singer madhupriya
-
భర్తపై గాయని మధుప్రియ కేసు
♦ తల్లిదండ్రుల మాట వినకపోతే జీవితం నాశనం ♦ భర్త నన్ను చిత్రహింసలకు గురిచేశాడు ♦ పెళ్లైన మూణ్నెళ్లకే ఆస్తి కోసం వేధించాడు ♦ 6 నెలల వివాహ జీవితం 60 ఏళ్ల మైండ్ సెట్నిచ్చింది ♦ నా తల్లిదండ్రులను క్షమాపణలు కోరుతున్నా సాక్షి, హైదరాబాద్: ఆరు నెలల కిందట తల్లిదండ్రులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న గాయని మధుప్రియ.. తన భర్త వేధిస్తున్నాడంటూ శనివారం పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు హుమాయూన్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లయిన తర్వాత మధుప్రియ హుమాయూన్‌నగర్‌లో భర్త శ్రీకాంత్‌తో కలిసి నివాసం ఉంటోంది. మూడు నెలలపాటు బాగానే చూసుకొన్న శ్రీకాంత్.. తనకు కట్నంగా ఆస్తి తీసుకురావాలంటూ వేధింపులకు గురి చేయడంతో మధుప్రియ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు 498ఏ, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అమ్మానాన్న ఒప్పుకున్నాకే పెళ్లి చేసుకోవాలి.. పోలీసులకు ఫిర్యాదు చేసిన అనంతరం మధుప్రియ మీడియాతో మాట్లాడింది. ‘‘అమ్మాయిలు అమ్మా నాన్న చెప్పినట్లు వినకపోతే జీవితం నాలాగే సంకనాకి పోతుంది. నచ్చిన వాడికి కొన్ని పరీక్షలు పెట్టాక.. అమ్మా నాన్నలు ఒప్పుకొన్నాకే వాళ్లు తోడుంటేనే పెళ్లి చేసుకోవాలి’’ అని చెప్పారు. ‘‘నేను చాలా ఇష్టపడి శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకొన్నా. ఆ అబ్బాయి నన్ను డబ్బు కోసం వాడుకుంటాడనుకోలేదు. అమ్మా నాన్నలను ఎదిరించి పెళ్లి చేసుకొన్నా.. ఇప్పుడు నేను క్షమాపణలు కోరాల్సింది అమ్మానాన్నలనే. పెళ్లయిన 3 నెలలు శ్రీకాంత్ నన్ను బాగా చూసుకొన్నాడు. ఆ తర్వాత తల్లిదండ్రుల నుంచి ఆస్తి తీసుకురావాలని నిత్యం వేధిస్తూ చిత్ర హింసలకు గురిచేశాడు. ఇష్టం వచ్చినట్లు కొట్టాడు. కొన్నింటిని చెప్పుకోలేక పోతున్నా. ఏ అమ్మాయి అయినా.. అమ్మానాన్నలు ఓకే అన ్న తర్వాతే పెళ్లి చేసుకోవాలి. 6 నెలల పెళ్లి జీవితంతో 60 ఏళ్ల మైండ్ సెట్ ఇచ్చింది. 60 ఏళ్లు నేను స్ట్రాంగ్‌గా బతకగలను. ఈ సందర్భంగా అందరికీ క్షమాపణలు కోరుతున్నా. శ్రీకాంత్ లాంటి నీచపు వ్యక్తులున్నంత కాలం సమాజంలో ఆడపిల్లకు స్వేచ్ఛ లేదు. ఆడపిల్లలపై పాటలు పాడిన నేను నిజజీవితంలో ఎన్నో కష్టాలు అనుభవించా. ఇలాంటి నా కొడుకును ఏం చేసినా తప్పులేదు. నేను ఫైట్ చేసి పెళ్లి చేసుకొన్నా. నా గురించి మాట్లాడే రైట్ శ్రీకాంత్‌కు లేదు. పెళ్లయిన 3 నెలల తర్వాత అమ్మానాన్నల దగ్గరకెళ్లి ఆస్తి తీసుకురా అని వేధించడం స్టార్ట్ చేసిండు. ఆస్తి ఇవ్వనంటే కమిషనర్ దగ్గరకు వెళ్లి కేసు పెడదాం అన్నాడు. వాడికి పైసా సంపాదన లేదు. 