుక్రవారం రాత్రి ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి సతీమణితో కలసి హాజరైన గవర్నర్ కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. గవర్నర్ దంపతులు ముందుగా ఇక్కడి పార్కులో మొక్కలు నాటారు. రాధాస్వామి మందిరంలో నిర్వహించిన సత్సంగంలో కొంతసేపు పాల్గొన్నారు. అనంతరం బ్యాటరీ వాహనంలో కాలనీ అంతా సందర్శించారు. కాలనీ పద్ధతులు, విశేషాలు, ఇక్కడ కట్టుబాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. కాబోయే దంపతులు సమాజంలో మంచి జీవితాన్ని గడపాలని ఆశీర్వదించారు. స్టీల్ ప్లాంట్ చైర్మన్ పీకే రత్, కాలనీ పెద్దలు పాల్గొన్నారు. -
అందరికీ ఆదర్శంగా నిలిచిన మంత్రి!
బెంగళూరు: ఉన్నవాళ్లూ లేనివాళ్లూ అందరూ ఖర్చుకు వెనకాడకుండా అతిగా ఖర్చు చేసి పెళ్లిళ్లు చేసే ఈ రోజులలో ఓ మంత్రి తన కుమార్తె వివాహాన్ని అతి నిరాడంబరంగా చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ తన కుమార్తె వివాహాన్ని ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సాధారణంగా నిర్వహించారు. తన కుమార్తె కోసం దాచిన మొత్తంతో సామూహిక వివాహాలను నిర్వహించారు. అదే వేదికపై తన కుమార్తె వివాహాన్ని సైతం జరిపించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆ కుమార్తెను కూడా అందరూ అభినందించారు. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ స్వయంగా సామూహిక వివాహాలు నిర్వహించడంతో పాటు తన కుమార్తె పెళ్లి కూడా అందులో జరిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన కుమార్తె వివాహాన్ని ఘనంగా.. అంగరంగ వైభవంగా నిర్వహించకుండా పేదల మధ్యే ఎలాంటి హంగూ.. ఆర్భాటాలకు తావివ్వకుండా నిరాడంబరంగా చేపట్టారు. చిత్రదుర్గం జిల్లా హొళల్కెరె పట్టణంలోని కొట్రనంజప్ప కాలేజీ ఆవరణలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, మఠాధీశులు హాజరయ్యారు. చిత్రదుర్గం : జిల్లా హొళల్కెరె పట్టణంలోని కొట్రనంజప్ప కాలేజీ ఆవరణంలో బుధవారం సామూహిక వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి జే.ఆంజనేయ నేతత్వంలో 97 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తన కుమార్తె అనుపమతో శాశ్వత్ వివాహం కూడా జరిపించారు. పేద కుటుంబాలకు చెందిన వారి పెళ్లిళ్లతో పాటు మంత్రి కూతురు పెళ్లి జరగ డంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు మఠాధీశులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ సామూహిక వివాహాలు జరిపించడంతో పాటు ఇదే వేదికపై మంత్రి తన కుమార్తె పెళ్లి కూడా జరిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం నూతన వధువరులను సీఎం, మఠాధీశులు ఆశీర్వదించారు. కాగా ఈ సామూహిక వివాహాల్లో పాల్గొన్న జంటలకు ఒక్కొక్క జెర్సీ ఆవును కానుకగా అందించడం గమనార్హం.