‘సౌర’ విధానం ఔరా!
సరళీకృత విధానాలతో
రాష్ట్ర సౌర విద్యుత్ పాలసీ
సింగిల్ విండో ద్వారా ప్రాజెక్టుల అనుమతులు
స్టాంపు డ్యూటీ,
వ్యాట్ తిరిగి చెల్లింపు
21 రోజుల్లో
రూఫ్ టాప్ అనుమతులు
హైదరాబాద్: రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు, సోలార్ పార్కుల ఏర్పాటుకు ముందుకు వచ్చే సంస్థలకు సింగిల్ విండో విధానంలో సత్వర అనుమతులు జారీ కానున్నాయి. సౌర విద్యుత్ ఉత్పాదకతను పెంచేం దుకు రాయితీలను ప్రకటించడంతోపాటు అనుమతుల ప్రక్రియను సరళీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ‘తెలంగాణ సౌర విద్యుత్ విధానం-2015’ను ప్రకటించింది. సింగిల్ విండో అనుమతులకు సంబంధించిన విధివిధానాలను మరో 30 రోజుల్లో విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు ప్రకటించనున్నా యి. అనుమతుల పర్యవేక్షణకు డిస్కంలు సోలార్ పాలసీ సెల్ (ఎస్పీసీ)ను ఏర్పాటు చేయనున్నాయి.
అనుమతులిచ్చిన ప్రాజెక్టుల పురోగతిని పర్యవేక్షించేందుకు ఇంధనశాఖ కార్యదర్శి నేతృత్వంలో ఉన్నతస్థాయి కమిటీ పనిచేయనుంది. ప్రాజెక్టు అనుమతుల కోసం మెగావాట్‌కు రూ. 10 వేల చొప్పున గరి ష్టంగా రూ. 2 లక్షల రుసుమును డిస్కంలు వసూలు చేయనున్నాయి. ఈ విధానం ఐదేళ్లపాటు అమలులో ఉండనుంది. ఐదేళ్ల వ్యవధి లో పూర్తై ప్రాజెక్టులకు నిర్మాణం పూర్తై నాటి నుంచి 10 ఏళ్లపాటు రాయితీలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లో పేర్కొన్న నిర్దిష్ట వ్యవధి లేదా దరఖాస్తు చేసుకున్న రెండేళ్లలోపు ఉత్పత్తి ప్రారంభించిన సొలార్ ప్రాజెక్టులు/పార్కులకే ఈ ప్రోత్సాహకాలు వర్తించనున్నాయి.
అనుమతులు సరళీకృతం.. రాయితీల వెల్లువ
ప్రాజెక్టుల కోసం సేకరించే వ్యవసాయ భూములను పారిశ్రామిక భూములుగా మార్చేందుకు నిర్ణీత రుసుమును సోలార్ పాలసీ సెల్ (ఎస్పీసీ)కు చెల్లిస్తే సరిపోనుంది. ఇతర అనుమతులు అవసరం లేదు.
భూగరిష్ట పరిమితి చట్టం నుంచి సౌర విద్యుత్ ప్రాజెక్టులకు మినహాయింపు. మెగావాట్‌కు గరిష్టంగా 5 ఎకరాల వరకు సేకరించవచ్చు.
స్వీయ వినియోగంపై ఉత్పత్తిదారులకు (కాప్టివ్ యూజ్) రాష్ట్రం లోపల వీలింగ్, ట్రాన్స్మిషన్ చార్జీల మినహాయింపు. ట్రాన్స్మిషన్ నష్టాల చార్జీలు మాత్రం వర్తిస్తాయి.
ఎలక్ట్రిసిటీ డ్యూటీ మినహాయింపు
ఐదేళ్ల వరకు క్రాస్ సబ్సిడీ సర్‌చార్జీల మినహాయింపు.
ట్రాన్స్‌కో/డిస్కంల లైన్లతో కొత్త ప్రాజెక్టులను అనుసంధానించే బాధ్యత ఆయా పారిశ్రామికవేత్తలదే.
గ్రామ పంచాయతీలకు చెల్లించాల్సిన అభివృద్ధి, లేఔట్ చార్జీలపై ఎకరాకు రూ. 25 వేల వరకు మినహాయింపు.
ప్రాజెక్టులకు కావాల్సిన అన్ని పరికరాలు/సామగ్రిపై 100 శాతం వ్యాట్/ఎస్జీఎస్టీ పన్నును ప్రభుత్వం ఐదేళ్ల వరకు తిరిగి చెల్లిస్తుంది.
ప్రాజెక్టు భూముల కొనుగోళ్లపై 100 శాతం స్టాంపు డ్యూటీ తిరిగి చెల్లింపు.
పీసీబీ నుంచి వారంలో పర్యావరణ అనుమతులు.
ఓపెన్ యాక్సెస్‌లో విద్యుత్ విక్రయించుకునేందుకు 21 రోజుల్లో అనుమతులు.
కాప్టివ్/ఓపెన్యాక్సెస్/షెడ్యూల్డ్ వినియోగదారులు తాము ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను డిస్కంలకు ఇచ్చి తమకు అవసరమైనప్పుడు తిరిగి పొందవచ్చు. (ఫిబ్రవరి-జూన్ మధ్య కాలంతోపాటు సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల సమయం మినహా).
నివాస, వ్యాపార, పారిశ్రామిక భవనాలపై ‘సోలార్ రూఫ్ టాప్’(ఎస్ఆర్పీ)ల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లో అనుమతులు.