6 నెలలుగా నేనే పోషించా. మా తల్లిదండ్రులు ఎప్పుడూ నన్ను ఏం అనలేదు. ఇంతజరిగినా ఇప్పటికీ వారు సంతోషపడుతున్నారు. నేను చాలా దెబ్బలు తిన్నాను. నాకు జ్ఞాపకశక్తి కూడా తగ్గింది. సమాజంలో ఆడపిల్లల గురించి... ఇకపై అసలు మధుప్రియగా వస్తాను. ఇలాంటి నా కొడుకులను నమ్మొద్దు. నమ్మి గోతిలో పడొద్దు. ప్రేమంటూ వెంట పడతారు... పెళ్లితో మోసం చేస్తారు. పనైపోగానే చేతులు దులుపుకొని పోతారు’’ అంటూ తన గోడు వెల్లబోసుకొంది. మీడియాతో మాట్లాడుతున్న సమయంలో మధుప్రియ సృ్పహ తప్పి పడిపోయారు. పోలీసులు వెంటనే స్పందించి ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మధుప్రియ చేసిన ఆరోపణలను ఆమె భర్త శ్రీకాంత్ తోసిపుచ్చారు. తాను ఆమెను ఎప్పుడూ కొట్టలేదని.. తాను కొట్టానని నిరూపిస్తే దేనికైనా సిద్ధమని ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ అన్నాడు. భర్త శ్రీకాంత్‌తో మధుప్రియ(ఫైల్) విలేకరులతో మాట్లాడుతూ స్పృహ తప్పిపడిపోయిన మధుప్రియ -
భర్తపై కేసు పెట్టిన సింగర్ మధుప్రియ
హైదరాబాద్: 'ఆడపిల్లనమ్మ' అంటూ వెలుగులోకి వచ్చిన వర్ధమాన గాయని మధుప్రియ వైవాహిక జీవితంలో అప్పుడే విభేదాలు వచ్చినట్టు కనిపిస్తోంది. భర్త శ్రీకాంత్ తనను వేధిస్తున్నాడని ఆమె పోలీసులను ఆశ్రయించారు. భర్తకు వ్యతిరేకంగా హుమయున్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నాలుగు నెలల క్రితమే మధుప్రియ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. మధుప్రియ ఒక్కరే పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ ఆమె వెంట పోలీసుస్టేషన్‌కు రాలేదు. ప్రేమవివాహం చేసుకున్న ఈ జంట మధ్య అతికొద్దికాలంలోనే విభేదాలు వచ్చినట్టు సమాచారం. ఆర్థిక అంశాలు, కుటుంబపరమైన అంశాల విషయంలో మధుప్రియ-శ్రీకాంత్ మధ్య గొడవలు వచ్చినట్టు చెప్తున్నారు. ఈ గొడవలు తీవ్రస్థాయికి చేరడంతోనే మధుప్రియ స్వయంగా పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేసి ఉంటుందని, ఇది ఇద్దరి మధ్య పెరిగిన దూరాన్ని సూచిస్తోందని సన్నిహితులు చెప్తున్నారు. ఇద్దరి మధ్య గొడవకు ప్రధాన కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. తల్లిదండ్రులను కూడా పోలీసు స్టేషన్ కు పిలిపించి వారి సమక్షంలో మధుప్రియను కుటుంబ కలహాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. నాలుగు నెలల కిందట నాటకీయ పరిణామాల మధ్య వర్ధమాన గాయని మధుప్రియ ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తన తల్లిదండ్రులకు ఇష్టంలేకున్నా, వారిని ఎదిరించి శ్రీకాంత్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. అతన్ని తాను ప్రేమించానని, తమ వివాహం చేయించాలని ఆమె అప్పట్లో పోలీసులను ఆశ్రయించారు. మధుప్రియ తల్లిదండ్రులు సుజాత-మల్లేష్ ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల జోక్యంతో వీరి పెళ్లి జరిగింది. -
గాయని మధుప్రియ వివాహం
