
భర్తపై కేసు పెట్టిన సింగర్ మధుప్రియ
హైదరాబాద్: 'ఆడపిల్లనమ్మ' అంటూ వెలుగులోకి వచ్చిన వర్ధమాన గాయని మధుప్రియ వైవాహిక జీవితంలో అప్పుడే విభేదాలు వచ్చినట్టు కనిపిస్తోంది. భర్త శ్రీకాంత్ తనను వేధిస్తున్నాడని ఆమె పోలీసులను ఆశ్రయించారు. భర్తకు వ్యతిరేకంగా హుమయున్ నగర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. నాలుగు నెలల క్రితమే మధుప్రియ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
మధుప్రియ ఒక్కరే పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులు కానీ, బంధువులు కానీ ఆమె వెంట పోలీసుస్టేషన్‌కు రాలేదు. ప్రేమవివాహం చేసుకున్న ఈ జంట మధ్య అతికొద్దికాలంలోనే విభేదాలు వచ్చినట్టు సమాచారం. ఆర్థిక అంశాలు, కుటుంబపరమైన అంశాల విషయంలో మధుప్రియ-శ్రీకాంత్ మధ్య గొడవలు వచ్చినట్టు చెప్తున్నారు. ఈ గొడవలు తీవ్రస్థాయికి చేరడంతోనే మధుప్రియ స్వయంగా పోలీసు స్టేషన్ కు ఫిర్యాదు చేసి ఉంటుందని, ఇది ఇద్దరి మధ్య పెరిగిన దూరాన్ని సూచిస్తోందని సన్నిహితులు చెప్తున్నారు. ఇద్దరి మధ్య గొడవకు ప్రధాన కారణం ఏమిటన్నది తెలియాల్సి ఉంది. తల్లిదండ్రులను కూడా పోలీసు స్టేషన్ కు పిలిపించి వారి సమక్షంలో మధుప్రియను కుటుంబ కలహాల గురించి పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం.
నాలుగు నెలల కిందట నాటకీయ పరిణామాల మధ్య వర్ధమాన గాయని మధుప్రియ ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. తన తల్లిదండ్రులకు ఇష్టంలేకున్నా, వారిని ఎదిరించి శ్రీకాంత్ ను ఆమె పెళ్లి చేసుకున్నారు. అతన్ని తాను ప్రేమించానని, తమ వివాహం చేయించాలని ఆమె అప్పట్లో పోలీసులను ఆశ్రయించారు. మధుప్రియ తల్లిదండ్రులు సుజాత-మల్లేష్ ఈ పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. దీంతో పోలీసుల జోక్యంతో వీరి పెళ్లి జరిగింది.