కశ్యప్, ప్రణయ్ సంచలనం
♦ ప్రపంచ ఐదో, రెండో ర్యాంకర్స్పై గెలుపు
♦ శ్రీకాంత్‌కు చుక్కెదురు
♦ సింగపూర్ ఓపెన్ టోర్నీ
సింగపూర్ : అంచనాలకు మించి రాణించిన భారత బ్యాడ్మింటన్ స్టార్స్ పారుపల్లి కశ్యప్, హెచ్ఎస్ ప్రణయ్... సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్లో సంచలనాలు సృష్టించి క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. హైదరాబాద్ ప్లేయర్ కశ్యప్ ప్రపంచ ఐదో ర్యాంకర్ సన్ వాన్ హో (దక్షిణ కొరియా)ను బోల్తా కొట్టించగా... కేరళ కుర్రాడు ప్రణయ్ ప్రపంచ రెండో ర్యాంకర్ జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)ను ఇంటిముఖం పట్టించాడు. మరోవైపు ఇటీవల కాలంలో అద్భుత ఫామ్‌లో ఉన్న మూడో సీడ్ కిడాంబి శ్రీకాంత్‌కు మాత్రం ప్రిక్వార్టర్ ఫైనల్లో తనోంగ్సక్ సెన్సోమ్బూన్సుక్ (థాయ్‌లాండ్) చేతిలో చుక్కెదురైంది.
గతంలో సన్ వా హోతో ఆడిన రెండుసార్లూ ఓడిపోయిన కశ్యప్ మూడో ప్రయత్నంలో విజయం రుచి చూశాడు. 46 నిమిషాలపాటు జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో కశ్యప్ 21-15, 22-20తో సన్ వా హోను ఓడించాడు. తొలి గేమ్ ఆరంభంలో వెనుకబడ్డ కశ్యప్ ఆ తర్వాత తేరుకొని 14-9తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇదే ఆధిక్యాన్ని కాపాడుకుంటూ తొలి గేమ్‌ను దక్కించుకున్నాడు. హోరాహోరీగా సాగిన రెండో గేమ్‌లో కీలకదశలో కశ్యప్ పాయింట్లు నెగ్గి విజయాన్ని ఖాయం చేసుకున్నాడు. మరోవైపు రెండు వారాల వ్యవధిలో రెండోసారి ప్రపంచ రెండో ర్యాంకర్ జాన్ జార్గెన్‌సన్‌ను ప్రణయ్ ఓడించడం విశేషం.
గత నెలాఖర్లో ఇండియా ఓపెన్‌లో జార్గెన్‌సన్‌పై మూడు గేముల్లో నెగ్గిన ప్రణయ్ ఈసారి రెండు గేముల్లోనే గెలిచాడు. కేవలం 33 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో ప్రణయ్ 21-16, 21-8తో జార్గెన్‌సన్‌పై విజయం సాధించాడు. ప్రపంచ 19వ ర్యాంకర్ సెన్సోమ్బూన్సుక్తో జరిగిన మ్యాచ్‌లో శ్రీకాంత్ 15-21, 20-22తో ఓడిపోయాడు. మహిళల డబుల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్ప (భారత్) ద్వయం 22-24, 18-21తో మూడో సీడ్ జియోలి వాంగ్-యు యాంగ్ (చైనా) జంట చేతిలో ఓటమి పాలైంది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రైస్ లెవెర్డెజ్ (ఫ్రాన్స్)తో కశ్యప్; కెంటో మొమాటా (జపాన్)తో ప్రణయ్ తలపడతారు.