నాటకీయ పరిణామాల మధ్య ఒక్కటైన ప్రేమజంట బెజ్జూర్ (కాగజ్‌నగర్): వర్ధమాన గాయని మధుప్రియ శుక్రవారం నాటకీయ పరిణామాల మధ్య ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వేకువజామున రెండు గంటల ప్రాంతంలో మధుప్రియ వివాహం చేసుకోబోయే శ్రీకాంత్ ఇంటికి ఆమె బంధువులు నాలుగు వాహనాల్లో వచ్చారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులతో గొడవపడి ఒక వాహనంలో మధుప్రియను తరలించారు. మూడు వాహనాలు మంచిర్యాల వైపు వెళ్లగా, మరో వాహనం కౌటాల వైపు వెళ్లింది. శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు బెల్లంపల్లి సమీపంలో మధుప్రియను తీసుకెళ్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మధుప్రియతో పాటు ఆమె తల్లిదండ్రులు సుజాత-మల్లేష్‌లను పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చా రు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కౌన్సెలింగ్ నిర్వహించారు. అనంతరం మధ్యాహ్నం 3.20 గంటలకు పోలీసు బందోబస్తు మధ్య ఆమె వివాహం జరిగింది. శ్రీకాంత్ అనే అబ్బాయిని ప్రేమించానని, తమ వివాహం చేయిం చాలని మధుప్రియ తమను ఆశ్రయిం చిందని సీఐ రమేష్‌బాబు తెలిపారు. ట్రాప్ చేశారు: మధుప్రియ తల్లి తన కూతురు మధుప్రియను శ్రీకాంత్ ట్రాప్ చేశాడని ఆమె తల్లి సుజాత ఆరోపించారు. మంచి భవిష్యత్తు ఉన్న అమ్మాయిని కావాలని నాశనం చేశారని ఆరోపించారు. వారం రోజుల నుంచి కూతురు కనబడడం లేదని, చివరకు కాగజ్‌నగర్‌లో ఉందని తెలుసుకుని వచ్చామని రోదించింది. ఇష్టంతోనే పెళ్లి చేసుకున్న: మధుప్రియ శ్రీకాంత్‌ను ప్రేమిస్తున్నానని, తన ఇష్టంతోనే అతడిని పెళ్లి చేసుకున్నానని మధుప్రియ వెల్లడించింది. తనకు తల్లిదండ్రుల ఆశీస్సు లెప్పుడూ ఉంటాయని పేర్కొంది. -
సాయంత్రం మధుప్రియ పెళ్లి
ఆదిలాబాద్: వర్ధమాన గాయని మధుప్రియ తన అభీష్టం మేరకు ప్రియుడు శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకోబోతోంది. శుక్రవారం సాయంత్రం వీరిద్దరి వివాహం జరగనుంది. మధుప్రియ ప్రేమ వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరిన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పోలీసులు ఇరు కుటుంబాలను పిలిపించి ఈ విషయంపై చర్చించారు. శ్రీకాంత్‌తో పెళ్లికి మధుప్రియ తల్లిదండ్రులు అంగీకరించలేదు. కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదని చెప్పారు. అయితే శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకోవడానికే ఆమె మొగ్గుచూపింది. ఆఖరుకు మధుప్రియ తల్లిదండ్రులు తమ పెళ్లి రోజైన నవంబర్ 18న పెళ్లి చేస్తామని ప్రాధేయపడినా మధుప్రియ ఒప్పుకోలేదు. దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ నుంచి వెళ్లిపోయారు. కాగజ్‌నగర్‌కు చెందిన మంగి శ్రీకాంత్‌తో మధుప్రియ ప్రేమ వ్యవహారం రెండేళ్లుగా సాగుతోంది. నెల రోజుల క్రితమే మేజర్ అయిన మధుప్రియ.. శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దాంతో సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని వాసవీ గార్డెన్స్‌లో శుక్రవారం ఉదయం 11.20కి వీరిద్దరికీ పెళ్లి చేయాలని శ్రీకాంత్ తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే, వీళ్ల పెళ్లికి మధుప్రియ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో ఉదయం జరగలేదు. ఇరు కుటుంబాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. చివరకు మధుప్రియ ఇష్టప్రకారం ఈ రోజు సాయంత్రం ఆమె పెళ్లి జరగనుంది. -
