సమాజ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు
భీమవరం : విద్యార్థులు సమాజ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు చేయాలని, శాటిలైట్స్ రూపకల్పన చేసి విజయాన్ని సాధించాలని జాతీయ రిమోట్ సెన్సింగ్ సెంటర్ విభాగం హెడ్ ఇస్రో శాస్త్రవేత్త డాక్టర్ సీవీ రావు సూచించారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించే ట్రాన్స్–2017 జాతీయస్థాయి విద్యార్థి సింపోజియాన్ని గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. దేశ సాంకేతిక ప్రగతిని ప్రపంచానికి చాటడానికి ఇస్రో ఏకకాలంలో 104 శాటిలైట్లను ప్రయోగిస్తుందని, నూతనంగా ప్రయోగిస్తున్న ఉపగ్రహాల ద్వారా 60 సెంటీమీటర్ల రెజుల్యూషన్‌తో ఛాయా చిత్రాలు భూమికి అందిస్తుందన్నారు. ఆటోశాట్ టూ ఎస్ ఉపగ్రహం పట్టణాల అభివృద్ధికి ఉపయోగపడే విధంగా ప్రణాళికలను సిద్ద్ధం చేస్తుందన్నారు. రిసోర్సెస్ ఉపగ్రహం వ్యవసాయ సమాచారం అందిస్తుందని, క్షామపరిస్థితులు ఎదురైనప్పుడు నీటి వనరులు ఎక్కడెక్కడున్నాయనే సమాచారాన్ని అందిస్తుందని సీవీ రావు చెప్పారు. ఓషన్‌శాట్ ఉపగ్రహం వల్ల సముద్ర ఉపరితలంపై మార్పులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేయవచ్చని, తుపాను, సునామీల సమయంలో వాటి గమనాన్ని సమాచారం అందిస్తుందన్నారు. అనంతరం ట్రాన్స్ సింపోజియం సావనీర్‌ను ఆవిష్కరించారు. కళాశాల చైర్మన్ గోకరాజు మురళీరంగరాజు, డైరెక్టర్ సాగి విఠల్‌రంగరాజు, సీవీ రావును సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కేవీఎస్ఎన్ రాజు, ఈసీఈ విభాగం హెడ్ డాక్టర్ పి.రామరాజు, ప్రొఫెసర్ ఎన్.వెంకటేశ్వరరావు, వై.రామలక్ష్మణ్, కేఎన్వీ సురేష్‌వర్మ, కేఎన్వీ సత్యనారాయణ పాల్గొన్నారు.