మంత్రి జే ఆంజనేయ కుమార్తె అనుపమ, అల్లుడు శాశ్వత్‌ను అభినందిస్తున్న సీఎం సిద్దరామయ్య
బెంగళూరు: ఉన్నవాళ్లూ లేనివాళ్లూ అందరూ ఖర్చుకు వెనకాడకుండా అతిగా ఖర్చు చేసి పెళ్లిళ్లు చేసే ఈ రోజులలో ఓ మంత్రి తన కుమార్తె వివాహాన్ని అతి నిరాడంబరంగా చేశారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ తన కుమార్తె వివాహాన్ని ఎలాంటి ఆర్భాటం లేకుండా చాలా సాధారణంగా నిర్వహించారు. తన కుమార్తె కోసం దాచిన మొత్తంతో సామూహిక వివాహాలను నిర్వహించారు. అదే వేదికపై తన కుమార్తె వివాహాన్ని సైతం జరిపించారు. అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆ కుమార్తెను కూడా అందరూ అభినందించారు.
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి ఆంజనేయ స్వయంగా సామూహిక వివాహాలు నిర్వహించడంతో పాటు తన కుమార్తె పెళ్లి కూడా అందులో జరిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన కుమార్తె వివాహాన్ని ఘనంగా.. అంగరంగ వైభవంగా నిర్వహించకుండా పేదల మధ్యే ఎలాంటి హంగూ.. ఆర్భాటాలకు తావివ్వకుండా నిరాడంబరంగా చేపట్టారు. చిత్రదుర్గం జిల్లా హొళల్కెరె పట్టణంలోని కొట్రనంజప్ప కాలేజీ ఆవరణలో బుధవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి, మంత్రులు, మఠాధీశులు హాజరయ్యారు.
చిత్రదుర్గం : జిల్లా హొళల్కెరె పట్టణంలోని కొట్రనంజప్ప కాలేజీ ఆవరణంలో బుధవారం సామూహిక వివాహాలు అంగరంగ వైభవంగా జరిగాయి. రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి జే.ఆంజనేయ నేతత్వంలో 97 జంటలకు ఉచిత సామూహిక వివాహాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో మంత్రి తన కుమార్తె అనుపమతో శాశ్వత్ వివాహం కూడా జరిపించారు. పేద కుటుంబాలకు చెందిన వారి పెళ్లిళ్లతో పాటు మంత్రి కూతురు పెళ్లి జరగ డంతో రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో పాటు పలువురు మఠాధీశులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సిద్ధరామయ్య మాట్లాడుతూ సామూహిక వివాహాలు జరిపించడంతో పాటు ఇదే వేదికపై మంత్రి తన కుమార్తె పెళ్లి కూడా జరిపించడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం నూతన వధువరులను సీఎం, మఠాధీశులు ఆశీర్వదించారు. కాగా ఈ సామూహిక వివాహాల్లో పాల్గొన్న జంటలకు ఒక్కొక్క జెర్సీ ఆవును కానుకగా అందించడం గమనార్హం.