పోలీసు స్టేషన్‌కు చేరిన మధుప్రియ ప్రేమ వ్యవహారం
-
పోలీసు స్టేషన్‌కు చేరిన మధుప్రియ ప్రేమ వ్యవహారం
వర్ధమాన గాయని మధుప్రియ ప్రేమ వ్యవహారం ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ‘ఆడపిల్లనమ్మా...’ పాటతో గాయనిగా ప్రాచుర్యం పొందిన మధుప్రియ ప్రేమ వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరింది. ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌కు చెందిన మంగి శ్రీకాంత్‌తో మధుప్రియ ప్రేమ వ్యవహారం రెండేళ్లుగా సాగుతోంది. నెల రోజుల క్రితమే మేజర్ అయిన మధుప్రియ.. ఇక శ్రీకాంత్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. దాంతో సిర్పూర్ కాగజ్‌నగర్‌లోని వాసవీ గార్డెన్స్‌లో శుక్రవారం ఉదయం 11.20కి వీరిద్దరికీ పెళ్లి చేయాలని శ్రీకాంత్ తల్లిదండ్రులు నిర్ణయించారు. అయితే, వీళ్ల పెళ్లికి మధుప్రియ తల్లిదండ్రులు అంగీకరించలేదు. కెరీర్ మీద దృష్టి పెట్టాల్సిన వయసులో అప్పుడే పెళ్లి చేసుకోవడం సరికాదని చెప్పారు. కానీ, పెళ్లివైపే మొగ్గుచూపిన మధుప్రియ.. రెండు రోజుల క్రితం కాగజ్‌నగర్‌లోని శ్రీకాంత్ ఇంటికి చేరుకుంది. శుక్రవారం ఉదయం 11.20 నిమిషాలకు పెళ్లి చేసేందుకు నిర్ణయించిన శ్రీకాంత్ తల్లిదండ్రులు ఈ మేరకు శుభలేఖలు కూడా పంచారు. దీంతో మధుప్రియ బంధువులు శ్రీకాంత్ ఇంటిపై దాడి చేసి, ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లికి అంగీకరించేది లేదని, పెళ్లి జరగనివ్వబోమని చెప్పినట్లు తెలిసింది. పెళ్లికి మధుప్రియ తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో.. ఆమె ప్రేమ వ్యవహారం బెడిసికొట్టి పోలీసు స్టేషన్ వరకు వెళ్లింది. గురువారం అర్ధరాత్రి సమయంలో మధుప్రియ తల్లిదండ్రులు కాగజ్‌నగర్‌లోని శ్రీకాంత్ ఇంటి వద్దకు చేరుకుని గొడవ చేయడంతో ప్రేమ జంట డీఎస్పీ చక్రవర్తిని ఆశ్రయించారు. దీంతో పోలీసులు వారికి రక్షణ కల్పించారు. అనంతరం వాళ్లిద్దరికీ కౌన్సెలింగ్ చేశారు. అయితే తాము మేజర్లం కాబట్టి పెళ్లి చేసుకుంటామని మధుప్రియ, శ్రీకాంత్ వాదిస్తున్నట్లు తెలిసింది. మరోవైపు వీళ్ల పెళ్లిపై ఇరువైపులా బంధువులు పోలీసు స్టేషన్లో వేర్వేరుగా ఫిర్యాదులు ఇచ్చారు. మధుప్రియ కుటుంబం హైదరాబాద్‌లోని నల్లకుంటలో నివాసం ఉంటుంది. అక్కడే ఆమెకు శ్రీకాంత్‌తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. శ్రీకాంత్ స్వస్థలం ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్. మధుప్రియ, శ్రీకాంత్ ఇద్దరూ మేజర్లు కావడం, వాళ్లకు పెళ్లి చేసుకోవడం ఇష్టం కావడంతో వాళ్ల పెళ్లికి తమకు అభ్యంతరం ఏమీ లేదని డీఎస్పీ చక్రవర్తి తెలిపారు.